
తక్కువ ధరల్లో నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయాలంటే చాలా మంది ముందుగా గుర్తుకు తెచ్చుకునే పేరు డీమార్ట్ (DMart). దేశవ్యాప్తంగా వందలాది శాఖలతో వినియోగదారులకు అందుబాటులో ఉన్న ఈ రిటైల్ చైన్‌లో కిరాణా సామగ్రి నుంచి గృహోపకరణాలు, దుస్తులు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు, పిల్లల వస్తువులు వరకు అన్నీ ఒకే చోట లభిస్తాయి. ముఖ్యంగా ఇతర దుకాణాలతో పోలిస్తే తక్కువ ధరలు, ఆకర్షణీయమైన ఆఫర్లు ఉండటంతో ప్రతి నెల వేలాది కుటుంబాలు డీమార్ట్‌లోనే షాపింగ్ చేయడానికి ఆసక్తి చూపుతున్నాయి.
డీమార్ట్‌లో ధరలు తక్కువగా ఉండటానికి ప్రధాన కారణం కంపెనీల నుంచి నేరుగా భారీ మొత్తంలో సరుకులను కొనుగోలు చేయడమే. దేశవ్యాప్తంగా ఉన్న శాఖల అవసరాలకు అనుగుణంగా పెద్ద ఎత్తున ఆర్డర్లు ఇవ్వడం వల్ల తయారీ సంస్థలు తక్కువ ధరలకు సరుకులను సరఫరా చేస్తాయి. ఈ ప్రయోజనాన్ని డీమార్ట్ వినియోగదారులకు అందించడంతో అనేక వస్తువులు మార్కెట్ ధర కంటే తక్కువకు లభిస్తుంటాయి. కొన్ని ఉత్పత్తులపై బై వన్ గెట్ వన్ వంటి ప్రత్యేక ఆఫర్లు కూడా తరచూ కనిపిస్తాయి.
అయితే డీమార్ట్‌లో ఏ రోజు షాపింగ్ చేస్తే ఎక్కువ తగ్గింపులు, తక్కువ రద్దీ ఉంటుందనే సందేహం చాలామందిలో ఉంటుంది. రిటైల్ రంగ నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రతి నెల చివరి రోజు షాపింగ్‌కు అనుకూలమైన సమయంగా భావిస్తారు. నెల 30వ తేదీతో ముగిస్తే 30వ తేదీ, 31 రోజులు ఉన్న నెలల్లో 31వ తేదీన వెళ్లడం ద్వారా కొన్ని ఉత్పత్తులపై మంచి ఆఫర్లు దొరికే అవకాశం ఉంటుంది. అదే సమయంలో ఇతర రోజుల కంటే రద్దీ కూడా కొంత తక్కువగా ఉండే అవకాశముందని చెబుతున్నారు.
అలాగే ఉదయం స్టోర్ తెరిచిన వెంటనే లేదా మధ్యాహ్నం ప్రారంభ సమయంలో వెళ్లడం మంచిదని సూచిస్తున్నారు. ఈ సమయంలో షాపింగ్‌ను ప్రశాంతంగా పూర్తి చేయడంతో పాటు అందుబాటులో ఉన్న ఆఫర్లను సులభంగా పరిశీలించే అవకాశం ఉంటుంది. నెలకు అవసరమైన కిరాణా, గృహోపకరణాలను ఒకేసారి కొనుగోలు చేయాలనుకునేవారికి ఈ సమయం మరింత అనుకూలంగా ఉండొచ్చు. అయితే గమనించాల్సిన విషయం ఏమిటంటే, డిస్కౌంట్లు, ప్రత్యేక ఆఫర్లు ప్రతి శాఖలో ఒకే విధంగా ఉండకపోవచ్చు. స్థానిక స్టోర్ విధానాలు, స్టాక్ లభ్యత, ప్రచార కార్యక్రమాలను బట్టి ఆఫర్లు మారే అవకాశం ఉంటుంది. కాబట్టి షాపింగ్‌కు వెళ్లే ముందు సమీప డీమార్ట్ స్టోర్‌లో అందుబాటులో ఉన్న ఆఫర్లను ఒకసారి పరిశీలించడం మంచిది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి