ఎండకాలం వచ్చిందంటే చాలూ చల్లని పానియాల కోసంజనాలు ఎగబడతారు.వీటిలో లస్సీ కూడా ఒకటి. శరీరాన్ని చల్లబరచడానికి లస్సీ ఎంతో మేలు చేస్తుంది. అయితే, ప్రతిరోజూ అదే పాత సాధారణ లస్సీ తాగి బోర్ కొడుతుంటే.. కొబ్బరిలోని చలువ, పెరుగులోని పోషకాలతో కలిపి చేసే కోకోనట్ లస్సీ వేసవికి ఒక అద్భుతమైన ఎంపిక. దీన్ని మీరు ఇంట్లోనే సింపుల్‌గా చేసుకోవచ్చు
కొబ్బరి లస్సీ కావలసిన పదార్థాలు చూసుకుంటే.. తాజా పెరుగు 2 కప్పులు, 1 కప్పు కొబ్బరి పాలు లేదా తురిమిన పచ్చి కొబ్బరి, అరకప్పు కొబ్బరి నీళ్లు, రుచికి తగినంత చక్కెర లేదా పటిక బెల్లం పొడి, ఒక చిటికెడు యాలకుల పొడి, 4-5 ఐస్ క్యూబ్స్, గార్నిష్ కోసం సన్నగా తరిగిన ఎండు కొబ్బరి ముక్కలు,బాదం పప్పులు. ఇవి ఉంటే సరిపోతుంది.
కొబ్బరిపాల లస్సీ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ లేదా బ్లెండర్లో చిక్కటి పెరుగు, కొబ్బరి పాలు వేయండి. ఒకవేళ మీరు పచ్చి కొబ్బరి వాడుతుంటే, దానిని ముందే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.అందులో రుచికి సరిపడా చక్కెర, యాలకుల పొడి, కొన్ని ఐస్ క్యూబ్స్ వేయండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని 1-2 నిమిషాల పాటు బాగా బ్లెండ్ చేయండి. లస్సీ పైన నురగ వచ్చి, సాఫ్ట్‌గా అయ్యే వరకు తిప్పాలి.
లస్సీ మరీ చిక్కగా అనిపిస్తే, కొద్దిగా కొబ్బరి నీళ్లు కలిపి మళ్ళీ ఒకసారి బ్లెండ్ చేయండి. సిద్ధమైన కొబ్బరి లస్సీని గ్లాసుల్లోకి తీసుకుని, పైన కొబ్బరి తురుము లేదా డ్రై ఫ్రూట్స్ ముక్కలతో గార్నిష్ చేసి చల్లచల్లగా సర్వ్ చేసుకోండి. ఈ వేసవిలో మండె ఎండల నుంచి శరీరాన్ని చల్లగా ఉంచుకునేందుకు వెరైటీగా ఈ పానీయాన్ని ప్రయత్నించి రిఫ్రెష్‌గా ఫీల్ అవ్వండి.
కొబ్బరి లస్సీ ప్రయోజనాలు తాగడం వల్ల కలిగచే ప్రయోజనాల విషయానికి వస్తే.. కోకోనట్ లస్సీ కేవలం రుచిలోనే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కొబ్బరి సహజంగానే చలువ చేసే గుణం కలిగి ఉండటం వల్ల ఇది మీ కడుపుకు రెట్టింపు ఉపశమనాన్ని ఇస్తుంది. ఇది మీకు తాజాదనంతో పాటు కావాల్సిన శక్తిని కూడా అందిస్తుంది.




