Headlines

India A vs Nepal: నేపాల్‌ను 26 పరుగులకే కట్టడి చేసిన భారత్.. ఇండియా-ఏ ఖాతాలో అరుదైన రికార్డు


India A vs Nepal: రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ 2026లో ఇండియా-ఏ జట్టు అదిరిపోయే ఆరంభం చేసింది. తొలి మ్యాచ్‌లో నేపాల్‌పై ఏకంగా 306 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 332 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన నేపాల్ 11.3 ఓవర్లలో కేవలం 26 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఇండియా-ఏ జట్టు లిస్ట్-ఏ క్రికెట్‌లో తన అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది.

తిలక్, కుశాగ్ర సెంచరీలతో భారీ స్కోరు

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన నేపాల్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన ఇండియా-ఏకు ఆరంభంలో ఎదురుదెబ్బలు తగిలాయి. అభిషేక్ శర్మ 9 పరుగులు, ఆయుష్ బదోని 2 పరుగులకే వెనుదిరిగారు. వైభవ్ సూర్యవంశీ 32 బంతుల్లో 26 పరుగులు చేసి ఔటయ్యాడు. దీంతో భారత్ 42 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో కెప్టెన్ తిలక్ వర్మ, వికెట్ కీపర్ బ్యాటర్ కుమార్ కుశాగ్ర జట్టును ఆదుకున్నారు.

206 పరుగుల భాగస్వామ్యం

కష్టాల్లో ఉన్న భారత జట్టును తిలక్ వర్మ, కుమార్ కుశాగ్ర అద్భుతంగా ఆదుకున్నారు. ఇద్దరూ కలిసి నాలుగో వికెట్‌కు 206 పరుగులు జోడించారు. కుశాగ్ర 102 బంతుల్లో 117 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. కెప్టెన్ తిలక్ వర్మ 113 బంతుల్లో 107 పరుగులు సాధించాడు. అతడి ఖాతాలో 6 ఫోర్లు, 4 సిక్సర్లు చేరాయి. చివర్లో సూర్యాన్ష్ షెడ్గే 14 బంతుల్లోనే 36 పరుగులు చేసి స్కోరు పెంచాడు. దీంతో ఇండియా-ఏ 50 ఓవర్లలో 332/9 పరుగులు చేసింది. నేపాల్ ముందు 333 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

నేపాల్ బ్యాటర్లపై ప్రిన్స్ యాదవ్ దాడి

333 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నేపాల్ బ్యాటింగ్ పూర్తిగా తడబడింది. భారత బౌలర్లు ఆరంభం నుంచే వికెట్లు పడగొట్టారు. ప్రిన్స్ యాదవ్ అద్భుతంగా బౌలింగ్ చేసి 5 ఓవర్లలో కేవలం 6 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు. హర్షిత్ రాణా 6 ఓవర్లలో 16 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. షాబాజ్ అహ్మద్ ఒక వికెట్ తీసుకున్నాడు. భారత బౌలర్ల ధాటికి నేపాల్ బ్యాటర్లలో ఒక్కరు కూడా రెండంకెల స్కోరు చేయలేకపోయారు. రషీద్ ఖాన్, పవన్ సరాఫ్ చెరో 6 పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు.

11.3 ఓవర్లలోనే నేపాల్ ఇన్నింగ్స్ ముగింపు

నేపాల్ జట్టు 11.3 ఓవర్లలో కేవలం 26 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఇండియా-ఏ 306 పరుగుల భారీ తేడాతో గెలిచింది. ఈ విజయం లిస్ట్-ఏ క్రికెట్‌లో ఇండియా-ఏ జట్టుకు అతిపెద్దది. అంతకుముందు 2018లో లీసెస్టర్‌షైర్‌పై 281 పరుగుల తేడాతో గెలవడమే ఆ జట్టు అత్యుత్తమ రికార్డుగా ఉండేది. ఇప్పుడు నేపాల్‌పై సాధించిన 306 పరుగుల విజయంతో ఆ రికార్డును భారత్ అధిగమించింది.

లిస్ట్-ఏ చరిత్రలో నేపాల్‌కు ఐదో అత్యల్ప స్కోరు

నేపాల్ చేసిన 26 పరుగులు లిస్ట్-ఏ క్రికెట్ చరిత్రలో అత్యల్ప స్కోర్ల జాబితాలో ఐదో స్థానంలో నిలిచాయి. ఈ జాబితాలో వెస్టిండీస్ అండర్-19 జట్టు 2007లో బార్బడోస్‌పై చేసిన 18 పరుగులు మొదటి స్థానంలో ఉన్నాయి. 2012లో సరసెన్స్ జట్టు 19 పరుగులు, 1974లో మిడిల్‌సెక్స్ 23 పరుగులు, 2019లో ఒమన్ 24 పరుగులు చేసి అంతకంటే తక్కువ స్కోర్లతో ఆలౌట్ అయ్యాయి. ఇప్పుడు నేపాల్ కూడా ఈ జాబితాలో చేరింది. మరోవైపు, ఈ భారీ విజయంతో రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌లో ఇండియా-ఏ జట్టు తన సత్తా చాటింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *