Kondagattu Anjaneya Swamy Temple: తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. స్వామివారి మూలవిరాట్‌కు అలంకరించిన చందనాన్ని తొలగించే పవిత్ర కార్యక్రమం 60 ఏళ్ల తర్వాత ప్రత్యేకంగా నిర్వహించారు. నవంబర్ నెల 15న దేవాదాయశాఖ అధికారులు, అర్చకులు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టగా.. 16వ తేదీ నుంచి చందనం తొలగింపు ప్రక్రియ ప్రారంభమై 18వ తేదీ సాయంత్రానికి పూర్తయింది.
ఈ పవిత్ర కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజూ యాగశాలలో హోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. మూలవిరాట్‌పై చందనాన్ని తొలగించిన అనంతరం సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం చేశారు. నదీ జలాలు, సముద్రపు నీటితో పవిత్ర అభిషేక కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం మండపంలో దిష్టి కుంభాన్ని ఏర్పాటు చేసి అర్చకులు తొలిసారిగా స్వామివారి నిజరూపాన్ని దర్శించుకున్నారు. ఆ దివ్యమంగళ రూపాన్ని చూసి అర్చకులు, భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు.
తదనంతరం స్వామివారికి తైలాభిషేకం నిర్వహించి, పట్టువస్త్రాలు, పుష్పమాలలతో విశేషంగా అలంకరించారు. ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు స్వామివారి నిజరూప దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఇవి కూడా చదవండి
అర్చకుల సమాచారం ప్రకారం డిసెంబర్ 29వ తేదీ వరకు భక్తులకు స్వామివారి నిజరూప దర్శనం కల్పించనున్నారు. ఈ అరుదైన దర్శన భాగ్యం లభించడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం ఎక్కడ ఉంది?
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం తెలంగాణలోని జగిత్యాల జిల్లా, మల్యాల మండలం, ముత్యంపేట సమీపంలోని కొండలపై నెలకొని ఉన్న ప్రసిద్ధ పురాతన హనుమాన్ దేవాలయం. ఇది ప్రతిరోజూ ఉదయం 4:00 గంటల నుండి రాత్రి 8:30 గంటల వరకు భక్తుల దర్శనార్థం తెరిచి ఉంటుంది.
ఈ క్షేత్రంలోని స్వయంభూ విగ్రహానికి రెండు ముఖాలు ఉండటం ప్రత్యేకత. ముందు ఆంజనేయస్వామి, వెనుక లక్ష్మీనరసింహస్వామి దర్శనమిస్తారు. 11, 21, 41 రోజుల హనుమాన్ దీక్షలకు, వాహన పూజలకు ప్రసిద్ధి. శని, ఆదివారాలు, మంగళవారాల్లో రద్దీ ఎక్కువ. ఉచిత అన్నదానం, ప్రసాదాలు అందుబాటులో ఉంటాయి.
మరిన్ని ఆసక్తికర ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.