Headlines

మీ ఇంట్లో ఏసీ ఉందా..? జస్ట్ రూ.250తో ఇలా చేస్తే జింగ్ జింగ్ అమేజింగ్ అంతే..


తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసురుతోంది. ఒకవైపు అకాల వర్షాలు, మరోవైపు వణికించే చలి గాలులు తోడవడంతో ఫ్యాన్లు, ఏసీలకు జనం గుడ్‌బై చెప్పేశారు. స్వెట్టర్లు, దుప్పట్లు బయటకు తీసి ఏసీలకు మూడు నాలుగు నెలల పాటు రెస్ట్ ఇచ్చేస్తున్నారు. అయితే ఇంట్లో ఉండే ఇండోర్ యూనిట్‌ను తుడిచి భద్రంగా ఉంచుకునే చాలామంది, బయట బాల్కనీలోనో, టెర్రస్ మీదనో ఉండే ఔట్‌డోర్ యూనిట్ (కంప్రెసర్) గురించి అసలు పట్టించుకోరు. ఇక్కడే అసలు సమస్య మొదలవుతుందని టెక్నీషియన్లు హెచ్చరిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ సీజన్‌లో పొగమంచు, దుమ్ము, పిట్టల రెట్టల వల్ల ఏసీ ఔట్‌డోర్ భాగం దెబ్బతింటుందని చెబుతున్నారు.

అసలు డ్యామేజ్ ఔట్‌డోర్ యూనిట్‌కే..

సాధారణంగా ఏసీకి గుండెకాయ లాంటి కంప్రెసర్, కండెన్సర్ కాయిల్స్.. ఫ్యాన్, సర్క్యూట్ బోర్డు అన్నీ బయట ఉండే ఔట్‌డోర్ యూనిట్‌లోనే ఉంటాయి. ఈ సీజన్ మొత్తం తెల్లవారుజామున పొగమంచు ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల కండెన్సర్ కాయిల్‌లోని సన్నని అల్యూమినియం రెక్కల్లో పేరుకుపోయి.. మంచు తేమ తగలగానే గట్టిపడుతుందని అంటున్నారు. ఇది లోహపు భాగాలను, వైరింగ్‌ను వేగంగా తుప్పు పట్టేలా చేస్తుందంటున్నారు. వీటికి తోడు పావురాలు అక్కడ గూళ్లు కట్టుకోవడం, వాటి ఆమ్లపూరితమైన రెట్టలు పడటం వల్ల బాడీ పెయింట్ ఊడిపోయి కాయిల్స్ పాడవుతాయని చెప్తున్నారు. అంతే కాకుండా చలి నుంచి రక్షణ కోసం ఎలుకలు, బల్లులు లోపలికి దూరి వైర్లను కొరికే ప్రమాదం కూడా ఉందని అలర్ట్ చేస్తున్నారు.

జస్ట్ రూ.250తో ఇలా చేస్తే..

శీతాకాలమంతా ఓపెన్‌గా వదిలేసిన ఏసీకి వేసవిలో ఆన్ చేసే ముందు సాధారణ సర్వీసింగ్ సరిపోదని వివరిస్తున్నారు. కాయిల్స్‌లో పేరుకున్న మట్టిని వదిలించడానికి జెట్ లేదా కెమికల్ వాష్ చేయించాల్సి వస్తుందని.. మామూలు సర్వీస్‌కు రూ. 500 అయితే దీనికి రూ. 1,500 వరకు తీసుకుంటారన్నారు. తుప్పు వల్ల గ్యాస్ లీక్ అయితే లీకేజీ సరిచేసి గ్యాస్ నింపడానికి రూ. 2,500 నుంచి రూ. 4,500 దాకా ఖర్చవుతుంది. అదే తేమ లేదా ఎలుకల వల్ల ఔట్‌డోర్ పీసీబీ (PCB) బోర్డు పాడైతే రూ. 3,000 నుంచి రూ. 8,000 వదులుకోవాల్సిందే. కండెన్సర్ కాయిల్ మార్చాల్సిన పరిస్థితి వస్తే బ్రాండ్‌ను బట్టి రూ. 10,000 వరకు జేబుకు చిల్లు పడుతుంది. అందుకే ఆన్‌లైన్‌లో కేవలం రూ. 250 కే దొరికే ఒక చిన్న ఏసీ కవర్ వేయడం ద్వారా, వచ్చే వేసవిలో రూ. 10 వేల వరకు వచ్చే రిపేర్ ఖర్చుల నుంచి సులభంగా తప్పించుకోవచ్చని సలహా ఇస్తున్నారు.

సరైన కవర్ సెలక్షన్..

  • అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి సైట్లలో 1 టన్, 1.5 టన్, 2 టన్ ఏసీల సైజులను బట్టి కవర్లు దొరుకుతాయి. కొనే ముందు మీ ఔట్‌డోర్ యూనిట్ పొడవు, వెడల్పు కొలుచుకోవడం ఉత్తమం.
  • వాటర్ ప్రూఫ్, ఎండకు పాడవని (UV Resistant) మెటీరియల్ ఉన్నది ఎంచుకోండి.
  • కింద ఎలాస్టిక్ లేదా తాడు ఉండే కవర్ అయితే ఈదురుగాలులకు ఎగిరిపోకుండా గట్టిగా పట్టి ఉంచుతుంది.
  • కవర్‌కు పక్కన గాలి వెళ్లేందుకు చిన్న రంధ్రాలు (Air Vents) ఉంటే లోపల తేమ చేరకుండా ఉంటుంది. ఇవి రూ. 250 నుంచి రూ. 500 లోపే లభిస్తాయి.

ఈ పొరపాట్లు అస్సలు చేయకండి..

  • కవర్ వేసే ముందు యూనిట్‌పై ఉన్న దుమ్మును పొడి గుడ్డతో బాగా తుడవాలి.
  • తడి లేదా మురికితో ఉన్నప్పుడు కవర్ వేస్తే లోపల తేమ ఉండిపోయి తుప్పు పడుతుంది.
  • డబ్బులు ఆదా అవుతాయని ఇంట్లో ఉండే ప్లాస్టిక్ లేదా పాలిథిన్ కవర్లను చుట్టకూడదు. ఇవి గాలి ఆడనివ్వక తేమను లోపలే బంధించి ఏసీని మరింత వేగంగా పాడుచేస్తాయి.
  • వేసవిలో మళ్లీ ఏసీ వాడేటప్పుడు కవర్ తీయడం మర్చిపోతే, గాలి ఆడక కంప్రెసర్ వేడెక్కి కొద్ది నిమిషాల్లోనే కాలిపోయే ప్రమాదం ఉంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *