న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వచ్చిన సరికొత్త చిత్రం ‘ది పారడైజ్’ (The Paradise). గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘దసరా’ చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత మళ్లీ వీరిద్దరి కాంబోలో వచ్చిన ఈ మూవీ మరోసారి బాక్సాఫీస్ షేక్ చేసింది. భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 24న అడియన్స్ ముందుకు వచ్చిన ది ప్యారడైజ్ చిత్రం అటు కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. ముఖ్యంగా నాని నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారు విమర్శకులు.
అయితే ఈ సినిమా సక్సెస్ కావడంతో తెలంగాణలోని ములుగు జిల్లాలో ఉన్న ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రం మేడారం శ్రీ సమ్మక్క-సారలమ్మ వనదేవతలను ‘ది పారడైజ్’ చిత్రబృందం దర్శించుకుంది. హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, నిర్మాత సుధాకర్ చెరుకూరితో పాటు చిత్ర ప్రధాన సాంకేతిక నిపుణులు మేడారం గద్దెల వద్ద ప్రత్యేకాంశంగా నిలిచారు. తమ కొత్త సినిమా విజయవంతం అయిన సందర్భంగా సమ్మక్క, సారాలమ్మ అమ్మవార్లకు సాంప్రదాయబద్ధంగా నిలువెత్తు ‘బంగారం’ (బెల్లం) సమర్పించి, తమ మొక్కులు చెల్లించుకున్నారు.
చిత్రబృందం రాకతో మేడారం ఆలయ ప్రాంగణం సందడిగా మారింది. నాని, శ్రీకాంత్ ఓదెలలకు ఆలయ అధికారులు , పూజారులు ఘనంగా స్వాగతం పలికారు. దైవ దర్శనం అనంతరం పూజారులు వారికి శేషవస్త్రాలు కప్పి తీర్థప్రసాదాలను అందించారు. నానిని చూసేందుకు స్థానిక ప్రజలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. అభిమానులందరికీ నాని నమస్కరిస్తూ, చిరునవ్వుతో అభివాదం చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.
శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు. నిజానికి ఈ మూవీ ప్రకటన వెలువడినప్పటి నుంచే అభిమానుల్లో తీవ్ర ఆసక్తి నెలకొనగా.. ఇప్పుడు విడుదలైన తర్వాత బాక్సాఫీస్ షేక్ చేస్తుంది. 'దసరా' లాంటి మాస్ హిట్ తర్వాత ఇప్పుడు ది ప్యారడైజ్ చిత్రంతో మరో సెన్సేషనల్ హిట్ అందుకుంది చిత్రయూనిట్. ప్రస్తుతం మేడారం పర్యటనకు సంబంధించిన ఫొటోలు , వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.
ఇదిలా ఉంటే.. బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు నుంచే ‘ది పారడైజ్’ సునామీ సృష్టించింది. మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ, వసూళ్ల పరంగా మాత్రం నాని కెరీర్లోనే సరికొత్త చరిత్ర తిరగరాసింది. తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 88 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి, నాని సినీ ప్రస్థానంలోనే అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.155 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఓవర్సీస్లో ముఖ్యంగా నార్త్ అమెరికా రీజియన్‌లో కేవలం వీకెండ్లోనే $2 మిలియన్ డాలర్ల మార్కును దాటి దూసుకుపోతోంది.




