టీవీ9 కథనం సంచలనం సృష్టించడంతో బండ్లగూడ ఆర్టీవో కార్యాలయంలో అవినీతిపై అధికారులు ఉక్కుపాదం మోపారు. కానిస్టేబుల్ నగదు లెక్కిస్తున్న దృశ్యాలపై స్పందించిన రవాణా శాఖ, వెంటనే విచారణ చేపట్టింది. ముగ్గురు అధికారులపై వేటు వేయడమే కాకుండా, ఏజెంట్లను అనుమతించవద్దని హెచ్చరించింది. ఈ ఘటనపై ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి, రవాణా శాఖలో మార్పులు అనివార్యమయ్యాయి.
హైదరాబాద్ పాతబస్తీలోని బండ్లగూడ ఆర్టీవో కార్యాలయంలో కానిస్టేబుల్ నగదు లెక్కించిన వ్యవహారంపై టీవీ9 ప్రసారం చేసిన కథనం సంచలనం సృష్టించింది. ఈ కథనాన్ని పరిశీలించిన అధికారులు, వెంటనే రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. టీవీ9 కథనాల ఆధారంగానే రవాణా శాఖ ఈ వ్యవహారంపై విచారణ ప్రారంభించడం గమనార్హం. జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆర్టీవో కార్యాలయంలో పనిచేసే సిబ్బందిని విచారించిన అనంతరం సంచలన నిర్ణయం తీసుకున్నారు.
ఏమిటీ వ్యవహారం?
బండ్లగూడ ఆర్టీవో కార్యాలయంలో ఓ కానిస్టేబుల్ భారీ మొత్తంలో నగదు లెక్కిస్తున్న దృశ్యాలు టీవీ9 ఆధారాలతో టెలికాస్ట్ చేయడం జరిగింది ఈ ఘటనపై రవాణా శాఖ అప్రమత్తమైంది. వెంటనే స్పందించిన అధికారులు కానిస్టేబుల్ అరుణ్‌ను సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణకు రవాణా శాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.
మరో ఇద్దరిపైనా వేటు
కేవలం కానిస్టేబుల్‌పైనే కాకుండా, ఆర్టీవో కార్యాలయాల్లో ఏజెంట్లను అనుమతించడం, సరైన పర్యవేక్షణ లేకపోవడం వంటి తీవ్ర ఆరోపణలతో మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ భీమ్ సింగ్, ఆర్టీవో రామ్ చందర్‌లను సైతం రవాణా శాఖ వెంటనే వారి బాధ్యతల నుండి తప్పించింది. వీరిద్దరినీ రవాణా శాఖ ప్రధాన కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఏజెంట్లపై కఠిన హెచ్చరిక
ఈ ఘటన నేపథ్యంలో రవాణా శాఖ కీలక వ్యాఖ్యలు చేసింది. ఆర్టీవో కార్యాలయాల్లోకి ఏజెంట్లను అనుమతిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధిత ఆర్టీవోనే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది. టీవీ9 కథనం అందించిన ఈ కీలక సమాచారంతో రవాణా శాఖలో మార్పులు చేర్పులు మొదలయ్యాయి. ఈ వ్యవహారంపై తదుపరి విచారణ కొనసాగుతోంది. మరోవైపు తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అధికారులు కూడా ఆర్టీవో కార్యాలయంలో తనిఖీలు కొనసాగిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..