
అమెరికా-ఇరాన్ మధ్య వార్, పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలతో ప్రపంచవ్యాప్తంగా సరఫరా గొలుసును దెబ్బతీశాయి. దీంతో వస్తువుల రవాణా ఖర్చు మరింత పెరిగింది. ఈ ప్రభావంతో ముడి పదార్థాలు, ముడి చమురు, ప్యాకేజింగ్ సామగ్రి ధరలు ఇటీవల కాలంగా భారీగా పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక పరిస్థితులు, రాజకీయ అనిశ్చితి ద్రవ్యోల్బణంపై ఒత్తిడిని మరింత పెంచాయి. అంతర్జాతీయంగా నెలకున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం భారత్‌పై కూడా పడుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువలో భారీగా హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. దీని వల్ల విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులకు ఎక్కువ మొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది. ఈ పెరిగిన ఖర్చులను భర్తీ చేయడానికి అనేక కంపెనీలు ఆగస్టు నుండి ధరలను పెంచడానికి ప్రణాళికలు రచిస్తున్నాయి.
ఏయే వస్తువుల ధరలు పెరగనున్నాయంటే..?
టెలివిజన్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, స్మార్ట్ఫోన్ల వంటి ఎలక్ట్రానిక్స్ పరికరాలతో పాటు దుస్తులు, కార్లు, హెయిర్ ఆయిల్ ధరలు పెరిగే అవకాశముంది. ఆగస్ట్ నుంచే ఈ పెరుగుదల ఉండనుందని తెలుస్తోంది. ప్యాక్ చేసిన టీ ధరలు 6 శాతం నుండి 8 శాతం వరకు, హెయిర్ ఆయిల్ 6% నుండి 8% వరకు, టీవీల ధరలు 4 శాతం నుండి 6 శాతం వరకు, రిఫ్రిజిరేటర్ ధరలు 4 శాతం నుండి 6 శాతం వరకు, వాషింగ్ మెషీన్ ధరలు 10 శాతం వరకు, బ్రాండెడ్ దుస్తులు 8 శాతం వరకు పెరిగే అవకాశముంది. మెమరీ చిప్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ భాగాల ధరల ఇటీవల భారీగా పెరిగాయి. దీంతో స్మార్ట్‌ఫోన్, ల్యాప్ టాప్ ధరలు భారీగా పెరగనున్నాయి.
పెరగనున్న కార్ల ధరలు..
పెరిగిన ముడిసరుకు ఖర్చుల కారణంగా పలు వాహన తయారీ సంస్థలు ఆగస్టు నుంచి ధరలు పెంచాలని భావిస్తున్నాయి. మారుతి సుజుకి ఎంపిక చేసిన మోడళ్ల ధరలను రూ.30 వేల వరకు పెంచే అవకాశం ఉన్నట్లు తెలస్తోంది. ఇక హోండా కార్స్ ఇండియా కూడా ఆగస్టు 1 నుంచి ధరలను సవరించడానికి సిద్ధమవుతోంది. అలాగే మెర్సిడెస్-బెంజ్ ధరలను ఆగస్ట్ నుంచి పెంచాలని యోచిస్తోంది. టాటా మోటార్స్, మహీంద్రా ఈ నెల ప్రారంభంలోనే కొన్ని మోడళ్ల ధరలను పెంచాయి. పెరుగుతున్న ఖర్చులను తగ్గించుకునేందుకు వినియోగదారులపై భారం మోపేందుకు సిద్దమవుతున్నాయి. ఆగస్ట్ నుంచే వీటి ధరలు పెరిగే అవకాశముంది. దీంతో వచ్చే నెలలో అనేక వస్తువుల ధరలు పెరగడం చూడవచ్చు. పండుగ సీజన్లో దుస్తులు, స్మార్ట్ ఫోన్లు లాంటివి కొనాలంటే ఇక ఎక్కువ ఖర్చు పెట్టాల్సిందే.