IPL 2026 : ఐపీఎల్ 2026 మ్యాచ్‌లు సాగుతున్న తీరుపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. టీ20 క్రికెట్ అంటేనే వేగం, ఉత్సాహం.. కానీ ప్రస్తుత ఐపీఎల్ మ్యాచ్‌లు సాగదీతగా మారుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మ్యాచ్‌లు నాలుగు గంటల కంటే ఎక్కువ సమయం తీసుకోవడం వల్ల స్టేడియానికి వచ్చే సామాన్య ప్రేక్షకులు, ముఖ్యంగా పిల్లలతో వచ్చే తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గవాస్కర్ పేర్కొన్నారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన బీసీసీఐని కోరుతూ తన తాజా కాలమ్‌లో కొన్ని సంచలన సూచనలు చేశారు.
ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆర్సీబీ, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ నాలుగు గంటల పైనే సాగడం గవాస్కర్‌ను అసహనానికి గురి చేసింది. తరచుగా రిజర్వ్ ప్లేయర్లు బౌండరీ లైన్ దగ్గర ఉన్న ఫీల్డర్లకు వాటర్ బాటిల్స్ ఇవ్వడానికి మైదానంలోకి వస్తున్నారు. ఇది చాలా అనవసరమైన విషయం. దీనివల్ల ఆట మధ్యలో 11 మంది కంటే ఎక్కువ మంది మైదానంలో ఉన్నట్టు అనిపిస్తోందని ఆయన విమర్శించారు. అలాగే స్ట్రాటజిక్ టైమౌట్ సమయంలో కోచింగ్ స్టాఫ్, ఇతర ప్లేయర్లు మైదానంలోకి రావడం వల్ల సమయం వృధా అవుతోందని, కేవలం ఇద్దరు రిజర్వ్ ప్లేయర్లు, ఇద్దరు కోచింగ్ స్టాఫ్ సభ్యులను మాత్రమే అనుమతించాలని ఆయన సూచించారు.
మ్యాచ్ సమయాన్ని తగ్గించడానికి గవాస్కర్ కొన్ని కీలక మార్పులు ప్రతిపాదించారు. ప్రస్తుతం ఒక వికెట్ పడిన తర్వాత కొత్త బ్యాటర్ రావడానికి ఇస్తున్న రెండు నిమిషాల సమయాన్ని ఒక నిమిషానికి తగ్గించాలన్నారు. ప్లేయర్లు అందరూ డగౌట్‌లోనే రెడీగానే ఉంటున్నారు కదా, మరి రావడానికి అంత సమయం ఎందుకు? ఒక నిమిషంలో బ్యాటర్ క్రీజులోకి రాకపోతే ఒకటి రెండు హెచ్చరికల తర్వాత పెనాల్లీ పరుగులు విధించాలని గవాస్కర్ గట్టిగా చెప్పారు. ప్రతి ఓవర్ మధ్యలో ఆటగాళ్లు తీసుకునే విరామాలు కూడా అనవసరంగా ఆటను ఆలస్యం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు.
మరోవైపు ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టికలో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ఆధిపత్యం చలాయిస్తున్నాయి. శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని పంజాబ్ కింగ్స్ వరుస విజయాలతో నంబర్ వన్ స్థానంలో ఉండగా, బెంగళూరు రెండో స్థానంలో కొనసాగుతోంది. లక్నో సూపర్ జెయింట్స్ టేబుల్ అడుగున ఉండగా, చెన్నై, గుజరాత్, ఢిల్లీ జట్లు మధ్యలో ఊగిసలాడుతున్నాయి. అయితే మ్యాచ్‌ల క్వాలిటీ పెరగాలంటే సమయపాలన పాటించడం చాలా ముఖ్యమని గవాస్కర్ వంటి సీనియర్లు గుర్తు చేస్తున్నారు.
స్టేడియానికి వచ్చే ప్రేక్షకుల సౌలభ్యం గురించి ఆలోచించాలని గవాస్కర్ బీసీసీఐకి విజ్ఞప్తి చేశారు. రాత్రి మ్యాచ్‌లు అర్థరాత్రి దాటిన తర్వాత కూడా ముగుస్తుండటంతో ఇంటికి వెళ్లేందుకు జనం ఇబ్బందులు పడుతున్నారని, ఇది ఐపీఎల్ భవిష్యత్తుకు మంచిది కాదని ఆయన హెచ్చరించారు. ఇప్పటికే బీసీసీఐ స్లో ఓవర్ రేట్ పై జరిమానాలు విధిస్తున్నప్పటికీ, అవి సరిపోవడం లేదని మరిన్ని కఠిన నిబంధనలు కావాలని ఆయన అభిప్రాయపడ్డారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..