Headlines

IPL 2026: బంటీ.. నీ హాఫ్ సెంచరీ ఇంత స్లోనా ఏంటి.. ఐపీఎల్ 2026లో అత్యంత చెత్త రికార్డ్ ఇదే..!

IPL 2026: బంటీ.. నీ హాఫ్ సెంచరీ ఇంత స్లోనా ఏంటి.. ఐపీఎల్ 2026లో అత్యంత చెత్త రికార్డ్ ఇదే..!


Ruturaj Gaikwad Slowest Half Century: చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో సొంత ప్రేక్షకుల మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఆరంభం అస్సలు బాగాలేదు. గుజరాత్ బౌలర్ల ధాటికి కేవలం 37 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఒకానొక దశలో జట్టు కనీసం 100 పరుగులైనా చేస్తుందా అన్న అనుమానం కలిగింది. అటువంటి క్లిష్ట సమయంలో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ క్రీజులో పాతుకుపోయాడు. వికెట్ల పతనాన్ని అడ్డుకుంటూ ఇన్నింగ్స్‌ను నెమ్మదిగా ముందుకు నడిపించాడు. గత ఏడు ఇన్నింగ్స్‌ల్లో ఒక్కసారి కూడా 30 పరుగుల మార్కును దాటలేకపోయిన రుతురాజ్, ఈ మ్యాచ్‌లో మాత్రం ఓర్పుగా ఆడాడు.

సీజన్‌లోనే అత్యంత నెమ్మదైన అర్ధ సెంచరీ..

గైక్వాడ్ తన అర్ధ సెంచరీని చేరుకోవడానికి ఏకంగా 49 బంతులు తీసుకున్నాడు. ఇది ప్రస్తుత ఐపీఎల్ 2026 సీజన్‌లోనే అత్యంత నెమ్మదైన హాఫ్ సెంచరీగా నమోదైంది. అంతకుముందు ఈ రికార్డు ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ పేరిట ఉండేది. పంత్ హైదరాబాద్‌పై 43 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేయగా, గైక్వాడ్ ఆ రికార్డును అధిగమించాడు. మైదానంలో బంతి బ్యాటుపైకి సరిగ్గా రాకపోవడం, వరుసగా వికెట్లు పడటంతో ఆయన ఆచితూచి ఆడక తప్పలేదు. అయితే, హాఫ్ సెంచరీ తర్వాత తన వేగాన్ని పెంచిన రుతురాజ్, మొత్తం 60 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 74 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

సీఎస్కే బ్యాటర్ల తడబాటు..

ఈ మ్యాచ్‌లో చెన్నై బ్యాటర్లు పరుగులు తీయడానికి చాలా ఇబ్బంది పడ్డారు. జట్టు స్కోరు 50 పరుగులకు చేరుకోవడానికి ఏకంగా 12 ఓవర్లు (72 బంతులు) పట్టింది. ఐపీఎల్ చరిత్రలో చెన్నై జట్టుకు ఇది రెండో అత్యంత చెత్త స్కోర్ గా నిలిచింది. 2011లో బెంగళూరుపై 12.1 ఓవర్లలో 50 పరుగులు చేసిన చెన్నై, మళ్లీ ఇన్నాళ్ల తర్వాత ఇంతటి గడ్డు పరిస్థితిని ఎదుర్కొంది. రుతురాజ్ మినహా మిగిలిన ఆటగాళ్లెవరూ గుజరాత్ బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కోలేకపోయారు.

జట్టుకు గౌరవప్రదమైన స్కోరు..

రుతురాజ్ గైక్వాడ్ ఆఖరి వరకు క్రీజులో ఉండటంతో చెన్నై జట్టు నిర్ణీత ఓవర్లలో గౌరవప్రదమైన స్కోరును సాధించగలిగింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా, కెప్టెన్ ఒంటరి పోరాటం చేయడం జట్టులో నూతనోత్సాహాన్ని నింపింది. ఈ ఇన్నింగ్స్ నెమ్మదిగా సాగినప్పటికీ, మ్యాచ్ గమనాన్ని బట్టి చూస్తే ఇది జట్టుకు ఎంతో అవసరమైన ఇన్నింగ్స్ అని విశ్లేషకులు భావిస్తున్నారు. గైక్వాడ్ ఫామ్‌లోకి రావడం చెన్నై అభిమానులకు ఊరటనిచ్చే అంశం.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *