Headlines

కంగనా చెప్పింది నిజమేనా? ప్రోటీన్ షేక్స్ తాగితే తెలివితక్కువవారు అవుతారా.. అసలు నిజాలివే..

కంగనా చెప్పింది నిజమేనా? ప్రోటీన్ షేక్స్ తాగితే తెలివితక్కువవారు అవుతారా.. అసలు నిజాలివే..


అధికంగా ప్రోటీన్ షేక్స్ తాగడం వల్ల మనుషులు తెలివితక్కువవారు అవుతారు, మెదడు పనితీరు మందగిస్తుంది.. అంటూ బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఫిట్‌నెస్ ప్రేమికులు, వ్యాయామ ప్రియులు ఎక్కువగా ఆధారపడే ప్రోటీన్ డైట్‌పై ఆమె చేసిన ఈ కామెంట్స్‌తో చాలామంది గందరగోళానికి గురయ్యారు. అయితే కంగనా వ్యాఖ్యల్లో ఎంతవరకు నిజముంది? అధిక ప్రోటీన్ నిజంగానే ఐక్యూను తగ్గిస్తుందా? దీనిపై ఆరోగ్య నిపుణులు, శాస్త్రీయ పరిశోధనలు ఏం చెబుతున్నాయో తెలుసుకోవడం ముఖ్యం.

ఐక్యూ తగ్గుతుందనేది కేవలం ఒక అపోహ మాత్రమే..

శాస్త్రీయ పరిశోధనల ప్రకారం.. ఎక్కువ ప్రోటీన్ తీసుకోవడం వల్ల మనుషుల తెలివితేటలు లేదా ఐక్యూ తగ్గిపోతాయనడానికి, లేదా మెదడు శాశ్వతంగా దెబ్బతింటుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. ఇది పూర్తిగా ఒక అపోహ మాత్రమే. అయితే కొన్ని రకాల తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల తాత్కాలికంగా మెదడు మొద్దుబారినట్లు, అలసటగా అనిపించడం నిజమే. ఈ తాత్కాలిక పరిస్థితిని చూసి చాలామంది ఐక్యూ తగ్గిపోతోందని పొరబడుతుంటారు.

Does Too Much Protein Make You Dumb

Does Too Much Protein Make You Dumb

అధిక ప్రోటీన్ తీసుకున్నప్పుడు బ్రెయిన్ ఫాగ్ ఎందుకు వస్తుంది?

హై-ప్రోటీన్ డైట్ తీసుకునేటప్పుడు చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్ల వల్లే మెదడు మందగించినట్లు అనిపిస్తుంది. దానికి ప్రధాన కారణాలు ఇవే..

కార్బోహైడ్రేట్లను పూర్తిగా దూరం పెట్టడం: మెదడు వేగంగా పనిచేయడానికి గ్లూకోజ్ చాలా అవసరం. కీటో లేదా కార్నివోర్ డైట్ పేరుతో కార్బోహైడ్రేట్లను పూర్తిగా బంద్ చేసి, కేవలం ప్రోటీన్ మాత్రమే తీసుకుంటే.. ప్రారంభంలో మెదడుకు తగినంత ఇంధనం అందక చిరాకు, మందకోడితనం వస్తాయి.

డీహైడ్రేషన్: ప్రోటీన్‌ను అరిగించుకోవడానికి కిడ్నీలకు ఎక్కువ నీరు అవసరం. అధిక ప్రోటీన్ తింటూ తగినంత నీళ్లు తాగకపోతే డీహైడ్రేషన్ బారిన పడతారు. ఇది జ్ఞాపకశక్తిని, ఏకాగ్రతను తాత్కాలికంగా దెబ్బతీస్తుంది.

ఫుడ్ కోమా : ఒక్కసారే ఎక్కువ మొత్తంలో ప్రోటీన్ తీసుకుంటే, దాన్ని జీర్ణం చేయడానికి శరీరం చాలా శక్తిని వెచ్చిస్తుంది. దీంతో రక్త ప్రసరణ మెదడు నుంచి జీర్ణవ్యవస్థ వైపు మళ్లుతుంది. ఫలితంగా తిన్న తర్వాత విపరీతమైన బద్ధకం, మత్తుగా అనిపిస్తుంది.

శాస్త్రవేత్తలు – నిపుణులు ఏం చెబుతున్నారు?

మెదడుకు ప్రోటీన్ అవసరం: ప్రోటీన్లలో ఉండే అమైనో యాసిడ్లు.. డోపమైన్, సెరటోనిన్ వంటి మెదడుకు అవసరమైన న్యూరో ట్రాన్స్‌మిటర్ల తయారీకి పునాది లాంటివి. ప్రోటీన్ లోపిస్తేనే మానసిక స్థితి, నిద్ర, దృష్టి లోపిస్తాయి.

సురక్షితమైన మోతాదు: ఆరోగ్యంగా ఉన్న ఏ వ్యక్తి అయినా తమ శరీర బరువులో కిలోగ్రాముకు 2.2 గ్రాముల నుండి 3.0 గ్రాముల వరకు ప్రోటీన్‌ను రోజూ సురక్షితంగా తీసుకోవచ్చని క్లినికల్ అధ్యయనాలు నిరూపించాయి.

కిడ్నీల ఆరోగ్యం: ముందు నుంచే కిడ్నీ సంబంధిత వ్యాధులు ఉన్నవారికి తప్ప, సాధారణ ఆరోగ్యవంతమైన వ్యక్తులకు అధిక ప్రోటీన్ వల్ల కిడ్నీలకు ఎలాంటి హానీ జరగదు.

బ్రెయిన్ ఫాగ్ రాకుండా ఉండటానికి నిపుణుల సూచనలు..

సంక్లిష్ట కార్బోహైడ్రేట్లను జోడించండి: ప్రోటీన్‌తో పాటు ఓట్స్, బ్రౌన్ రైస్, చిలగడదుంపలు వంటి మంచి కార్బోహైడ్రేట్లను తీసుకోండి.

మంచిగా నీళ్లు తాగండి: మీరు తీసుకునే ప్రోటీన్ మోతాదును పెంచినప్పుడు, రోజూ అదనంగా లీటరు వరకు నీళ్లు ఎక్కువగా తాగడం అలవాటు చేసుకోండి.

 విడతల వారీగా తినండి: రోజంతటి ప్రోటీన్‌ను ఒకేసారి తినకుండా, ప్రతి పూట భోజనంలో 20 గ్రాముల నుంచి 40 గ్రాముల చొప్పున విభజించుకుని తీసుకోండి.

కంగనా రనౌత్ చెప్పినట్లు ప్రోటీన్ల వల్ల మేధస్సు తగ్గిపోదు. కానీ సరిగ్గా ప్లాన్ చేసుకోకుండా సమతుల్యత లేని డైట్ పాటిస్తే మాత్రం తాత్కాలిక అలసట, బద్ధకం కలుగుతాయి. కాబట్టి ప్రొటీన్ షేక్స్ లేదా హై ప్రోటీన్ డైట్ తీసుకునేవారు తగినంత నీరు, కాస్త కార్బోహైడ్రేట్లు తోడుగా తీసుకుంటే శరీరంతో పాటు మెదడు కూడా చురుగ్గా పనిచేస్తుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *