Headlines

గుండు చేసుకుంటే రూ. 45వేలు.. ఎగబడ్డ మహిళలు.. కట్‌చేస్తే ఊహించని ట్విస్ట్..!

గుండు చేసుకుంటే రూ. 45వేలు.. ఎగబడ్డ మహిళలు.. కట్‌చేస్తే ఊహించని ట్విస్ట్..!


తమిళనాడులో ఓ విచిత్రమైన మోసం వెలుగులోకి వచ్చింది. అచ్చం విక్రమార్కుడు చిత్రంలోని రవితేజ సినిమా సీన్ రిఫిట్ అయ్యింది. గుండు గీచుకుంటే ప్రభుత్వం నుంచి భారీగా డబ్బులు వస్తాయని నమ్మించి మహిళలను మోసం చేసిన ఘటన సేలం జిల్లాలో కలకలం రేపుతోంది. అత్తూరు సమీపంలోని పుదుకోతంబాడి గ్రామంలో జరిగిన ఈ ఘటనలో ఓ వ్యక్తి తహసీల్దార్‌గా నటిస్తూ స్థానిక మహిళలను నమ్మించి మోసం చేసినందుకు పోలీసులు కేసు నమోదు చేశారు.

సేలం జిల్లా పుదుకోతంబాడి గ్రామానికి చెందిన పళనియమ్మాళ్‌కు ఓ అపరిచిత వ్యక్తి ఫోన్ చేశాడు. తాను తాలూకా కార్యాలయం నుంచి మాట్లాడుతున్న తహసీల్దార్‌ను అని పరిచయం చేసుకున్నాడు. అంతేకాకుండా ఆమె పేరు, కుటుంబ సభ్యుల వివరాలను సరిగ్గా చెప్పడంతో ఆమె అతని మాటలను నమ్మింది. అనంతరం ఆ వ్యక్తి ఓ కొత్త రకం వ్యాధి వ్యాప్తి చెందుతోందని, అది జుట్టు ద్వారా వ్యాపిస్తుందని చెప్పాడు. ఈ వ్యాధి నుంచి రక్షించుకోవడానికి ఇతర దేశాల్లో ప్రజలు గుండు చేయించుకుంటున్నారని నమ్మబలికాడు. తమిళనాడు ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తోందని, గుండు చేయించుకున్న వారికి నగదు ప్రోత్సాహకాలు అందిస్తుందని చెప్పాడు.

మహిళలు గుండు చేయించుకుంటే రూ.15,000, పాఠశాల, కళాశాల విద్యార్థులకు రూ.45,000తో పాటు ల్యాప్‌టాప్, పురుషులకు రూ.6,000 చొప్పున ఇస్తామని హామీ ఇచ్చాడు. పుదుకోతంబాడి గ్రామానికి కేవలం 18 టోకెన్లు మాత్రమే కేటాయించారని, ఈ అవకాశాన్ని బంధువులకు కూడా చెప్పాలని సూచించాడు. తాను స్వయంగా నగదుతో వస్తానని, అధికారులు వచ్చేసరికి గుండు చేయించుకున్న వారు సిద్ధంగా ఉండాలని చెప్పడంతో గ్రామస్తులు అతని మాటలను నమ్మారు. దాదాపు 20 మంది మహిళలు గుండు చేయించుకునేందుకు సిద్ధమయ్యారు. వారిలో కావేరి, రామయ్యి, చిత్ర అనే ముగ్గురు మహిళలు నిజంగానే స్థానిక మంగలి సహాయంతో గుండు చేయించుకున్నారు.

అయితే ఆ తర్వాత డబ్బులు పంపిణీ చేస్తానని చెప్పిన వ్యక్తికి ఫోన్ చేయగా, అతని మొబైల్ స్విచ్ ఆఫ్ వచ్చింది. పలుమార్లు సంప్రదించేందుకు ప్రయత్నించినా స్పందన లేకపోవడంతో మోసం జరిగిన విషయం బయటపడింది. మిగిలిన గ్రామస్తులు గుండు చేయించుకునే నిర్ణయాన్ని నిలిపివేశారు.

మోసానికి గురైన పళనియమ్మాళ్ లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించింది. తహసీల్దార్‌గా చెప్పుకున్న వ్యక్తి వాట్సాప్ ద్వారా గుండు చేయించుకున్న మహిళల ఫొటోలు, రూ.500 నోట్ల చిత్రాలు పంపి తమ నమ్మకాన్ని పెంచుకున్నాడని పళనియమ్మాళ్ తెలిపింది. నగదు పంపిణీ కోసం కుర్చీలు, బల్లలు ఏర్పాటు చేయాలని కూడా సూచించాడని చెప్పారు. అతని మాటలు నమ్మి ఏర్పాట్లు చేసినా చివరకు ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో తాము మోసపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ఘటనపై అత్తూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తమిళనాడు ప్రభుత్వం పేరును ఉపయోగించి ప్రజలను మోసం చేసిన వ్యక్తిని గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా మహిళలను లక్ష్యంగా చేసుకుని సాగించిన ఈ వినూత్న మోసంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలు, నగదు ప్రోత్సాహకాల పేరుతో వచ్చే అనుమానాస్పద ఫోన్ కాల్స్‌ను నమ్మవద్దని అధికారులు సూచిస్తున్నారు. ఎలాంటి పథకం అయినా అధికారిక వెబ్‌సైట్లు, ప్రభుత్వ కార్యాలయాల ద్వారా నిర్ధారించుకున్న తర్వాతే స్పందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *