Headlines

Telangana: సినిమాని మించిన ట్విస్టులు.. యువతి కేసులో బయటపడ్డ ఊహించని నిజాలు..


గోదావరిఖనిలో సంచలనం సృష్టించిన యువతి ఆత్మహత్య కేసు అనుమానాస్పద మలుపు తిరిగి చివరకు హత్యగా తేలింది. ప్రేమ పేరుతో వంచించడమే కాకుండా మరొకరిపై పెంచుకున్న కక్షతో యువతికి గడ్డిమందు తాగించి ప్రాణాలు తీసిన కాంట్రాక్ట్ లెక్చరర్ దారుణాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. నేరం తనపైకి రాకుండా వేరే వ్యక్తిపై నెట్టేందుకు నిందితుడు వేసిన పక్కా స్కెచ్‌ను సాంకేతిక ఆధారాలతో ఛేదించారు. సుల్తానాబాద్ మండలం గర్రెపల్లికి చెందిన జెట్టి నవీన్‌ (38) నస్పూర్‌లోని శ్రీరాంపూర్ పాలిటెక్నిక్ కాలేజీలో కాంట్రాక్ట్ లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. అప్పటికే పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్న నవీన్, మూడేళ్ల క్రితం అదే కాలేజీలో డిప్లొమా చదువుతున్న తాండ్ర అక్షితరాణి (20)ని ప్రేమ పేరుతో నమ్మించాడు. ఆ తర్వాత అక్షిత హైదరాబాద్‌లో ఇంజినీరింగ్ చదువుతూ, శిక్షణ నిమిత్తం గోదావరిఖనికి వచ్చింది.

రవితో పరిచయం..

ఆ సమయంలో సింగరేణి రెండో గనిలో ఓవర్‌మెన్‌గా పనిచేస్తున్న బొమ్మకంటి రవికుమార్‌తో అక్షితకు పరిచయం ఏర్పడింది. ఈ విషయాన్ని పసిగట్టిన లెక్చరర్ నవీన్.. ఆమెకు తెలియకుండానే ఆమె మొబైల్‌లో ఒక సీక్రెట్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేశాడు. ఆమె చాటింగ్‌లు, మెసేజ్‌లు నిరంతరం గమనిస్తూ.. రవికుమార్‌తో చనువుగా ఉండటాన్ని జీర్ణించుకోలేక తీవ్ర కక్ష పెంచుకున్నాడు.

పగతో రగిలిపోయి.. హత్యకు కుట్ర

రవికుమార్‌ను ఎలాగైనా ఇరికించాలనే ఉద్దేశంతో మొదట అక్షితతో సింగరేణి ఉన్నతాధికారులకు లైంగిక వేధింపుల ఫిర్యాదు చేయించాడు. అయితే తగిన ఆధారాలు లేకపోవడంతో అధికారులు చర్యలు తీసుకోలేదు. ఈ క్రమంలో వ్యవహారం ఇంట్లో తెలియడంతో కుటుంబసభ్యులు అక్షిత చదువును మధ్యలోనే ఆపేసి, కంప్యూటర్ సెంటర్‌లో ఉద్యోగంలో చేర్పించారు. అయినప్పటికీ నవీన్‌లో పగ చల్లారలేదు. అక్షితను అంతం చేసి, ఆ నెపాన్ని రవికుమార్‌పైకి నెట్టాలని పథకం రచించాడు.

కారులో ఎక్కించుకుని.. గడ్డిమందు తాగించి..

ఈ నెల 12న స్నేహితుడి నుంచి గడ్డిమందు సేకరించిన నవీన్, దానిని బాటిల్‌లో నింపుకున్నాడు. పక్కా వ్యూహం ప్రకారం అక్షితకు ఫోన్ చేసి రామగుండంలోని ఎఫ్‌సీఐ అడ్డరోడ్డు వద్దకు రప్పించి తన కారులోకి ఎక్కించుకున్నాడు. ‘‘రవికుమార్‌పై కఠినమైన కేసు నమోదయ్యేలా చేస్తాను.. ఇది తాగితే ఏమీ కాదు’’ అని నమ్మించి బలవంతంగా ఆమెతో గడ్డిమందు తాగించాడు. అనంతరం రవికుమార్ లైంగిక వేధింపుల వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అక్షితతో సూసైడ్ నోట్ రాయించాడు. ఆ లేఖను ఆమె ఫోన్‌లోనే ఫొటో తీసుకుని, పథకం ప్రకారం ఆమెను అక్కడే వదిలేశాడు.

సీసీ కెమెరాలతో వీడిన మిస్టరీ.. ఇద్దరి అరెస్ట్

అక్షిత ఫోన్‌లోని లేఖ ఆధారంగా పోలీసులు తొలుత ఆత్మహత్యగా భావించి రవికుమార్‌పై కేసు నమోదు చేశారు. అయితే దర్యాప్తులో సీసీటీవీ ఫుటేజీలు ఈ కేసును కీలక మలుపు తిప్పాయి. ఎఫ్‌సీఐ అడ్డరోడ్డు వద్ద అక్షిత.. నవీన్ కారు ఎక్కిన దృశ్యాలు రికార్డయ్యాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నవీన్ కాల్‌డేటా, రికార్డింగ్‌లు, ఇతర సాంకేతిక ఆధారాలను సేకరించి అతడిని అదుపులోకి తీసుకుని విచారించడంతో పక్కా ప్లాన్‌తో చేసిన హత్యగా తేలింది. ప్రస్తుతం ప్రధాన నిందితుడు జెట్టి నవీన్‌తో పాటు బొమ్మకంటి రవికుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. నవీన్ కారు, ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నామని, రవికుమార్‌పై వచ్చిన ఆరోపణలతో పాటు సింగరేణి అధికారుల నిర్లక్ష్యంపై కూడా సమగ్ర దర్యాప్తు కొనసాగుతోందని పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి స్పష్టం చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *