అస్థిరతతో కూడిన స్టాక్ మార్కెట్ పరిస్థితుల్లో కూడా పెట్టుబడిదారులకు స్థిరమైన మార్గంగా నిలుస్తున్నది సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (SIP). ప్రతి నెలా ఒక నిర్దిష్ట మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడిగా పెట్టడం ద్వారా, చిన్న మొత్తాన్ని కూడా దీర్ఘకాలంలో భారీ నిధిగా మార్చుకోవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కాంపౌండింగ్ ప్రభావం వల్ల, కాలక్రమేణా పెట్టుబడిపై లాభాలు గణనీయంగా పెరుగుతాయి. సాధారణంగా దీర్ఘకాలంలో SIPలపై సగటు రాబడి సుమారు 12 శాతంగా పరిగణించబడుతుంది. ఈ రాబడిని ఆధారంగా తీసుకుంటే, రూ.10 కోట్ల నిధిని సృష్టించడానికి పెట్టుబడి మొత్తానికి అనుగుణంగా సమయం మారుతుంది.
ఉదాహరణకు నెలకు రూ.10,000 SIP పెట్టే వారు సుమారు 38 సంవత్సరాలకు పైగా వేచి ఉండాల్సి ఉంటుంది. అదే రూ.20,000 పెట్టుబడి పెడితే సుమారు 33 సంవత్సరాలు, రూ.30,000 పెట్టితే 29 సంవత్సరాలు, రూ.50,000 పెట్టుబడితో సుమారు 25 సంవత్సరాలు పడుతుంది. నెలకు రూ.1 లక్ష పెట్టుబడి పెడితే, సుమారు 20 సంవత్సరాల్లోనే రూ.10 కోట్ల లక్ష్యాన్ని చేరుకోవచ్చు.
అయితే త్వరగా లక్ష్యాన్ని చేరుకోవాలనుకునే వారికి స్టెప్ అప్ SIP మంచి ప్రత్యామ్నాయంగా నిలుస్తోంది. ఇందులో ప్రతి సంవత్సరం SIP మొత్తాన్ని 5 నుంచి 10 శాతం వరకు పెంచుతూ వెళ్తారు. ఉదాహరణకు నెలకు రూ.20,000తో ప్రారంభించే సాధారణ SIPకు 32 సంవత్సరాలకు పైగా సమయం పడితే, అదే మొత్తాన్ని ప్రతి సంవత్సరం పెంచుతూ పెట్టే స్టెప్-అప్ SIP ద్వారా సుమారు 26 సంవత్సరాల్లోనే లక్ష్యాన్ని చేరుకోవచ్చు. మార్కెట్ హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ, SIP విధానం వల్ల సగటు ధరకు యూనిట్లు కొనుగోలు చేయడం సాధ్యమవుతుంది, దీని వల్ల ప్రమాదం కొంతవరకు తగ్గుతుంది. అయితే నిపుణుల సూచన ప్రకారం SIPలో విజయానికి క్రమశిక్షణ, దీర్ఘకాలిక దృష్టి మరియు పెట్టుబడిని మధ్యలో ఆపకుండా కొనసాగించడం అత్యంత కీలకం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి