Headlines

Hyderabad: చనిపోయిన సింబా పేరుతో లక్కీ డ్రా.. వినాయకుడి లడ్డూ ఆమెకే


Hyderabad: చనిపోయిన సింబా పేరుతో లక్కీ డ్రా.. వినాయకుడి లడ్డూ ఆమెకే

వినాయక చవితి వేడుకల్లో భాగంగా నిర్వహించిన లడ్డూ లక్కీ డ్రా ఓ కుటుంబానికి ఊహించని అనుభూతిని మిగిల్చింది. సఫిల్‌గూడకు చెందిన లక్ష్మి.. తనకు ఎంతో ఇష్టమైన పెంపుడు కుక్క ‘సింబా’ పేరుతో తీసుకున్న లక్కీ డ్రా టికెట్‌ ఏకంగా విజేతగా నిలవడంతో ఆనందంతో పాటు భావోద్వేగానికి గురయ్యారు. లక్ష్మికి సింబా అంటే ఎంతో అభిమానం. కొంతకాలంగా ఆమె కుటుంబంలో ఓ సభ్యుడిలా ఉన్న సింబా.. నెల రోజుల క్రితం మృతి చెందింది. దీంతో దాని జ్ఞాపకాలు లక్ష్మిని వెంటాడుతూనే ఉన్నాయి. సింబా తమతో లేకపోయినా.. దాని జ్ఞాపకం మాత్రం తమ మధ్య ఉండాలనే భావనతో రూ.30 విలువైన లక్కీ డ్రా టికెట్‌ను సింబా పేరుతో తీసుకున్నారు. అయితే వందలాది టికెట్ల మధ్య నిర్వహించిన లక్కీ డ్రాలో ఊహించని అద్భుతం చోటుచేసుకుంది. నిర్వాహకులు తీసిన విజేత చీటీలో ‘సింబా’ పేరు ఉండటంతో అక్కడున్నవారంతా ఆశ్చర్యపోయారు. సింబా పేరుతో తీసుకున్న టికెట్‌కే గణేశుడి లడ్డూ దక్కడం లక్ష్మికి మరింత ప్రత్యేకంగా అనిపించింది.

ఇక్కడ మరో విశేషం కూడా ఉంది. సింబా మృతి చెంది సరిగ్గా నెల రోజులు పూర్తయిన సమయంలోనే ఈ లక్కీ డ్రా నిర్వహించారు. సింబా తమను విడిచి వెళ్లిన బాధలో ఉన్న లక్ష్మికి.. అదే సింబా పేరుతో వినాయకుడి లడ్డూ రావడం భావోద్వేగానికి గురిచేసింది. దీంతో ఈ ఘటనను ఆమె ఓ సాధారణ లక్కీ డ్రా ఫలితంగా కాకుండా.. సింబా తనకు అందించిన ఓ మధురమైన జ్ఞాపకంగా భావిస్తున్నారు. ‘సింబా మా కుటుంబంలో ఒక సభ్యుడిలా ఉండేది. అది ఇప్పుడు మా మధ్య లేకపోయినా.. దాని పేరు మాత్రం మా జీవితంలో ఎప్పటికీ ఉంటుంది. సింబా పేరుతో తీసుకున్న టికెట్‌కు వినాయకుడి లడ్డూ రావడం నాకు చాలా ప్రత్యేకంగా అనిపించింది’ అని లక్ష్మి భావోద్వేగం వ్యక్తం చేశారు. తన పెంపుడు కుక్కను కోల్పోయిన బాధలో ఉన్న సమయంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడంతో.. సింబా వల్ల తనకు వినాయకుడి ఆశీర్వాదం లభించిందని లక్ష్మి నమ్ముతున్నారు. సాధారణంగా లక్కీ డ్రా అంటే అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రక్రియే అయినా.. లక్ష్మికి మాత్రం ఈ లడ్డూ వెనుక తనకు ఎంతో ప్రియమైన సింబా జ్ఞాపకం ముడిపడి ఉంది.

దీంతో సఫిల్‌గూడలో జరిగిన ఈ లడ్డూ లక్కీ డ్రా ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. వేలాది చీట్లలో ఓ పెంపుడు కుక్క పేరు విజేతగా రావడం మాత్రమే కాకుండా.. దాని యజమాని అదే పేరుతో టికెట్ తీసుకోవడం, సింబా మృతి చెంది నెల రోజులు పూర్తయిన సమయంలోనే ఈ ఘటన జరగడం లక్ష్మికి జీవితాంతం గుర్తుండిపోయే అనుభూతిగా మిగిలిపోయింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *