Credit Card Recovery Agents: క్రెడిట్ కార్డ్ బిల్లులు చెల్లించలేదని రికవరీ ఏజెంట్లు కస్టమర్లపై భౌతిక దాడులకు దిగడం లేదా వేధించడం వంటి సంఘటనలు అప్పుడప్పుడు వార్తల్లో నిలుస్తుంటాయి. ఇలాంటి వేధింపుల నుండి సామాన్యులను రక్షించడానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) కఠినమైన మార్గదర్శకాలను అమలు చేస్తోంది.
రికవరీ ఏజెంట్ల కోసం ఆర్‌బీఐ నిబంధనలు:
- సమయ పాలన: రికవరీ ఏజెంట్లు రుణగ్రహీతలకు ఉదయం 8 గంటల నుండి రాత్రి 7 గంటల మధ్య మాత్రమే ఫోన్ చేయాలి లేదా వారి ఇంటికి వెళ్లాలి. అర్ధరాత్రి వేళల్లో ఫోన్ చేయడం నిబంధనలకు విరుద్ధం.
- అగౌరవంగా ప్రవర్తించకూడదు: కస్టమర్లను బూతులు తిట్టడం, శారీరక దాడి చేయడం లేదా మానసికంగా వేధించడం వంటివి చేయకూడదు. రికవరీ ఏజెంట్లు ఎప్పుడూ మర్యాదగా ప్రవర్తించాలి.
- గోప్యత (Privacy): కస్టమర్ అప్పు గురించి వారి బంధువులకు, స్నేహితులకు లేదా ఇరుగుపొరుగు వారికి చెప్పి పరువు తీయకూడదు. సమాచారాన్ని గోప్యంగా ఉంచాలి.
- గుర్తింపు కార్డు: ఏజెంట్ కస్టమర్ ఇంటికి వచ్చినప్పుడు, బ్యాంక్ జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డును తప్పనిసరిగా చూపించాలి.
- బెదిరింపులు: తప్పుడు పోలీసు కేసులు పెడతామని లేదా జైలుకు పంపిస్తామని బెదిరించడం చట్ట విరుద్ధం.
మీపై వేధింపులు జరిగితే ఏం చేయాలి?
- బ్యాంకులో ఫిర్యాదు: ముందుగా సదరు బ్యాంక్ నోడల్ ఆఫీసర్‌కు లేదా కస్టమర్ కేర్‌కు రాతపూర్వక ఫిర్యాదు చేయండి.
- RBI అంబుడ్స్‌మన్: బ్యాంక్‌లో ఫిర్యాదు చేసిన 30 రోజుల్లోపు సరైన స్పందన రాకపోతే, మీరు RBI Ombudsman కు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయవచ్చు.
- పోలీస్ రిపోర్ట్: ఒకవేళ ఏజెంట్లు మీపై భౌతిక దాడికి దిగినా లేదా తీవ్రంగా బెదిరించినా వెంటనే దగ్గరలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయండి.
- సాక్ష్యాలు: ఏజెంట్లు చేసే ఫోన్ కాల్స్‌ను రికార్డ్ చేయడం లేదా వారు ఇంటికి వచ్చినప్పుడు వీడియో తీయడం (సాక్ష్యం కోసం) వంటివి మీకు ఉపయోగపడతాయి.
బ్యాంకుల నుండి తీసుకున్న అప్పును తిరిగి చెల్లించడం కస్టమర్ బాధ్యత. అయితే, వసూలు చేసే ప్రక్రియ చట్టబద్ధంగా ఉండాలి కానీ, దౌర్జన్యంగా ఉండకూడదు. నిబంధనలు ఉల్లంఘించే బ్యాంకులపై భారీ జరిమానాలు విధించే అధికారం ఆర్‌బీఐకి ఉంది.
ఇది కూడా చదవండి: మహిళలకు శుభవార్త.. దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే..!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి