Maharshi Dadhichi Jayanti 2026 Telugu: ఆధ్యాత్మికత, త్యాగం, నిస్వార్థ సేవకు ప్రతీకగా మహర్షి దధీచి పేరు పురాణాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. తన కోసం కాకుండా లోకక్షేమం కోసం ప్రాణాలను సైతం త్యాగం చేసిన మహర్షిగా ఆయనను భక్తులు స్మరించుకుంటారు. ప్రతి సంవత్సరం భాద్రపద శుక్ల పక్ష అష్టమి రోజున మహర్షి దధీచి జయంతిని భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. 2026లో సెప్టెంబర్ 19న ఈ జయంతి నిర్వహించనున్నారు.
మహర్షి దధీచి జయంతి 2026
2026లో భాద్రపద శుక్ల అష్టమి తిథి సెప్టెంబర్ 18 మధ్యాహ్నం 1:00 గంటలకు ప్రారంభమై, సెప్టెంబర్ 19 మధ్యాహ్నం 3:26 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి సంప్రదాయం ప్రకారం సెప్టెంబర్ 19న మహర్షి దధీచి జయంతిని ఆచరిస్తారు. ఈ రోజున ఉదయం 7:42 నుంచి 9:14 గంటల వరకు పూజకు అనుకూలమైన సమయంగా పేర్కొంటారు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:50 నుంచి మధ్యాహ్నం 12:39 వరకు ఉంటుంది.
వజ్రాయుధం కోసం చేసిన మహా త్యాగం
పురాణ కథనం ప్రకారం, వృత్రాసురుడి వల్ల దేవతలు, ముల్లోకాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. అతడిని సంహరించడానికి సాధారణ ఆయుధాలు సరిపోవని తెలుసుకున్న ఇంద్రుడు, దేవతలతో కలిసి శ్రీమహావిష్ణువును ఆశ్రయించాడు. మహర్షి దధీచి ఎముకలతో తయారు చేసిన ఆయుధంతోనే వృత్రాసురుడిని ఓడించగలమని విష్ణుమూర్తి సూచించినట్లు పురాణాలు చెబుతాయి. దీంతో ఇంద్రుడు మహర్షి దధీచిని ఆశ్రయించాడు. లోకకల్యాణం కోసం తన శరీరాన్ని త్యాగం చేయడానికి దధీచి ఏమాత్రం వెనుకాడలేదని కథనం. యోగసమాధిలోకి ప్రవేశించి దేహాన్ని త్యజించగా, ఆయన వెన్నెముకతో సహా ఎముకలతో విశ్వకర్మ వజ్రాయుధాన్ని రూపొందించినట్లు పురాణగాథ చెబుతుంది. ఆ వజ్రాయుధంతో ఇంద్రుడు వృత్రాసురుడిని సంహరించాడని విశ్వాసం.
ఇవి కూడా చదవండి
దధీచి త్యాగం ఇచ్చే సందేశం
మహర్షి దధీచి కథ కేవలం పురాణగాథ మాత్రమే కాకుండా నిస్వార్థ సేవ, త్యాగం, ధర్మం పట్ల అంకితభావానికి ప్రతీకగా భావించబడుతుంది. మన దగ్గర ఉన్న సంపద, జ్ఞానం, సమయం లేదా శక్తిని అవసరమైన వారికి పంచుకోవాలనే స్ఫూర్తిని ఆయన జీవితం అందిస్తుంది.
జయంతి రోజున భక్తులు మహర్షి దధీచిని స్మరించుకుంటూ పూజలు, హోమాలు, అన్నదానాలు, రక్తదాన శిబిరాలు వంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇంట్లో ఆయన చిత్రపటానికి పుష్పాలు సమర్పించి, దీపం వెలిగించి, లోకక్షేమం కోసం ప్రార్థించవచ్చు.
మహర్షి దధీచి జీవితం మనకు చెప్పే గొప్ప సందేశం ఒక్కటే.. తన కోసం జీవించడం సాధారణం.. ఇతరుల మేలు కోసం జీవించడం, అవసరమైతే త్యాగం చేయడం మహోన్నతమైన జీవితం.
(Disclaimer: ఈ కథనం హిందూ పురాణాలు, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విశ్వాసాల ఆధారంగా అందించబడింది. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునేముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)