
పాములు సాధారణంగా చల్లని, చీకటి మనుషుల సంచారం తక్కువగా ఉండే ప్రదేశాలను ఇష్టపడతాయి. మన ఇంట్లోని స్టోర్ రూమ్‌లు, పాత సామాన్లు ఉన్న మూలలు, మెట్ల కింద ఉండే ఖాళీ ప్రదేశాలు పాత పెట్టెల వెనుక అవి సురక్షితంగా దాక్కుంటాయి. ఈ ప్రదేశాలను తరచుగా శుభ్రం చేయకపోవడం వల్ల పాములు అక్కడ గూడు కట్టుకునే ప్రమాదం ఉంది. అందుకే స్టోర్ రూమ్‌లను ఎప్పుడూ చిందరవందరగా ఉంచకుండా, క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి.
బాత్రూమ్‌లు..
బాత్రూమ్ సింకులు, డ్రైనేజీ పైపులు టాయిలెట్ పైపుల ద్వారా పాములు ఇంట్లోకి ప్రవేశించే అవకాశం ఉంది. పైపుల్లో ఉండే తేమ, అక్కడ తిరిగే కప్పలు ఎలుకలు పాములను ఆకర్షిస్తాయి. అలాగే నేలకు దగ్గరగా ఉండే షూ రాక్‌లు, మూసి ఉంచే అల్మరాలు కూడా పాములకు ఇష్టమైన ప్రదేశాలు. ముఖ్యంగా బయట ఉంచే బూట్లను వేసుకునే ముందు వాటిని ఒకసారి గట్టిగా నేలకేసి కొట్టి తనిఖీ చేసుకోవడం చాలా ముఖ్యం.
వంటగదిలో…
వంటగదిలో ఉండే ఫ్రిజ్ వెనుక భాగం, గ్యాస్ స్టవ్ కింద సింక్ కింద ఉండే మూలలు పాములకు అనువైన దాగుడు ప్రదేశాలు. ఫ్రిజ్ వెనుక ఉండే వెచ్చదనం నిశ్శబ్ద వాతావరణం వాటిని ఆకర్షిస్తుంది. వంటగదిని శుభ్రపరిచేటప్పుడు ఇలాంటి మూలలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఏదైనా సామాను తీసేటప్పుడు నేరుగా చేతులు పెట్టకుండా, ఒక పొడవైన పుల్లతో తనిఖీ చేయడం ఎంతో శ్రేయస్కరం.
పాములు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
గోడలకు లేదా తలుపుల కింద ఉండే సందులను వెంటనే మూసివేయండి.
ఇంటి చుట్టూ చెత్త లేదా ఎండు ఆకులు పేరుకుపోకుండా చూసుకోండి.
పాములకు ప్రధాన ఆహారమైన ఎలుకలు, కప్పలు ఇంట్లో లేకుండా జాగ్రత్తపడండి.
ఒకవేళ పాము కనిపిస్తే దానిని చంపడానికి లేదా పట్టుకోవడానికి ప్రయత్నించకుండా, వెంటనే స్నేక్ క్యాచర్స్ లేదా అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందించండి. వేసవిలో కొంచెం అప్రమత్తంగా ఉంటే పాముల ప్రమాదం నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఇంటిని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా పాములు రాకుండా నిరోధించవచ్చు.