Headlines

Vaibhav Suryavanshi : సిగ్గుండాలి.. నోటికి హద్దు అదుపు లేదా.. వైభవ్ సూర్యవంశీ బ్యాట్‌లో ‘ఏఐ చిప్’? పాక్ డాక్టర్ వింత విశ్లేషణ

Vaibhav Suryavanshi : సిగ్గుండాలి.. నోటికి హద్దు అదుపు లేదా.. వైభవ్ సూర్యవంశీ బ్యాట్‌లో ‘ఏఐ చిప్’?  పాక్ డాక్టర్ వింత విశ్లేషణ


Vaibhav Suryavanshi :ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ సెన్సేషన్ 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ సృష్టిస్తున్న విధ్వంసం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. శనివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 36 బంతుల్లోనే సెంచరీ బాది క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. అయితే ఈ కుర్రాడి ఆట తీరు చూసి ఓ పాకిస్థానీ విశ్లేషకుడు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. వైభవ్ బ్యాట్‌లో ఏదైనా ఏఐ చిప్ ఉందా? అన్న అనుమానం ఆయన వ్యక్తం చేయడం గమనార్హం.

ఏమిటా వింత వాదన?

పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ క్రికెట్ విశ్లేషకుడు డాక్టర్ నౌమాన్ నియాజ్ వైభవ్ సూర్యవంశీ ఆట తీరుపై విచిత్రమైన కామెంట్స్ చేశాడు. “సూర్యవంశీ తొలి ఓవర్లోనే నాలుగు సిక్సర్లు బాదాడు. అతని స్ట్రైక్ రేట్ చూస్తుంటే అసలు మనిషి ఆడుతున్నట్లు అనిపించడం లేదు. అథ్లెట్లకు డోపింగ్ టెస్టులు చేసినట్లే, ఈ అబ్బాయి వాడే బ్యాట్‌లో ఏమైనా ఏఐ చిప్ ఉందేమో చెక్ చేయాలి” అని ఆయన స్మాష్ ఇట్ షోలో పేర్కొన్నారు. అతని బ్యాట్ స్వింగ్, మణికట్టు వేగం అసాధారణంగా ఉన్నాయని ఆయన కొనియాడుతూనే ఈ వింత అనుమానాన్ని వ్యక్తం చేశారు.

రికార్డుల వీరుడు వైభవ్

ఈ సీజన్‌లో వైభవ్ సూర్యవంశీ ప్రదర్శన అమోఘంగా ఉంది. ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో 357 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ ఏకంగా 234.86గా ఉండటం విశేషం. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై అతను చేసిన 36 బంతుల సెంచరీ ఈ సీజన్‌లోనే అత్యంత వేగవంతమైనది. కేవలం 15 ఏళ్ల వయసులోనే విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ వంటి దిగ్గజాలకు పోటీగా ఆరెంజ్ క్యాప్ రేసులో నిలవడం అందరినీ మంత్రముగ్ధులను చేస్తోంది.

అండర్-19 వరల్డ్ కప్ హీరో

వైభవ్ కేవలం ఐపీఎల్‌లో మాత్రమే కాదు, అంతకుముందు జరిగిన అండర్-19 ప్రపంచకప్‌లో కూడా భారత్ విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన ఫైనల్లో కేవలం 80 బంతుల్లోనే 175 పరుగులు చేసి తన సత్తా చాటాడు. అతనిలోని టాలెంటును గుర్తించిన రాజస్థాన్ రాయల్స్ మేనేజ్‌మెంట్, అతనికి సరైన అవకాశాలు కల్పిస్తూ ప్రపంచ స్థాయి క్రికెటర్‌గా తీర్చిదిద్దుతోంది. మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ వంటి వారు వైభవ్‌ను వెంటనే టీమిండియా సీనియర్ జట్టులోకి తీసుకోవాలని సూచిస్తున్నారు.

నెటిజన్ల కౌంటర్

పాక్ విశ్లేషకుడి వ్యాఖ్యలపై భారత క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. “భారతీయ కుర్రాళ్ల టాలెంట్ చూసి ఓర్వలేక ఇలాంటి చిప్ కథలు అల్లుతున్నారా?” అని నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు. మరికొందరు “అవును అతని బ్యాట్‌లో చిప్ ఉంది.. దాని పేరు భారతీయ రక్తం” అంటూ గర్వంగా కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా, వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు ఐపీఎల్ 2026లో అత్యంత ఆకర్షణీయమైన ఆటగాడిగా మారిపోయాడు.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *