Headlines

Tirumala: మీరు తిరుమలకు వెళ్తున్నారా? మీకో బిగ్‌ అలర్ట్‌.. TTD కీలక సూచనలు..!


Tirumala: తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఒకవైపు కొండపై ఉష్ణోగ్రతలు పడిపోతుండగా.. మరోవైపు భక్తుల రద్దీ భారీగా పెరిగింది. దీంతో వసతి గదులు దొరక్కపోవడం, చలిలో రాత్రంతా బయటే గడపాల్సి రావడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులతో వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

18 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు:

తిరుమలలో ఆదివారం తెల్లవారుజామున 2:30 గంటల నుంచి 5:30 గంటల మధ్య ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. రాబోయే మూడు రోజుల పాటు కనిష్ఠ ఉష్ణోగ్రతలు 17 నుంచి 18 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ అంచనాలు సూచిస్తున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 23 నుంచి 26 డిగ్రీల మధ్య ఉండవచ్చని అంచనా. దీనికి తోడు అధిక తేమ, మేఘావృత వాతావరణం కారణంగా తెల్లవారుజామున చలి తీవ్రత ఎక్కువగా ఉంటోంది.

వసతి గదులు దొరక్క భక్తుల ఇబ్బందులు:

తిరుమలలో భక్తుల రద్దీకి అనుగుణంగా వసతి గదులు అందుబాటులో లేకపోవడంతో చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేంద్ర రిసెప్షన్ కార్యాలయంలో రోజువారీ గదుల కోటా పూర్తయిపోవడంతో పలువురు భక్తులు గదుల కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. గదులు లభించని వారు ఆలయ పరిసరాలు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో దుప్పట్లు, శాలువాలు కప్పుకొని రాత్రిపూట గడుపుతున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు చలిని తట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి, తెల్లవారుజామున ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉండటంతో భక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

ఇవి కూడా చదవండి



సర్వదర్శనానికి 18 గంటల సమయం

మరోవైపు తిరుమలలో దర్శనానికి కూడా భారీ రద్దీ నెలకొంది. ఆదివారం ఉదయం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్లు బయటకు వచ్చి శిలాతోరణం వరకు విస్తరించాయి. స్లాటెడ్ టోకెన్లు లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనం చేసుకోవడానికి సుమారు 18 గంటల సమయం పడుతున్నట్లు అంచనా.

శనివారం 83,670 మంది భక్తులకు దర్శనం

టీటీడీ వెల్లడించిన వివరాల ప్రకారం.. శనివారం మొత్తం 83,670 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. హుండీ ద్వారా రూ.4.02 కోట్ల ఆదాయం వచ్చింది. 35,785 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. అలాగే 2.75 లక్షల మందికి అన్నప్రసాదం అందించారు. భక్తులకు మొత్తం 4.32 లక్షల లడ్డూలను పంపిణీ చేశారు.

టీటీడీ కీలక సూచనలు

తిరుమలలో ఉష్ణోగ్రతలు తగ్గుతున్న నేపథ్యంలో భక్తులు అందుబాటులో ఉన్న యాత్రికుల సౌకర్యాల సముదాయాలను ఉపయోగించుకోవాలని టీటీడీ అధికారులు సూచించారు. ఉచిత లాకర్లు, స్నానపు సౌకర్యాలను వినియోగించుకోవాలని కోరారు. స్వామివారి దర్శనం పూర్తిచేసుకున్న భక్తులు తమకు కేటాయించిన గదులు, లాకర్లను ఖాళీ చేయాలని విజ్ఞప్తి చేశారు. తద్వారా కొత్తగా వచ్చే భక్తులకు వసతి సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. మొత్తంగా తిరుమలలో చలి తీవ్రత, భక్తుల రద్దీ రెండూ పెరగడంతో యాత్రికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దర్శనానికి వెళ్లే భక్తులు వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తగిన ఏర్పాట్లతో ప్రయాణం చేయడం మంచిది.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *