కొత్తగూడెం, ఏప్రిల్ 19: పదో తరగతి తర్వాత తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో సాకేంతిక నైపుణ్యాలు నేర్పించే పాలీసెట్‌కు యువతలో యమ డిమాండ్ ఉంది. అంతేకాదు చిన్న వయసులోనే కెరీర్లో సెటిల్ అవ్వాలనుకునే వారికి కూడా ఇది మంచి ఎంపిక. మూడేళ్ల డిప్లమా తర్వాత వెంటనే జూనియర్ ఇంజనీర్, సాంకేతిక నిపుణులుగా ప్రైవేట్, ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగాలు అందింపుచ్చుకోవచ్చు. పాలిటెక్నిక్ పూర్తి చేసిన తర్వాత పైచదువులు కొనసాగించాలంటే.. ఇలంటి వారు నేరుగా బీటెక్ రెండో సంవత్సరంలో చేరేందుకు ఈసెట్ పరీక్ష రాయొచ్చు. పాలిటెక్నిక్‌తో ఇలా ఎన్నో అవకాశాలు స్వాగతం పలుకుతాయి. ఇందులో ప్రవేశాలు పొందాలంటే పాలీసెట్ ప్రవేశ పరీక్షలో ర్యాంకు తెచ్చుకోవాలి.
ప్రస్తుతం తెలంగాణలో పాలీసెట్ 2026 ఆన్లైన్ దరఖాస్తులు కొనసాగుతున్నాయి. ఏప్రిల్ 20తో ఆలస్య రుసుములేకుండా దరఖాస్తులు ముగియనున్నాయి. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోనివారు ఆన్లైన్లో ముగింపు సమయంలోగా దరఖాస్తు చేసుకోవచ్చు. పదో తరగతి ఉత్తీర్ణులైన బాల బాలికలు ఎవరైనా దరఖాస్తుకు అర్హులు. ఈ విద్యాసంవత్సరం పదో తరగతి పరీక్షలు రాసి, ఫలితాల కోసం ఎదురు చూస్తున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. మే 13వ తేదీన విద్యార్థులకు పాలిసెట్ ప్రవేశ పరీక్ష ఉంటుంది. ఇక పాలీసెట్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులకు ఉచిత శిక్షణ అందించేందుకు వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు.
అలాగే రుద్రంపూర్ (కొత్తగూడెం)లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో కూడా పాలీసెట్‌కు ఉచిత శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్లు కాలేజీ ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల చేత విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ అందించనున్నారు. ఈ శిక్షణ తరగతులు ప్రతి రోజూ ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12.15 గంటల వరకు నిర్వహించబడుతాయని అన్నారు. పూర్తి వివరాల కోసం 7989103699 ఫోన్ నంబర్‌ను సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.