వ్యవసాయ రంగంలో నీటిపారుదల అత్యంత కీలకమైన అంశం. పంటలకు సరైన సమయంలో నీరు అందించేందుకు విద్యుత్ అవసరం కాగా, తరచూ విద్యుత్ కోతలు రైతులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా కేంద్ర ప్రభుత్వం రైతులకు సోలార్ పంపులను ప్రోత్సహిస్తోంది. ప్రధాన మంత్రి కిసాన్ ఊర్జా సురక్షా ఏవం ఉత్థాన్ మహాభియాన్ (PM-KUSUM) పథకం ద్వారా రైతులు తక్కువ ఖర్చుతో సౌరశక్తి ఆధారిత నీటిపారుదల సదుపాయాలను ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పిస్తోంది.
ఈ పథకం కింద సోలార్ పంపుల ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి భారీగా ఆర్థిక సహాయం అందిస్తున్నాయి. రైతులకు సాధారణంగా 60 శాతం వరకు సబ్సిడీ లభిస్తుంది. అదనంగా 30 శాతం వరకు తక్కువ వడ్డీతో బ్యాంకు రుణ సదుపాయం అందుబాటులో ఉంటుంది. దీంతో రైతులు తమ సొంతంగా కేవలం 10 శాతం వరకు మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుంది. కొన్ని రాష్ట్రాల్లో ప్రత్యేక నిబంధనల ప్రకారం చిన్న, సన్నకారు రైతులకు 90 శాతం వరకు సబ్సిడీ కూడా అందిస్తున్నారు.
ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో సోలార్ పంపులపై ప్రత్యేక ప్రోత్సాహకాలు అమలు చేస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాలు, కొండ ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం మరింత ఎక్కువ ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. దీని ద్వారా రైతుల విద్యుత్ ఖర్చులు తగ్గడంతో పాటు, నిరంతర నీటి సరఫరా సాధ్యమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
సోలార్ పంపు ఖర్చు ఎంత?
సోలార్ పంపు ధర దాని సామర్థ్యం (హెచ్‌పీ) ఆధారంగా మారుతుంది. సాధారణంగా 3 హెచ్‌పీ సోలార్ పంపు మార్కెట్ ధర సుమారు రూ.1.5 లక్షల నుంచి రూ.1.8 లక్షల వరకు ఉంటుంది. అయితే ప్రభుత్వ సబ్సిడీ తర్వాత రైతులు దీన్ని సుమారు రూ.40 వేల నుంచి రూ.45 వేల వరకు పొందే అవకాశం ఉంటుంది. 5 హెచ్‌పీ సోలార్ పంపు అసలు ధర రూ.3 లక్షలకు పైగా ఉండవచ్చు. సబ్సిడీ పొందిన తర్వాత రైతులపై పడే భారం సుమారు రూ.60 వేల నుంచి రూ.65 వేల వరకు తగ్గుతుంది. ఇక పెద్ద వ్యవసాయ భూములకు ఉపయోగించే 7.5 హెచ్‌పీ నుంచి 10 హెచ్‌పీ సామర్థ్యం గల సోలార్ పంపుల ధర సబ్సిడీ అనంతరం సుమారు రూ.85 వేల నుంచి రూ.1.15 లక్షల వరకు ఉండవచ్చు.
దరఖాస్తు విధానం
PM-KUSUM పథకం ప్రయోజనం పొందేందుకు రైతులు తమ రాష్ట్రానికి సంబంధించిన దరఖాస్తు విధానాన్ని అనుసరించాలి. ఈ ప్రక్రియ రాష్ట్రాల వారీగా మారుతుంది. రైతులు కేంద్ర ప్రభుత్వ అధికారిక పోర్టల్ ద్వారా తమ రాష్ట్రానికి సంబంధించిన సమాచారం తెలుసుకోవచ్చు. సమీప వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు.
సోలార్ పంపుల వినియోగంతో రైతులు విద్యుత్‌పై ఆధారపడటాన్ని తగ్గించుకోవడమే కాకుండా, దీర్ఘకాలంలో సాగు ఖర్చులను కూడా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని పెంచడంతో పాటు రైతుల ఆదాయాన్ని మెరుగుపరచడమే ఈ పథకం ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొంటోంది.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..