ఒక్క ఫామ్ నింపేందుకు ప్రభుత్వ ఉద్యోగులు, పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వారు సైతం వెనుకడుగు వేస్తున్నారు. కానీ, ఈమె మాత్రం ముందడుగు వేస్తోంది! SIR సర్వేలో విద్యావంతులు, యువత పెద్దగా ముందుకు రాని పరిస్థితుల్లో ఓ దివ్యాంగురాలు మాత్రం ‘సేవకు శరీరమే కాదు… సంకల్పం ముఖ్యం’ అని నిరూపిస్తోంది. వందలాది మంది ప్రజలకు సేవ చేస్తూ.. SIR ప్రక్రియలో ఆదర్శంగా నిలుస్తోంది! స్వచ్ఛందంగా 800కు పైగా గణన నమోదు పత్రాలు పూర్తి చేసి ప్రశంసలు అందుకుంటోంది! ఆ దివ్యాంగురాలు ఎవరో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
సాధారణంగా ప్రభుత్వ కార్యక్రమం అంటే ఉద్యోగులు, అధికారులు, సిబ్బంది కనిపిస్తారు. కానీ నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో జరుగుతున్న SIR ప్రత్యేక సర్వేలో మాత్రం ఓ దివ్యాంగురాలు తన సేవా తపనతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. శారీరక వైకల్యం ఉన్నా సమాజానికి ఉపయోగపడాలనే సంకల్పంతో స్వచ్ఛందంగా SIR గణన ప్రక్రియలో భాగస్వామ్యమైంది.
మిర్యాలగూడ పట్టణం 29వ వార్డుకు చెందిన బైక్ మెకానిక్ వెంకటాచారి, కళావతి దంపతుల రెండో సంతానం శివాని. పీజీ వరకు చదువుకున్న శివాని దివ్యంగురాలు. వార్డులో SIR ప్రోగ్రాం కొనసాగుతుండగా, తన గణన నమోదు పత్రాన్ని పూరించేందుకు వార్డు చౌరస్తాకు వెళ్ళింది. కానీ అక్కడ వార్డు ప్రజలు SIR పత్రాలు నింపేందుకు ఇబ్బందులు పడడం చూసింది. SIR ప్రక్రియలో వార్డు ప్రజలకు సహాయపడాలని శివాని భావించింది. కొద్ది రోజులుగా ప్రజలకు అందుబాటులో ఉంటూ SIR పై అవగాహన కల్పిస్తూ… గణన నమోదు పత్రాలను స్వయంగా పూరిస్తోంది. ఇప్పటి వరకు 800కు పైగా ఫారాలను పూర్తి చేసి అధికారుల ప్రశంసలు అందుకుంది.

శివానిని అభినందిస్తున్న కాంగ్రెస్ నాయకులు
తన స్నేహితులు, బంధువులకు ఫోన్ చేస్తూ SIR సర్వేలో నమోదు చేసుకోవాలంటూ చైతన్యవంతులను చేస్తోంది. ప్రజలు కూడా ఆమె సేవాభావానికి ఫిదా అవుతున్నారు. “మనకు సహాయం చేయడానికి ఇంత కష్టపడుతున్న ఈమె నిజంగా స్ఫూర్తిదాయకం” అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. దివ్యాంగురాలు శివాని.. ఓటరు గణన నమోదు పత్రాల పూరింపులో చురుకుగా వ్యవహరించడాన్నీ స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి చూసి అబ్బుర పడ్డారు. ఆయనతోపాటు పలువురు ప్రజాప్రతినిధులు ఆమెను ప్రత్యేకంగా అభినందిస్తున్నారు.
ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడానికి చాలామంది వెనుకడుగు వేస్తున్న ఈ రోజుల్లో తన వ్యక్తిగత ఇబ్బందులను పక్కనబెట్టి సమాజ సేవనే లక్ష్యంగా పెట్టుకున్న ఈ దివ్యాంగురాలు నిజంగా ఆదర్శం. SIRలో ఆమె పూరించినవి కేవలం 800 ఫారాలు మాత్రమే కాదు, వందలాది మందిలో సేవాస్ఫూర్తిని శివాని నింపింది. కాగా, పీజీ చదువుకుని స్వచ్ఛందంగా SIR ప్రక్రియలో సేవలందిస్తున్న దివ్యాంగురాలు శివాని ప్రతిభకు తగిన కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విభాగంలో ఉపాధి కల్పించాలని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి జిల్లా కలెక్టర్‌ను కోరారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి