Hyderabad Metro: ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మెట్రో విషయంలో రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం

Hyderabad Metro: ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మెట్రో విషయంలో రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం


ఇప్పటి వ‌ర‌కు ఎల్ అండ్ టీ ఆధీనంలో ఉన్న మెట్రో రైలును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. హైద‌రాబాద్ మెట్రో రైలు ఫేజ్‌-Iను Hyderabad Metro Rail Limited ద్వారా స్వాధీనం చేసుకోవాల‌ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ‌తంలోనే నిర్ణయించింది. ఈ మేర‌కు ఎల్ అండ్ టీతో కొద్ది రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు నిర్వహించింది. ఈ నేప‌థ్యంలో తాజాగా ఎండ్‌ అండ్ టీ ప్రథినిధులతో సచివాలంలో సమావేశమైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, HMRL చైర్మన్ కె. రామకృష్ణారావు, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ సమక్షంలో ఈ షేర్ల కొనుగోలు ఒప్పందం కుదిరింది

ఈ ఒప్పందం ప్రకారం LTMRHLకు ఉన్న వంద శాతం షేర్లను రూ.1,461.47 కోట్ల ఈక్విటీ విలువకు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఒప్పందంపై HMRL తరఫున ఎండీ సర్ఫరాజ్ అహ్మద్, ఎల్‌ అండ్‌ టీ త‌ర‌ఫున‌ డి.కె.సేన్, LTMRHL త‌ర‌ఫున‌ కేవీబీ రెడ్డి సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం 2026 ఏప్రిల్ 30వ తేదీ నాటికి LTMRHLపై ఉన్న రూ. 13,538.53 కోట్ల అప్పును, ఇకపై తెలంగాణ ప్రభుత్వ హామీతో రీఫైనాన్స్ చేయనున్నారు. ఈ భారీ లావాదేవీకి IDBI Capital ట్రాన్సాక్షన్ అడ్వైజర్‌గా వ్యవహరించగా, Saraf and Partners లీగల్ అడ్వైజరీ సేవలను అందించింది.

ప్రయాణికులకు మరింత చేరువగా..

హైదరాబాద్‌ నగరంలో 2017 నవంబర్‌లో ప్రారంభమైన హైదరాబాద్ మెట్రోను ఎల్‌ అండ్ టీ సంస్థ ప్రస్తుతం మూడు కారిడార్లలో 69 కిలోమీటర్ల నెట్‌వర్క్‌తో హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-Iను నిర్వహిస్తోంది. నిత్యం సుమారు 4.50 లక్షల మంది ప్రయాణికులు ఈ మెట్రోలో ప్రయాణిస్తున్నారు. మెట్రో ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు సుమారు 86 కోట్ల ప్రయాణాలు నమోదయ్యాయి. హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్–Iను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవ‌డంతో ఫేజ్–I, ప్రతిపాదిత ఫేజ్–II నెట్‌వర్క్ రూప‌క‌ల్పన‌, ప‌నులు, ప్రణాళిక‌, అమలు, సేవల అందజేతలో సమన్వయం సాధ్యమవుతుంది. భ‌విష్యత్‌లోనూ హైదరాబాద్ నగరానికి మరింత సమగ్ర, ఆధార‌ప‌డద‌గిన‌, ప్రయాణికులకు అనుకూలమైన మెట్రో రైలు నెట్‌వర్క్ ఏర్పడుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

సీఎంతో ఎల్ అండ్ టీ ఛైర్మన్ భేటీ

ఈ కీలక ఒప్పందానికి ముందుగా ఎల్ అండ్ టీ ఛైర్మన్, ఎండీ ఎస్.ఎన్. సుబ్రహ్మణ్యన్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర అభివృద్ధి, మెట్రో ప్రాజెక్టు బదలాయింపు తదితర అంశాలపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *