Headlines

ఇక బట్టీ పట్టి రాస్తే మార్కులు రావ్‌.. ఇంటర్ క్వశ్చన్‌ పేపర్లలో కీలక మార్పులు!


అమరావతి, నవంబర్ 15: రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యార్థులకు కీలక అప్‌డేట్‌. రాష్ట్రంలో 2027-28 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ప్రశ్నపత్రాల విధానంలో పలు మార్పులు తీసుకురావడానికి ఇంటర్ విద్యా మండలి కసరత్తు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన PARAKH (పరఖ్) నిబంధనలకు అనుగుణంగా ప్రశ్నపత్రాల రూపకల్పనలో మార్పులు చేయాలని నిర్ణయించింది. విద్యార్థులు పాఠ్యాంశాలను కంఠస్థం చేసి సమాధానాలు రాసే విధానానికి స్వస్తి పలికి, వారి విషయ పరిజ్ఞానం, అవగాహన, విశ్లేషణ సామర్థ్యాలను పరీక్షించేలా కొత్త విధానాన్ని తీసుకురానుంది.

ప్రశ్నపత్రాల్లో 10 శాతం సృజనాత్మక ప్రశ్నలు

ప్రస్తుతం ఇంటర్మీడియట్ పాఠ్యపుస్తకాల్లో ప్రతి పాఠం చివర ఇచ్చిన ప్రశ్నల నుంచే ఎక్కువగా పబ్లిక్ పరీక్షల్లో ప్రశ్నలు వస్తున్నాయి. దీంతో విద్యార్థులు సమాధానాలను బట్టీ పట్టి పరీక్షల్లో రాసే విధానానికి అలవాటు పడుతున్నారు. ఈ పరిస్థితిని మార్చేందుకు ఇంటర్ విద్యా మండలి చర్యలు చేపడుతోంది. కొత్త విధానంలో విద్యార్థుల సృజనాత్మకత, ఆలోచనా శక్తిని పరీక్షించేలా 10 శాతం ప్రశ్నలను రూపొందించనుంది. పాఠ్యాంశాల్లోని సమాచారాన్ని యథాతథంగా గుర్తుంచుకున్నారా లేదా అనే దానికంటే, ఆ అంశాన్ని ఎంతవరకు అర్థం చేసుకున్నారు? దాన్ని వాస్తవ పరిస్థితుల్లో ఎలా అన్వయించగలరు? అనే అంశాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

విద్యార్థుల్లో ఈ నైపుణ్యాలపై దృష్టి

కొత్త ప్రశ్నపత్రాల విధానంలో విద్యార్థుల సామర్థ్యాలను పలు కోణాల్లో అంచనా వేయనున్నారు.

ఇవి కూడా చదవండి



  • విశ్లేషణాత్మక ఆలోచన: ఒక అంశాన్ని లోతుగా పరిశీలించి, దానిపై సొంతంగా అభిప్రాయాలను రూపొందించుకునే సామర్థ్యాన్ని పరీక్షిస్తారు.
  • సమస్యల పరిష్కారం: ఇచ్చిన సమస్యలకు తగిన పరిష్కారాలను కనుగొనగలుగుతున్నారా లేదా అనేది అంచనా వేస్తారు.
    సృజనాత్మకత: కొత్త ఆలోచనలు, వినూత్న పరిష్కారాలు, విభిన్న కోణాల్లో ఆలోచించే సామర్థ్యానికి ప్రాధాన్యం ఇస్తారు.
  • సమష్టి పని: ఇతరులతో కలిసి పనిచేయడం, బాధ్యతలను పంచుకోవడం, భిన్నమైన అభిప్రాయాలను గౌరవించడం వంటి నైపుణ్యాలను పరిశీలిస్తారు.
  • విషయ పరిజ్ఞానం: పాఠ్యాంశాలను ఎంతవరకు అర్థం చేసుకున్నారు, వాటిని అవసరమైన సందర్భాల్లో ఎలా ఉపయోగించగలరు అనే అంశాలను పరీక్షిస్తారు.

పాఠ్యపుస్తకాల్లోనూ మార్పులు

కొత్త పరీక్షా విధానానికి అనుగుణంగా ఇంటర్మీడియట్ పాఠ్యపుస్తకాల్లో కూడా మార్పులు చేయనున్నారు. ఇందుకోసం సబ్జెక్టు నిపుణుల నుంచి ఇప్పటికే కొత్త తరహా ప్రశ్నలను ఆహ్వానించారు. ఈ ప్రశ్నలను ఇంటర్ విద్యా మండలి సమావేశంలో ఆమోదించిన అనంతరం వచ్చే విద్యా సంవత్సరానికి ముద్రించే పాఠ్యపుస్తకాల్లో చేర్చనున్నారు. కొత్త పరీక్షా విధానాన్ని సమర్థంగా అమలు చేసేందుకు అధ్యాపకులకు కూడా ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు. విద్యార్థులకు కేవలం పాఠ్యాంశాలను బోధించడమే కాకుండా, వారిలో స్వతంత్ర ఆలోచన, విశ్లేషణ, సృజనాత్మకత వంటి నైపుణ్యాలను పెంపొందించేలా బోధనా పద్ధతులను మార్చనున్నారు. జాతీయ విద్యా విధానం (NEP) 2020 లక్ష్యాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం PARAKH (Performance Assessment, Review and Analysis of Knowledge for Holistic Development) వ్యవస్థను తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా పాఠశాల విద్యలో పరీక్షలు, ప్రశ్నపత్రాల రూపకల్పన, విద్యార్థుల సామర్థ్యాల అంచనా విధానాల్లో ఏకరూపత తీసుకురావడం దీని ప్రధాన ఉద్దేశం.

ఇందులో భాగంగా ఎన్‌సీఈఆర్టీ ఇప్పటికే ఇంటర్మీడియట్ విద్యా మండలి అధికారులకు ప్రత్యేక కార్యశాలను నిర్వహించింది. ఈ నిబంధనలకు అనుగుణంగా రాష్ట్రంలోనూ పరీక్షల విధానాన్ని మార్చేందుకు కసరత్తు కొనసాగుతోంది. 2027-28 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ పరీక్షల్లో కేవలం బట్టీ పట్టి రాసే విధానానికి బదులుగా, విద్యార్థుల అవగాహన, విశ్లేషణ, సృజనాత్మకత, సమస్యల పరిష్కార సామర్థ్యాలకు పెద్దపీట వేయనున్నారు. దీంతో విద్యార్థులు ఇప్పటి నుంచే పాఠ్యాంశాలను అర్థం చేసుకుంటూ చదివే అలవాటు పెంచుకోవాల్సిన అవసరం ఉంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *