చీమల నివారణకు సహజ సిద్ధమైన మార్గం: ఇంట్లో లేదా వంటగది మూలల్లో చీమల బెడద ఎక్కువగా ఉంటే కెమికల్ స్ప్రేలు వాడాల్సిన అవసరం లేదు. చీమలు తిరిగే దారుల్లో లేదా గుమ్మం దగ్గర కొద్దిగా ఉప్పు చల్లడం వల్ల లేదా ఉప్పు కలిపిన నీటితో నేలను తుడవడం వల్ల చీమలు వెంటనే పారిపోతాయి.
టీ, కాఫీ మరకలను సులభంగా వదిలించడం: కప్పులు లేదా గ్లాసులపై తరచూ పడే టీ, కాఫీ మరకలు సాధారణ సబ్బుతో కడిగినా త్వరగా వదిలిపోవు. అలాంటి సమయంలో కప్పులో కొద్దిగా ఉప్పు వేసి, తడి గుడ్డ లేదా స్పాంజ్‌తో రుద్దితే ఆ మొండి మరకలు క్షణాల్లో మాయమై పాత్రలు కొత్తవిలా మెరుస్తాయి.
పాత్రలపై జిడ్డు, మాడిన గుర్తుల తొలగింపు: వంట చేసేటప్పుడు బాణలి లేదా గిన్నెలు మాడిపోయినా, విపరీతమైన జిడ్డు పట్టినా ఉప్పు బాగా ఉపయోగపడుతుంది. మాడిన పాత్రలో కొద్దిగా నీరు, ఉప్పు వేసి కాసేపు నానబెట్టిన తర్వాత తోమితే జిడ్డు, మాడిన పదార్థం సులభంగా ఊడివస్తుంది.
పండ్లు, కూరగాయల శుభ్రత: మార్కెట్ నుండి తెచ్చిన పండ్లు, కూరగాయలపై ఉండే క్రిమిసంహారకాలు, బ్యాక్టీరియాను తొలగించడానికి ఒక పాత్రలో నీరు తీసుకుని అందులో గుప్పెడు ఉప్పు వేసి నానబెట్టాలి. 10-15 నిమిషాల తర్వాత మంచి నీటితో కడిగితే అవి పూర్తిగా శుభ్రపడతాయి.
సింక్ దుర్వాసన, అడ్డుపడటం నివారించడం: సింక్ డ్రెయిన్ పైపుల్లో కొవ్వు, జిడ్డు పేరుకుపోయి దుర్వాసన వస్తుంటే.. వేడి నీటిలో ఉప్పు కలిపి పైపులో పోయాలి. ఇది జిడ్డును కరిగించి దుర్వాసనను అదుపు చేస్తుంది. తక్కువ ఖర్చుతో, ఎటువంటి రసాయనాలు లేకుండా ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవడానికి ఉప్పు ఒక గొప్ప సహజసిద్ధమైన మార్గం. ఈ సులభమైన చిట్కాలను పాటించడం వల్ల సమయంతో పాటు డబ్బూ ఆదా అవుతుంది.




