టెక్నాలజీని వాడి చాలా మంది గొప్ప గొప్ప అద్భుతాలు సృష్టిస్తుంటే.. కోందరు మాత్రం తమ స్వార్థాల కోసం దానిని వినియోగిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. ఏఐ, టెలిగ్రామ్ ఛానెళ్లను ఉపయోగించి ఏకంగా రూ.64 కోట్లు కాజేసిన అంతర్రాష్ట్ర సైబర్ నేరగాళ్ల నెట్వర్క్ ఛేదించిన గుజరాత్ సైబర్ క్రైమ్ పోలీసులు.. ఈ రాకెట్ వెనుక ఉన్న వ్యక్తిని చూసి షాక్ అయ్యారు. ఎందుకంటే ఈ మొత్తం నేర సామ్రాజ్యం వెనుక ఉన్నది ఓ 18 ఏళ్ల రోహిత్ వీరేంద్రసింహ్ శాక్య అనే కుర్రాడు. యూపీ కాన్పూర్‌లోని ఓ హోటల్లో ఈ కుర్రాడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
సబ్స్క్రిప్షన్ పేరుతో సంపాధన
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రోహిత్ అనే ఈ కుర్రాడు 11వ తరగతిలోనే చదువును ఆపేసినప్పటికీ, 16 ఏళ్లకే కోడింగ్‌లో నైపుణ్యం సాధించాడు. ఆ తర్వాత ఏఐపై గ్రిప్ తెచ్చుకున్నాడు. ఇక ఆ ఏఐ టెక్నాలజీని ఉపయోగించి అసలైన బ్యాంకింగ్, ప్రభుత్వ, ప్రైవేట్ యాప్‌లను పోలి ఉండే నకిలీ యాప్‌లను తయారు చేయడం ప్రారంభించాడు. ఈ నకిలీ యాప్‌లను నేరుగా తనే ఉపయోగించకుండా.. సైబర్ నేరగాళ్లకు నెలకు రూ.15,000 సబ్స్క్రిప్షన్ ఫీజుతో అమ్మడం స్టార్ట్ చేశాడు. ఇలా జార్ఖండ్, హర్యానా, రాజస్థాన్‌లకు చెందిన సైబర్ గ్యాంగ్‌లకు ఈ మాల్వేర్ను సరఫరా చేసి డబ్బులు పోగు చేయడం మొదలుపెట్టాడు.
రెండు రకాల యాప్‌ల ద్వారా మోసం
రోహిత్ రెండు రకాల యాప్‌లను తయారు చేసినట్టు పోలీసులు విచారణలో బయటపడింది. ఒకటి విక్టిమ్ యాప్.. అంటే ఇవి అసలైన యాప్స్‌ను పోలి ఉండే ఫేక్ యాప్స్ సాధారణ ప్రజలు వీటిని నిజమైన యాప్‌లుగా భావించి ఫోన్లలో ఇన్స్టాల్ చేసుకునేలా దీనిని డిజైన్ చేశాడు. మరోటి అడ్మిన్ యాప్.. ఇది నేరగాళ్ల కోసం.. బాధితులు తమ ఫోన్లో ఈ యాప్ ఇన్స్టాల్ చేయగానే, ఈ అడ్మిన్ యాప్ ద్వారా నేరగాళ్లకు బాధితుడి ఫోన్లోని ఓటీపీలు (OTP), బ్యాంకింగ్ వివరాలు ఇడా సమాచారం మొత్తం వాళ్లకు వెళ్తొంది. ఒక రకంగా చెప్పాలంటే బాధితుల ఫోన్ యాక్సెస్ మొత్తం సైబర్ నేరగాళ్ల చేతిలో ఉంటుంది. తద్వారా వీళ్లు ఈజీగా బాధితుల అకౌంట్లను ఖాళీ చేసేవారు.
మరి ఎలా దొరికిపోయాడు?
మే నెలలో సూరత్‌కు చెందిన ఒక వ్యక్తి వాట్సాప్‌లో వచ్చిన PNB One.apk లింక్‌ను చూసి, ఇది అసలైన పంజాబ్ నేషనల్ బ్యాంక్ యాప్ అనుకొని ఫోన్లో ఇన్స్టాల్ చేసుకున్నాడు. దాంతో అతని అకౌంట్లో ఉన్న సుమారు రూ.5 లక్షలు మాయమయ్యాయి. దీంతో బాధితుడు వెంటనే సైబర్ హెల్ప్‌లైన్ (1930)కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు, ఈ నెట్వర్క్ వెనుక ఉన్న అసలు నిందితుడైన రోహిత్‌ను కనిపెట్టారు.
అయితే పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. రోహిత్ మొత్తం 121 నకిలీ APK యాప్‌లను తయారు చేసినట్లు గుర్తించారు. దేశవ్యాప్తంగా 21,672 మొబైల్ ఫోన్లలో ఇవి ఇన్స్టాల్ అయి ఉన్నాయని.. వీటిలో 2,928 పరికరాలు పూర్తిగా నేరగాళ్ల ఆధీనంలోనే ఉన్నాయని తెలిపారు. వీటి ద్వారా మొత్తం 54,094 లావాదేవీలలో రూ.64.38 కోట్లు కాజేసినట్లు పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా నకిలీ ఆర్టీఓ (RTO) చలాన్ యాప్‌ల ద్వారానే ఎక్కువ మొత్తంలో మోసాలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఇక నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని నుంచి రెండు మొబైల్ ఫోన్లు, ఒక లాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.