Tilak Varma : 45 బంతుల్లోనే 101 పరుగులు.. సనత్ జయసూర్య రికార్డ్ సమం చేసిన తిలక్ వర్మ

Tilak Varma : 45 బంతుల్లోనే 101 పరుగులు.. సనత్ జయసూర్య రికార్డ్ సమం చేసిన తిలక్ వర్మ


Tilak Varma : ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ కుర్రాడు తిలక్ వర్మ సృష్టించిన విధ్వంసం ఇంకా కళ్లముందే కదలాడుతోంది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ యువ బ్యాటర్ ఆడిన ఇన్నింగ్స్ ఐపీఎల్ చరిత్రలోనే ఒక అద్భుత ఘట్టంగా నిలిచిపోతుంది. కేవలం 45 బంతుల్లోనే శతక్కొట్టిన తిలక్, ముంబై ఇండియన్స్ జట్టు తరపున ఒక అరుదైన రికార్డును సమం చేశాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా, మరోవైపు కెప్టెన్ హార్దిక్ పాండ్యా తడబడుతున్నా.. తిలక్ మాత్రం తగ్గేదేలే అంటూ స్టేడియం నలుమూలలా సిక్సర్ల వర్షం కురిపించాడు.

ముంబై ఇండియన్స్ తరపున ఐపీఎల్ లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన ఆటగాడిగా శ్రీలంక దిగ్గజం సనత్ జయసూర్య పేరిట ఉన్న రికార్డును తిలక్ వర్మ సమం చేశాడు. 2008లో చెన్నై సూపర్ కింగ్స్ పై జయసూర్య 45 బంతుల్లో సెంచరీ సాధించగా, సరిగ్గా 18 ఏళ్ల తర్వాత తిలక్ వర్మ అదే ఫీట్ సాధించడం విశేషం. ముంబై టీమ్ లో దిగ్గజ బ్యాటర్లయిన సూర్యకుమార్ యాదవ్ (49 బంతులు), కామరూన్ గ్రీన్ (47 బంతులు) కూడా తిలక్ కంటే వెనుకబడే ఉన్నారు. ఈ సెంచరీతో తిలక్ వర్మ తన వాల్యూ ఏంటో ప్రపంచానికి చాటి చెప్పాడు.

తిలక్ వర్మ ఇన్నింగ్స్ లోని అసలైన మ్యాజిక్ అతను గేర్ మార్చిన విధానంలో ఉంది. ఇన్నింగ్స్ ఆరంభంలో పిచ్ అర్థం చేసుకోవడానికి తిలక్ కొంత సమయం తీసుకున్నాడు. ఒక దశలో అతను 22 బంతులు ఆడి కేవలం 19 పరుగులు మాత్రమే చేశాడు. అప్పుడు రన్ రేట్ చూసిన వారంతా తిలక్ నెమ్మదిగా ఆడుతున్నాడని విమర్శించారు. కానీ ఆ తర్వాత జరిగినది ఊహకందని విధ్వంసం. తన ఇన్నింగ్స్ లోని తర్వాతి 23 బంతుల్లోనే ఏకంగా 82 పరుగులు పిండుకున్నాడు. అంటే దాదాపు 350కి పైగా స్ట్రైక్ రేట్ తో విరుచుకుపడ్డాడు.

ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ 14 ఓవర్లు ముగిసేసరికి కేవలం 103 పరుగులు మాత్రమే చేసింది. ఒక గౌరవప్రదమైన స్కోరు వస్తుందా లేదా అన్న సందేహం అందరిలోనూ కలిగింది. కానీ తిలక్ వర్మ పుణ్యమా అని చివరి 6 ఓవర్లలో ముంబై ఏకంగా 98 పరుగులు సాధించింది. గుజరాత్ బౌలర్ల వ్యూహాలన్నీ తిలక్ ముందు బలాదూర్‌ అయ్యాయి. ఇన్నింగ్స్ చివరి బంతికి ఫోర్ కొట్టి తన అద్భుత సెంచరీని పూర్తి చేయడమే కాకుండా జట్టు స్కోరును 199కి చేర్చాడు. ఇదంతా ఒక ఎత్తు అయితే, మరోవైపు కెప్టెన్ హార్దిక్ పాండ్యా 16 బంతుల్లో కేవలం 15 పరుగులు చేసి విఫలమవ్వడం చర్చనీయాంశంగా మారింది.

ఈ సీజన్ లో గత ఐదు మ్యాచ్‌ల్లో కేవలం 43 పరుగులు మాత్రమే చేసిన తిలక్ వర్మపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అతను ఫామ్ లో లేడని, జట్టుకు భారంగా మారాడని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కానీ వాటన్నింటికీ ఈ సెంచరీతో తిలక్ బలమైన సమాధానం ఇచ్చాడు. గుజరాత్ టైటాన్స్ వంటి పటిష్టమైన బౌలింగ్ విభాగం ఉన్న జట్టుపై, అదీ వాళ్ల సొంత మైదానంలో ఇలాంటి ఇన్నింగ్స్ ఆడటం మామూలు విషయం కాదు. ఈ గెలుపుతో ముంబై పాయింట్ల పట్టికలో ఎగబాకడమే కాకుండా, తిలక్ వర్మ రూపంలో తమకు ఒక మ్యాచ్ విన్నర్ దొరికాడన్న నమ్మకం ఫ్యాన్స్ లో కలిగింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *