IPL 2026 Points Table : ఐపీఎల్ పాయింట్ల పట్టికలో ఒక్క గెలుపు సమీకరణాలను ఎంతలా మారుస్తుందో ముంబై ఇండియన్స్ నిరూపించింది. వరుస ఓటములతో సతమతమవుతూ, పాయింట్స్ టేబుల్ చిట్టచివరన ఉన్న ముంబై.. గుజరాత్ టైటాన్స్‌పై సాధించిన 99 పరుగుల భారీ విజయం ఆ జట్టు తలరాతను ఒక్కసారిగా మార్చేసింది. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం నుంచి ఏకంగా ఏడో స్థానానికి ఎగబాకిన ముంబై, తనతో పాటు మరో నాలుగు జట్ల స్థానాలను తలకిందులు చేసింది.
ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభంలో వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఓడిపోయి డీలా పడిన ముంబై ఇండియన్స్, తన ఆరో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను 99 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఈ భారీ విజయం కేవలం 2 పాయింట్లను మాత్రమే ఇవ్వలేదు, ఆ జట్టు నెట్ రన్‌రేట్‌ను అమాంతం పెంచేసింది. మ్యాచ్‌కు ముందు -1.07 గా ఉన్న రన్‌రేట్, ఇప్పుడు +0.067 కి చేరింది. దీంతో పాయింట్ల పట్టికలో 10వ స్థానంలో ఉన్న ముంబై, ఏకంగా మూడు స్థానాలు ఎగబాకి 7వ స్థానానికి చేరుకుంది. ప్రస్తుతం ముంబై ఖాతాలో 6 మ్యాచ్‌ల నుంచి 4 పాయింట్లు ఉన్నాయి.
ముంబై సాధించిన ఈ ఒక్క విజయం వల్ల ఇతర జట్లు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ముఖ్యంగా కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) పరిస్థితి పాపం అన్నట్టుగా మారింది. ఒక రోజూ క్రితమే విజయం సాధించి ముంబైని అట్టడుగుకి నెట్టి సంబరపడిన కేకేఆర్, ఇప్పుడు మళ్ళీ 10వ స్థానానికి పడిపోయింది. అలాగే చెన్నై సూపర్ కింగ్స్ (CSK) 7వ స్థానం నుంచి 8వ స్థానానికి, లక్నో సూపర్ జెయింట్స్ (LSG) 8వ స్థానం నుంచి 9వ స్థానానికి పడిపోయాయి. ముంబై ధాటికి ఈ మూడు జట్ల ర్యాంకింగ్స్ దిగజారాయి.
సొంత గడ్డపై ముంబైని ఓడించి టాప్-4 లోకి వెళ్లాలని ఆశపడిన శుభ్‌మన్ గిల్ సేనకు నిరాశే మిగిలింది. ఈ దారుణ ఓటమితో గుజరాత్ రన్‌రేట్ -0.821 కి పడిపోయింది. ప్రస్తుతం ఆ జట్టు 6 పాయింట్లతో 6వ స్థానంలోనే కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో ముంబై బౌలర్ అశ్విని కుమార్ 4 వికెట్లతో మాయ చేయగా, బుమ్రా తన తొలి వికెట్ తీసి ఫామ్‌లోకి రావడం ఆ జట్టుకు ప్లస్ అయ్యింది. తిలక్ వర్మ సెంచరీ ఇన్నింగ్స్ ముంబై విజయంలో కీలక పాత్ర పోషించింది.
ముంబై ఇండియన్స్ ఇప్పుడు లక్న, చెన్నై జట్లతో పాయింట్ల పరంగా సమానంగా ఉంది. అయితే మెరుగైన నెట్ రన్‌రేట్ కారణంగా వారి కంటే పైన నిలిచింది. రాబోయే మ్యాచ్‌ల్లో ముంబై ఇదే జోరును కొనసాగిస్తే ప్లే-ఆఫ్స్ రేసు మరింత ఆసక్తికరంగా మారనుంది. ఐదుసార్లు ఛాంపియన్‌గా ఉన్న ముంబైకి ఇలాంటి కమ్‌బ్యాక్‌లు కొత్తేమీ కాదు. ఈ గెలుపుతో జట్టులో ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. పాయింట్ల పట్టికలో మొదటి నాలుగు స్థానాల కోసం ఇప్పుడు తీవ్రమైన పోటీ నెలకొంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..