తూర్పు మాడ వీధి..
ఆలయానికి ఎదురుగా ఉండే ఈ వీధి పుష్కరిణి వరకు విస్తరించి ఉంటుంది. ఒకప్పుడు ఇక్కడ కొయ్య రథం నిలిపే ప్రదేశం కూడా ఉండేది. సన్నిధి వీధి, గొల్ల మండపం, బేడి ఆంజనేయస్వామి ఆలయం వంటి చారిత్రక స్థలాలు ఇక్కడ ఉండేవి. కాలక్రమేణా అనేక పురాతన నిర్మాణాలు అభివృద్ధి పనుల్లో మార్పులకు గురయ్యాయి.
దక్షిణ మాడ వీధి..
ఆలయానికి కుడివైపున ఉన్న ఈ వీధిలో తిరుమల నంబి ఆలయం ప్రధానంగా ఉంటుంది. ఒకప్పుడు రాజుల గుర్రాలను కట్టే స్థలం కూడా ఇక్కడ ఉండేదని చెబుతారు. ఊంజల్ మండపం, ఉగ్రాణం వంటి ముఖ్యమైన ప్రదేశాలు కూడా ఈ వీధి పరిధిలోనే ఉన్నాయి. ఉత్సవాల సమయంలో ఊంజల్ సేవ ఇక్కడే నిర్వహించేవారు.
పడమర మాడ వీధి..
ఆలయ వెనుక భాగంలో ఉన్న ఈ వీధిలో పూర్వకాలంలో అనేక మఠాలు, సత్రాలు ఉండేవి. ప్రస్తుతం కూడా కొన్ని మఠాలు, మండపాలు ఇక్కడ ఉన్నాయి. అనంతాళ్వార్ తోట వంటి పవిత్ర ప్రదేశాలు ఈ వీధి ప్రారంభంలో కనిపిస్తాయి.
ఉత్తర మాడ వీధి..
ఆలయానికి ఎడమ వైపున ఉన్న ఈ వీధి అత్యంత ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలది. ఇక్కడే స్వామి పుష్కరిణి, వరాహ స్వామి ఆలయం వంటి ముఖ్య స్థలాలు ఉన్నాయి. భక్తులు ముందుగా వరాహస్వామిని దర్శించడం సంప్రదాయం. పూర్వకాల భక్తులు తరిగొండ వెంగమాంబ వంటి మహాభక్తులు కూడా ఇక్కడే నివసించినట్టు చరిత్ర చెబుతుంది.