Headlines

అకారణంగా ఉద్యోగం తొలగించారంటూ టెక్ మహీంద్రపై మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పోలీసులకు ఫిర్యాదు

అకారణంగా ఉద్యోగం తొలగించారంటూ టెక్ మహీంద్రపై మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పోలీసులకు ఫిర్యాదు


హైదరాబాద్‌కు చెందిన టెక్ మహీంద్రలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న భావన అనే మహిళా ఉద్యోగిని తనను అకారణంగా ఉద్యోగం నుంచి తొలగించారని ఆరోపిస్తూ గురువారం దుండిగల్ పోలీసులను ఆశ్రయించారు. అనారోగ్య సమస్యల కారణంగా సెలవులు తీసుకోవడంతో కంపెనీ యాజమాన్యం తనపై వేధింపులకు పాల్పడిందని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. భావన తెలిపిన వివరాల ప్రకారం.. ఆరోగ్య సమస్యల కారణంగా సెలవు తీసుకోవాల్సి వచ్చినప్పటికీ, ముందుగానే సమాచారం ఇచ్చి వైద్య నివేదికలు సమర్పించినా యాజమాన్యం తన పరిస్థితిని పట్టించుకోలేదని ఆరోపించారు. విశ్రాంతి అవసరమైన సమయంలో కూడా వరుసగా ఈ-మెయిల్స్, ఫోన్ కాల్స్ చేస్తూ వెంటనే విధుల్లో చేరాలని తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారని తెలిపారు.

అనంతరం తన చిన్నారి ఆరోగ్యం కూడా బాగోలేక మళ్లీ సెలవు తీసుకోవాల్సి వచ్చిందని, ఆ సమయంలో కూడా ఇంకెన్ని రోజులు సెలవులో ఉంటారు? అంటూ యాజమాన్యం ప్రశ్నించిందని చెప్పారు. చివరకు ఎలాంటి ముందస్తు నోటీసు లేదా వివరణ కోరకుండా తనను ఉద్యోగం నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు.

వాష్‌రూమ్‌కు వెళ్లాలన్నా అనుమతి తప్పనిసరి..!

కంపెనీలో ఉద్యోగులపై అమలవుతున్న నిబంధనలపై కూడా భావన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆఫీసులో వాష్‌రూమ్‌కు వెళ్లాలన్నా ముందస్తు అనుమతి తీసుకోవాల్సి వస్తోందని, ఇది ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధానమని ఆరోపించారు. తన వృత్తి జీవితంలో ఇంత కఠినమైన పని సంస్కృతిని ఎప్పుడూ చూడలేదని పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళా ఉద్యోగులకు ఉద్యోగ బాధ్యతలతో పాటు కుటుంబం, పిల్లల సంరక్షణ వంటి అదనపు బాధ్యతలు కూడా ఉంటాయని, అనారోగ్యం లేదా అత్యవసర పరిస్థితుల్లో కార్పొరేట్ సంస్థలు మరింత మానవత్వంతో వ్యవహరించాలని ఆమె సూచించారు.

న్యాయం చేయాలని పోలీసులకు విజ్ఞప్తి

తనకు జరిగిన అన్యాయంపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని కోరుతూ భావన దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐటీ రంగంలోని మహిళా ఉద్యోగుల పట్ల యాజమాన్యాలు సున్నితంగా వ్యవహరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అయితే, భావన చేసిన ఆరోపణలపై టెక్ మహీంద్ర సంస్థ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అలాగే ఈ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారా లేదా ప్రాథమిక విచారణ చేపట్టారా అనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అయితే, పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం భావన.. టెక్ మహీంద్ర సంస్థ ముందు ధర్నాకు దిగారు.

ఈ ఘటనతో ఐటీ రంగంలో ఉద్యోగుల హక్కులు, కార్యాలయ పని సంస్కృతి (Work Culture), వర్క్-లైఫ్ బ్యాలెన్స్ వంటి అంశాలపై మరోసారి చర్చ మొదలైంది. ప్రస్తుతం ఈ వ్యవహారంపై పోలీసుల విచారణతో పాటు కంపెనీ స్పందన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

వీడియో చూడండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *