Headlines

TGPSC: నడి రోడ్డుపై టీజీపీఎస్సీ OMR షీట్లు ఎలా వచ్చాయి? ఉలిక్కిపడ్డ అధికారులు..!

TGPSC: నడి రోడ్డుపై టీజీపీఎస్సీ OMR షీట్లు ఎలా వచ్చాయి? ఉలిక్కిపడ్డ అధికారులు..!


హైదరాబాద్ లో రోడ్డుపై OMR షీట్ల కలకలం ఘటనపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీవ్రంగా స్పందించింది. జూలై 25న ఓఎమ్‌ఆర్ పత్రాలు బయటపడిన ఉదంతంపై కమిషన్ చర్యలు తీసుకుంటూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్లక్ష్యానికి బాధ్యులుగా ఉన్న ఇద్దరు సెక్షన్ ఆఫీసర్లను తక్షణమే సస్పెండ్ చేయగా, మరో నలుగురు అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అంతేకాకుండా, నిబంధనలు ఉల్లంఘించి బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన సదరు కాంట్రాక్టర్ వర్క్ ఆర్డర్‌ను రద్దు చేసింది. అతనిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు వెల్లడించింది.

రోడ్డుపై లభ్యమైన OMR షీట్లు 2018లో నిర్వహించిన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ (Hostel Welfare Officers) నియామక పరీక్షకు చెందినవిగా గుర్తించారు. ఇందుకు సంబంధించిన తుది ఫలితాలు 2020లోనే పూర్తయ్యాయని కమిషన్ స్పష్టం చేసింది. పాత నిబంధనల ప్రకారం నాశనం చేయాల్సిన ఈ రికార్డులను అనుమతి పొందిన కాంట్రాక్టర్‌కు అప్పగించగా, రవాణా సమయంలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల కొన్ని పత్రాలు రోడ్డుపై పడిపోయినట్లు తెలిపింది. ఈ ఘటనపై విచారణ వేగవంతం చేశామని పేర్కొంది.

ఈ ఘటనతో ప్రస్తుతం జరుగుతున్న లేదా భవిష్యత్తులో జరగబోయే ఎలాంటి నియామక పరీక్షలపై ఎలాంటి ప్రభావం ఉండదని అభ్యర్థులకు TGPSC పూర్తి హామీ ఇచ్చింది. ఇవి చాలా ఏళ్ల క్రితం పూర్తయిన పాత పరీక్షా పత్రాలు మాత్రమేనని, కాబట్టి నిరుద్యోగులు, అభ్యర్థులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా రికార్డుల తొలగింపు ప్రక్రియలో మరిన్ని కఠినమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *