కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో దారుణ హత్య వెలుగులోకి వచ్చింది. అత్తారింటి వద్ద ఉంటున్న ఓ యువకుడు శవమై కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. ఆదోని పట్టణంలోని అమరావతి నగర్ సమీపంలోని పొలాల్లో శనివారం వీరేష్ (30) మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు.
ఆలూరు మండలం అరికెర గ్రామానికి చెందిన వీరేష్ కొంతకాలంగా తన భార్య కుటుంబ సభ్యులతో కలిసి అమరావతి నగర్లో నివసిస్తున్నాడు. అయితే శనివారం (సెప్టెంబర్ 19) పొలాల వైపు వెళ్లిన స్థానికులకు వీరేష్ మృతదేహం కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
గుర్తుతెలియని వ్యక్తులే హత్య చేశారా?
వీరేష్‌ను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసి మృతదేహాన్ని పొలాల్లో వదిలి వెళ్లి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే హత్యకు దారితీసిన కారణాలు, ఘటనకు ముందు ఏం జరిగింది అనే విషయాలు ఇంకా స్పష్టంగా తెలియలేదు. వీరేష్‌కు ఎవరితోనైనా వివాదాలు ఉన్నాయా? వ్యక్తిగత కారణాలతో హత్య జరిగిందా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సమాచారం అందుకున్న ఆదోని డీఎస్పీ వెంకటరమణ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. పోలీసు అధికారులు ఘటనా స్థలంలో ఆధారాలను సేకరించారు. వీరేష్ ఎవరిని కలిశాడు, చివరిసారిగా ఎక్కడ కనిపించాడు. అతడి ఫోన్ కాల్స్, ఇతర వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
కుటుంబ సభ్యుల కన్నీరుమున్నీరు
వీరేష్ హత్యకు గురైన విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. అత్తారింటి వద్ద ఉంటున్న తమ కుటుంబ సభ్యుడు ఇలా అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించే ప్రక్రియ చేపట్టిన పోలీసులు.. నివేదిక ఆధారంగా మరణానికి సంబంధించిన మరిన్ని వివరాలను నిర్ధారిస్తామన్నారు. హత్యకు పాల్పడిన వ్యక్తులు ఎవరు? అసలు కారణం ఏమిటి? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. కేసులో పురోగతి సాధించేందుకు పోలీసులు స్థానికులను, కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..