బెంగళూరు, సెప్టెంబర్ 29: ఐటీ ఉద్యోగాల కోసం దేశవ్యాప్తంగా ఎంతోమంది బెంగళూరుకు వస్తుంటారు. మంచి జీతం, మెరుగైన కెరీర్ కోసం కార్పొరేట్ కొలువులను ఆశ్రయిస్తారు. అయితే ఓ యువతి మాత్రం మంచి జీతం వచ్చే ఐటీ ఉద్యోగాన్ని వదిలేసి ఆటో డ్రైవర్గా మారింది. ఇందుకు కారణం తెలుసుకున్న నెటిజన్లు ఆమె నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నారు.
సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ తన్వి శెట్టి బెంగళూరులో రాపిడో ఆటోలో ప్రయాణిస్తున్న సమయంలో ఈ యువతిని కలిశారు. ఆటో నడుపుతున్న యువతి అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడటంతో తన్వి ఆశ్చర్యపోయారు. ఆమె గురించి తెలుసుకునేందుకు మాట్లాడగా, తన జీవిత ప్రయాణానికి సంబంధించిన విషయాలను యువతి వెల్లడించింది. ఆ యువతి గతంలో ఓ ప్రైవేట్ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేసేది. అయితే తండ్రి మరణం తర్వాత కుటుంబ పరిస్థితుల్లో మార్పు వచ్చింది. ముఖ్యంగా ఐటీ ఉద్యోగంలో రాత్రి షిఫ్టులు ఉండటంతో తన తల్లిని రాత్రివేళ ఇంట్లో ఒంటరిగా వదిలి వెళ్లడం ఆమెకు ఇబ్బందిగా అనిపించింది. తన తల్లి భద్రత, సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించుకున్న ఆమె.. చివరకు కార్పొరేట్ ఉద్యోగానికి రాజీనామా చేసింది.
ఇవి కూడా చదవండి
కుటుంబం వ్యతిరేకించినా వెనక్కి తగ్గలేదు.. ఐటీ ఉద్యోగం కంటే ఇదే బెటర్
ఐటీ ఉద్యోగాన్ని వదిలి ఆటో నడపాలన్న ఆమె నిర్ణయాన్ని మొదట కుటుంబ సభ్యులు కూడా వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. ‘బాగా చదువుకున్న అమ్మాయి ఆటో నడపడం ఏంటి? సమాజం ఏమనుకుంటుంది?’ అంటూ ప్రశ్నలు ఎదురయ్యాయి. అయితే యువతి మాత్రం ఇతరుల అభిప్రాయాలను పట్టించుకోకుండా తనకు నచ్చిన మార్గాన్ని ఎంచుకుంది. ఆటో నడపడం ద్వారా తన తల్లితో ఎక్కువ సమయం గడపగలుగుతున్నానని ఆమె చెప్పింది. అంతేకాదు, ఐటీ ఉద్యోగంలో సంపాదించిన దానికంటే ప్రస్తుతం ఎక్కువ ఆదాయం వస్తోందని తెలిపింది.
తన కుటుంబ బాధ్యతలను నిర్వర్తించడంతో పాటు స్వయం సమృద్ధిగా జీవించేందుకు ఆమె తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. తన తల్లి కోసం కార్పొరేట్ ఉద్యోగాన్ని సైతం వదులుకుని, స్వతంత్రంగా జీవితం కొనసాగిస్తున్న యువతి ధైర్యాన్ని పలువురు నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఈ వీడియోకు సోషల్ మీడియాలో భారీగా స్పందన లభిస్తోంది.