Headlines

Telangana: ఇంటర్ బోర్డు రద్దుపై సీఎం రేవంత్ కీలక ప్రకటన.. విద్యార్థులకు బిగ్ అలర్ట్..

Telangana: ఇంటర్ బోర్డు రద్దుపై సీఎం రేవంత్ కీలక ప్రకటన.. విద్యార్థులకు బిగ్ అలర్ట్..


తెలంగాణలో ఇంటర్మీడియట్ ప్రవేశాలకు సంబంధించి గత కొన్ని రోజులుగా నెలకొన్న సందిగ్ధతకు సీఎం రేవంత్ రెడ్డి తెరదించారు. ఈ విద్యా సంవత్సరం యథావిధిగా ఇంటర్మీడియట్ ప్రవేశాలను చేపట్టాలని అధికారులను ఆదేశించారు. విద్యా సంస్కరణల్లో భాగంగా ఇంటర్‌ను పాఠశాల విద్యలో విలీనం చేసే ప్రక్రియను ప్రస్తుతానికి తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇంటర్మీడియట్‌ను రద్దు చేసి, సీబీఎస్‌ఈ తరహాలో 11, 12 తరగతులుగా పాఠశాల విద్యలో విలీనం చేయాలని ప్రభుత్వం భావించింది. అయితే ఈ ప్రక్రియలో పలు సాంకేతిక సమస్యలు ఎదురవుతుండడం, విద్యా సంవత్సరం ప్రారంభమై ప్రవేశాలకు సమయం తక్కువగా ఉండడంతో విద్యార్థులు నష్టపోకూడదనే ఉద్దేశంతో సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇటీవల ప్రవేశాల నిలిపివేతపై అధికారులు జారీ చేసిన ప్రకటనతో విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి వ్యక్తమైన ఆందోళనలను పరిగణనలోకి తీసుకున్న ముఖ్యమంత్రి, వెంటనే ప్రవేశాల ప్రక్రియను ప్రారంభించాలని సూచించారు. రాష్ట్రంలో పదో తరగతి తర్వాత విద్యార్థులు చదువు మానేసే సంఖ్య గణియంగా ఉంటోంది. దీనికి ప్రధాన కారణం ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ వేరుగా ఉండడమేనని తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ గుర్తించింది. మెజారిటీ రాష్ట్రాల్లో 11, 12 తరగతులు పాఠశాల విద్యలోనే కొనసాగుతున్నాయి. ఇంటర్‌ను స్కూల్ ఎడ్యుకేషన్‌లో విలీనం చేస్తే, పదో తరగతి తర్వాత విద్యార్థులు చదువు ఆపేయకుండా పైతరగతులకు కొనసాగే అవకాశం ఉంటుందని కమిషన్ తన నివేదికలో పేర్కొంది.

అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, విద్యాశాఖ కమిషనర్ యోగితా రాణా, ఇతర ఉన్నతాధికారులతో ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. విలీన ప్రక్రియతో ముడిపడి ఉన్న పరిపాలనాపరమైన, సాంకేతికపరమైన అంశాలను క్షుణ్నంగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని ఈ సమావేశంలో నిర్ణయించారు.

తదుపరి అడుగు ఏమిటి?

తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ కమిటీ ఈ అంశంపై లోతుగా అధ్యయనం చేసి త్వరలో నివేదిక సమర్పించనుంది. విలీన ప్రక్రియపై సంబంధిత భాగస్వాములు, విద్యావేత్తలతో విస్తృతంగా సంప్రదింపులు జరపాలని సీఎం ఆదేశించారు. ఈ మార్పులపై తుది నిర్ణయం తీసుకునే ముందు శాసనసభలో చర్చించి, అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కాగా ప్రస్తుతానికి పాత పద్ధతిలోనే ప్రవేశాలు జరుగుతుండడంతో విద్యార్థులు తమకు నచ్చిన కళాశాలల్లో చేరవచ్చు. భవిష్యత్తులో విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం మరిన్ని విద్యా సంస్కరణలు తీసుకురావడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *