Headlines

Vijayawada: లడ్డూ ఏటీఎంల ద్వారా బెజవాడ దుర్గమ్మ ప్రసాదం.. క్యూలైన్లలో నిల్చోవాల్సిన అవసరం లేదు.. పేమెంట్ కూడా ఆన్‌లైన్‌లోనే..


విజయవాడ కనకదుర్గమ్మ భక్తులకు గుడ్ న్యూస్. దుర్గమ్మ లడ్డూ కోసం ఇక నుంచి క్యూలైన్లలో నిలబడాల్సిన అవసరం లేదు. ఏటీఎం నుంచి డబ్బులు తీసుకున్నట్లుగానే.. ఇప్పుడు లడ్డూ ఏటీఎంలను ఇంద్రకీలాద్రిపై దేవాదాయశాఖ అధికారులు ప్రవేశపెట్టారు. దీంతో ఈ ఏటీఎంల నుంచి భక్తులు లడ్డూలను తీసుకోవచ్చు.  తమకు కావాల్సిన ప్రసాదం రకం, సంఖ్యను ఎంచుకుని భక్తులు సులువుగా తీసుకోవచ్చు. ఈ విధానంలో లడ్డూ బాక్సులను పొందవచ్చు. క్యూలైన్లలో నిల్చునే శ్రమను తప్పించేందుకు దేవాదాయశాఖ ఈ లడ్డూ ఏటీఎంలను తీసుకొచ్చింది. రోజూ వేలాది మంది అమ్మవారిని దర్శించుకుంటారు. దర్శించుకున్న అనంతరం లడ్డూ, పులిహోర ప్రసాదాలను తీసుకుంటారు. ఈ ప్రసాదాలను భక్తుల పవిత్రంగా భావిస్తారు.

ప్రస్తుతం ఇంద్రకీలాద్రిపై భక్తుల కోసం ప్రసాద కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే ఈ కేంద్రాల వద్ద ఎప్పుడూ రద్దీ ఉంటుంది. దీంతో భక్తులు క్యూలైన్లలో వేచి ఉండాల్సి వస్తుంది. భక్తుల సమస్యను తొలగించేందుకు దుర్గగుడి అధికారులు ఈ ఏటీఎంలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ ఏటీఎం ద్వారా సులభంగా ప్రసాదం తీసుకోవడంతో పాటు డిజిటల్ విధానంలో చెల్లింపులు చేయవచ్చు. పేమెంట్ చేయగానే క్షణాల్లోనే ప్రసాదం వస్తుంది. దీంతో మెషీన్ ద్వారా తీసుకోవచ్చు. త్వరలో దసరా రానుండటంతో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ విపరీతంగా పెరగనుంది. శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భక్తులు వివిధ ప్రాంతాల నుంచి దర్శనం కోసం లక్షల సంఖ్యలో వస్తుంటారు. ఈ క్రమంలో భక్తుల రద్దీని నియంత్రించేందుకు ఈ లడ్డూ ఏటీఎంలు ఉపయోగపడనున్నాయి.

ఈ ఏటీఎంలలో రూ.100 నుంచి రూ.400 విలువ చేసే లడ్డూలను అందుబాటులో ఉంచనున్నారు. రూ.100 విలువ చేసే బాక్సులో 6 లడ్డూలు ఉంటాయి. ఇక రూ.200, రూ.300, రూ.400 విలువ చేసే బాక్సులను కూడా పొందవచ్చు. ఇక డిజిటల్ విధానం ద్వారా పేమెంట్ చేసే అవకాశం ఉండటం వల్ల చిల్లర సమస్య, తోపులాటలు వంటివి ఉండవు. తిరుమలలో ఇప్పటికే టీటీడీ కియోస్క్ మెషిన్లను లడ్డూ ప్రసాదాల కోసం ఏర్పాటు చేసింది. 2025లో వాటిని ప్రవేశపెట్టింది. ఈ మెషిన్ల ద్వారా క్యాష్ లెస్ విధానంలో లడ్డూలు పొందవచ్చు. దీని వల్ల ప్రసాదాల కౌంటర్ల వద్ద ఆగి ఉండే సమయం తగ్గుతుంది. ఇప్పుడు ఇంద్రకీలాద్రిపై కూడా అదే విధానంలో లడ్డూ ఏటీఎంలను తీసుకొచ్చారు. ఈ ఏటీఎంల పట్ల దుర్గమ్మ భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధానం బాగుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఇలాంటి ఏటీఎంలను మరిన్ని ఏర్పాటు చేసే దిశగా దేవాదాయశాఖ ప్రయత్నాలు చేయనుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *