Headlines

KKR vs LSG: కేకేఆర్‌కు అన్యాయం జరిగిందా..? వింత నిబంధనతో అవుటైన బ్యాటర్.. మైదానంలో హైడ్రామా!

KKR vs LSG: కేకేఆర్‌కు అన్యాయం జరిగిందా..? వింత నిబంధనతో అవుటైన బ్యాటర్.. మైదానంలో హైడ్రామా!


Angkrish Raghuvanshi Run Out: లక్నోలోని ఏకనా స్టేడియంలో జరిగిన పోరులో కోల్‌కతా ఇన్నింగ్స్ ఐదో ఓవర్‌లో ఎవ్వరూ ఊహించని సంఘటన చోటుచేసుకుంది. ప్రిన్స్ యాదవ్ వేసిన ఆ ఓవర్ చివరి బంతిని రఘువంశీ మిడ్-ఆన్ వైపు నెట్టి పరుగు కోసం ప్రయత్నించాడు. అయితే, అవతలి వైపు ఉన్న బ్యాటర్ నిరాకరించడంతో సగం దూరం వెళ్లిన రఘువంశీ తిరిగి క్రీజులోకి వచ్చేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో ఫీల్డర్ విసిరిన బంతి రఘువంశీ శరీరానికి తగిలింది. లక్నో ఆటగాళ్లు అప్పీల్ చేయగా, మైదానంలోని అంపైర్లు నిర్ణయాన్ని మూడో అంపైర్‌కు బదిలీ చేశారు.

అంపైర్ నిర్ణయంపై పెను దుమారం..

సాధారణంగా బంతి బ్యాటర్‌కు తగిలితే అది ప్రమాదవశాత్తు జరిగినట్లు భావిస్తారు. కానీ, మూడో అంపైర్ రీప్లేలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత భిన్నమైన తీర్పు ఇచ్చారు. రఘువంశీ క్రీజులోకి వచ్చే క్రమంలో తన దిశను మార్చుకున్నాడని, బంతి వికెట్లకు తగలకుండా అడ్డుగా వెళ్లాడని అంపైర్ నిర్ధారించారు. ముఖ్యంగా అతను పరుగెత్తే విధానం (టన్నింగ్ రేడియస్) సాధారణంగా లేదని, కావాలనే బంతి వచ్చే దారిలోకి వెళ్లాడని భావించి ‘అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్’ కింద అవుట్‌గా ప్రకటించారు. ఈ నిర్ణయంతో కోల్‌కతా శిబిరం ఒక్కసారిగా షాక్‌కు గురైంది.

ఆగ్రహంతో ఊగిపోయిన రఘువంశీ..

అంపైర్ అవుట్ అని ప్రకటించగానే రఘువంశీ తన సహనాన్ని కోల్పోయాడు. మైదానంలోనే అసహనం వ్యక్తం చేస్తూ తన హెల్మెట్‌ను విసిరికొట్టాడు. కేవలం 9 పరుగుల వద్ద అంతటి కీలకమైన మ్యాచ్‌లో ఇలా వింతగా అవుట్ కావడం అతన్ని తీవ్రంగా కలిచివేసింది. బౌండరీ లైన్ దాటిన తర్వాత కూడా తన బ్యాట్‌ను నేలకేసి కొడుతూ డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

ఏమిటీ ‘అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్’ నిబంధన..?

క్రికెట్ నిబంధనల ప్రకారం, ఒక బ్యాటర్ ఫీల్డింగ్ చేస్తున్న జట్టును కావాలని అడ్డుకున్నా లేదా బంతి వికెట్లకు తగలకుండా తన శరీరంతో గానీ, బ్యాట్‌తో గానీ దిశ మార్చినా ఈ నిబంధన కింద అవుట్ ఇస్తారు. రఘువంశీ విషయంలో కూడా అతను క్రీజులోకి డైవ్ చేసేటప్పుడు బంతి లైన్‌లోకి వచ్చాడని అంపైర్లు భావించారు. అయితే తను కేవలం క్రీజులోకి చేరుకోవడానికే ప్రయత్నించానని, కావాలని బంతిని అడ్డుకోలేదని రఘువంశీ వాదన.

మ్యాచ్‌పై పడిన ప్రభావం..

ఈ వివాదాస్పద అవుట్ కారణంగా కోల్‌కతా జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. ఒకవైపు మొహ్సిన్ ఖాన్ తన పదునైన బౌలింగ్‌తో వికెట్లు తీస్తుంటే, మరోవైపు ఇలాంటి దురదృష్టకర అవుట్లు జట్టు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాయి. రింకూ సింగ్ ఒంటరి పోరాటం చేసినప్పటికీ, టాప్ ఆర్డర్ వైఫల్యం, ఈ వివాదాస్పద నిర్ణయం కోల్‌కతాను తక్కువ స్కోరుకే పరిమితం చేశాయి. అంపైర్ల నిర్ణయాలపై సోషల్ మీడియాలో నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయి చర్చిస్తున్నారు. కొందరు నిబంధనల ప్రకారం ఇది సరైనదే అంటుంటే, మరికొందరు ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *