Headlines

Punjab Kings : మా ప్లేయర్లను అంటే ఊరుకోం.. ఫేక్ న్యూస్‌పై నిప్పులు చెరిగిన ప్రీతి జింటా

Punjab Kings : మా ప్లేయర్లను అంటే ఊరుకోం.. ఫేక్ న్యూస్‌పై నిప్పులు చెరిగిన ప్రీతి జింటా


Punjab Kings : ఐపీఎల్ 2026 సీజన్ క్లైమాక్స్‌కు చేరువవుతున్న వేళ మైదానంలో ఆట కంటే బయట జరుగుతున్న ప్రచారమే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా పంజాబ్ కింగ్స్ జట్టులో విభేదాలు ఉన్నాయని, ప్లేయర్ల మధ్య సమన్వయం లోపించిందంటూ వస్తున్న వార్తలపై ఆ జట్టు సహ యజమాని, బాలీవుడ్ నటి ప్రీతి జింటా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోషల్ మీడియాలో తన జట్టు పరువు తీసేలా అసత్య ప్రచారాలు చేస్తే సహించేది లేదని ఆమె గట్టి వార్నింగ్ ఇచ్చారు.

ఈ ఏడాది ఐపీఎల్ టోర్నీని పంజాబ్ కింగ్స్ అద్భుతంగా ప్రారంభించింది. వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో టాప్‌లో నిలిచిన ఈ జట్టు, గత నాలుగు మ్యాచ్‌ల్లో వరుస ఓటములను చవిచూసింది. దీంతో ఒక్కసారిగా సమీకరణాలు మారిపోయాయి. ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో నాలుగో స్థానంలో ఉన్నప్పటికీ, తదుపరి మ్యాచ్‌లు ఆ జట్టుకు చావో రేవో లాంటివి. ఈ క్లిష్ట సమయంలో జట్టులో క్రమశిక్షణ లేదని, వ్యూహాలు ఫలించడం లేదని సోషల్ మీడియాలో విమర్శలు మొదలయ్యాయి.

తన జట్టుపై వస్తున్న ట్రోల్స్, రూమర్లపై ప్రీతి జింటా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. “గేమ్ గురించి చర్చలు చేయడం, విమర్శించడం సహజమే. కానీ ఉద్దేశపూర్వకంగా మా ఆటగాళ్ల పరువుకు భంగం కలిగించేలా కథనాలు సృష్టించడం కరెక్ట్ కాదు. బాధ్యతాయుతమైన మీడియా సంస్థలు నిరాధారమైన వార్తలను వ్యాప్తి చేయవద్దని కోరుతున్నాను” అంటూ ఆమె అసహనం వ్యక్తం చేశారు. కేవలం పాపులారిటీ కోసం జట్టు ప్రతిష్టను దెబ్బతీయడం సరికాదని ఆమె హితవు పలికారు.

కేవలం ప్రీతి జింటా మాత్రమే కాకుండా, పంజాబ్ కింగ్స్ మేనేజ్మెంట్ కూడా ఈ విషయంపై ఘాటుగా స్పందించింది. సరదా సంభాషణలు, అభిప్రాయాలను తాము గౌరవిస్తామని, కానీ చౌకబారు పబ్లిసిటీ కోసం అబద్ధాలు చెబితే ఊరుకోమని స్పష్టం చేసింది. ఆటగాళ్ల మధ్య గొడవలు ఉన్నాయంటూ జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని ఫ్రాంచైజీ తేల్చి చెప్పింది.

అన్ని వివాదాలను పక్కన పెట్టి ఇప్పుడు పంజాబ్ జట్టు ధర్మశాల వేదికగా గురువారం ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ పంజాబ్ కింగ్స్‌కు అత్యంత కీలకం. ఇందులో గెలిస్తేనే ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంటాయి. ఒకవేళ ఓడిపోతే మాత్రం టోర్నీ నుంచి నిష్క్రమించే ప్రమాదం ఉంది. మరి ఈ ఒత్తిడిని తట్టుకుని పంజాబ్ ప్లేయర్లు ఎలా రాణిస్తారో చూడాలి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *