
భారతదేశంలో అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ చేరుకునే సమయం నగరాల్లోనే సగటున 15 నిమిషాలకుపైగా ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఇంకా ఎక్కువ సమయం పడుతుంది. కానీ వైద్య అత్యవసరాల్లో ప్రతి నిమిషం ప్రాణానికి కీలకం. గుండె ఆగిన వెంటనే 4 నుంచి 6 నిమిషాల్లోనే మెదడు దెబ్బతినే ప్రమాదం ఉంది. తీవ్రమైన రక్తస్రావం అయితే 10 నిమిషాల్లోనే ప్రాణాంతకమవుతుంది.
ఇలాంటి పరిస్థితుల్లో వైద్య సిబ్బంది వచ్చే వరకు మధ్యలో ఉండే ఆ గ్యాప్‌లో… పక్కనే ఉన్నవారి స్పందనే ప్రాణాలను కాపాడగలదు. కానీ మన దేశంలో ప్రాథమిక ప్రథమ చికిత్సపై అవగాహన చాలా తక్కువగా ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. సరైన సమయంలో సరైన చర్య తీసుకుంటే.. ఎలాంటి వైద్య పరికరాలు లేకపోయినా ప్రాణాలను రక్షించవచ్చని సూచిస్తున్నారు.
- గుండె ఆగిన సందర్భంలో వెంటనే స్పందించడం అత్యంత కీలకం. వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలి స్పందించకపోతే, శ్వాస సరిగా లేకపోతే ఆలస్యం చేయకుండా సీపీఆర్ ప్రారంభించాలి. ఛాతీ మధ్యభాగంలో గట్టిగా, వేగంగా నొక్కాలి. ప్రతి నిమిషానికి 100 నుంచి 120 సార్లు ఒత్తిడి ఇవ్వడం ద్వారా రక్తప్రసరణ కొనసాగుతుంది.
- ప్రమాదాల్లో అధిక రక్తస్రావం ప్రాణాలను వెంటనే ప్రమాదంలో పడేస్తుంది. అలాంటి సమయంలో గాయంపై గట్టిగా ఒత్తిడి ఇవ్వడం ద్వారా రక్తస్రావాన్ని ఆపాలి. బట్ట లేదా బ్యాండేజ్‌తో నిరంతరం ఒత్తిడి పెంచాలి. చేతులు లేదా కాళ్లకు తీవ్రమైన గాయం అయితే గాయం పైభాగంలో బిగువుగా కట్టే విధానాన్ని ఉపయోగించాలి.
- ఒకవేళ వ్యక్తి స్పృహ తప్పి ఉన్నా శ్వాస కొనసాగుతుంటే.. అతడిని పక్కకు తిప్పి పడుకోబెట్టాలి. దీంతో శ్వాసనాళం బ్లాక్ కాకుండా ఉంటుంది. తల కొంచెం వెనక్కి వంచి, నోరు కిందికి వచ్చేలా ఉంచడం వల్ల ఊపిరాడక ఇబ్బంది పడకుండా ఉంటుంది.
- ఆహారం లేదా ఇతర వస్తువు గొంతులో ఇరుక్కుపోతే కొన్ని నిమిషాల్లోనే ప్రమాదం తలెత్తుతుంది. అప్పుడు వెంటనే స్పందించాలి. వ్యక్తి దగ్గుతుంటే అలాగే దగ్గనివ్వాలి. కానీ మాట్లాడలేకపోతే లేదా ఊపిరి తీసుకోలేకపోతే వెనుక భాగంలో ఐదు సార్లు గట్టిగా కొట్టి, తరువాత కడుపు భాగంలో ఒత్తిడి ఇవ్వాలి. అడ్డంకి తొలగే వరకు ఇదే విధానం కొనసాగించాలి.
- స్ట్రోక్ లక్షణాలను ముందుగానే గుర్తించడం కూడా అత్యంత ముఖ్యం. తల తిరగడం, చూపు మసకబారడం, ముఖం ఒకవైపు వంగిపోవడం, చేతుల్లో బలహీనత, మాటలు సరిగా రాకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే అత్యవసర సహాయం కోసం సమాచారం ఇవ్వాలి. ప్రతి నిమిషం ఆలస్యం అయినా మెదడు కణాలు దెబ్బతింటాయి.
మొత్తానికి.. అత్యవసర సేవలు మెరుగవుతున్నప్పటికీ మొదటి కొన్ని నిమిషాలు మాత్రం మన చుట్టూ ఉన్నవారిపైనే ఆధారపడి ఉంటాయి. సీపీఆర్, రక్తస్రావ నియంత్రణ, రికవరీ పొజిషన్, గొంతు ఇరుక్కుపోయినప్పుడు చర్యలు, స్ట్రోక్ లక్షణాల గుర్తింపు.. ఈ ఐదు సులభమైన చర్యలు ప్రాణాలను కాపాడగలవని నిపుణులు చెబుతున్నారు. డాక్టర్ కావాల్సిన అవసరం లేదు.. సరైన సమయంలో స్పందిస్తే చాలు.