Headlines

పసికందుగా ఉన్నప్పుడు తనను కాపాడాడు.. ఇప్పుడు ఆమే అతనికి ఆసరాగా నిలిచింది..


పసికందుగా ఉన్నప్పుడు తనను కాపాడాడు.. ఇప్పుడు ఆమే అతనికి ఆసరాగా నిలిచింది..

1994 ఏప్రిల్ 30వ తేదీన.. ఓ నవజాత శిశువు లండన్‌లోని ఓ ఫోన్ బూత్‌లో కనిపించింది.  బొడ్డు తాడుతో ఉన్న శిశువును అక్కడికి వచ్చిన జో క్యాంప్‌బెల్ అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి మొదట ఓ చిప్ప్‌ పాకెట్‌ అని భావించాడు. దగ్గరకు వెళ్లి చూసేసరికి.. అందులో పసిబిడ్డ ఉంది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అలా.. ఏప్రిల్‌ జీవితాన్ని మార్చాడు జో. ఆ తర్వాత ఏప్రిల్‌నుఓ కుటుంబం దత్తత తీసుకుని ఆమెకు కొత్త జీవితం ప్రసాదించింది. కానీ తనను మొదటిసారి రక్షించిన వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తిని తను ఎలాగైనా కలవాలి అని ఏప్రిల్ తపించేది.  ఇదిలా ఉంటే జో కూడా ఆ చిన్నారిని మర్చిపోలేదు. ఏప్రిల్‌ ను ఆమె చిన్నతనంలో కలవడానికి జోకు అవకాశం లేకుండా పోయింది. వారి మధ్య ఎలాంటి సంబంధం ఏర్పడలేదు. సంవత్సరాలు గడిచిపోయాయి. పసికందుగా ఫోన్ బూత్‌లో దొరికిన ఆ అమ్మాయి పెద్దదైంది.

22 ఏళ్ల తర్వాత.. ఊహించని మలుపు!

2016లో ఏప్రిల్‌కు 22 ఏళ్లు నిండాయి. తనను రక్షించిన వ్యక్తిని ఎలాగైనా కలవాలని ఆమె నిర్ణయించుకుంది. అందుకోసం జోను వెతుకుతూ ఓ పబ్లిక్ అప్పీల్ చేసింది. ఆ వార్త జో కంటపడింది. 22 ఏళ్ల తర్వాత తనను రక్షించిన జోను కలుసుకుంది. అది ఆ ఒక్కసారితో ఆగిపోలేదు. వారిద్దరూ ప్రతి వారం కలుసుకుంటూనే ఉన్నారు.

‘అతను నా కుటుంబమే..’

జోతో తన అనుబంధం గురించి ఏప్రిల్ భావోద్వేగంతో,  జో ఇప్పుడు తన కుటుంబసభ్యుడనీ తను అతన్ని దత్తత తీసుకున్నట్లుగా భావిస్తున్నట్లు తెలిపింది.  జో పిల్లలను తన సోదరులు, సోదరీమణులుగా భావిస్తున్నట్లు ఏప్రిల్ చెప్పింది. ఇద్దరూ ఒకరి ఇళ్లకు మరొకరు వెళతారు కలిసి సమయం గడుపుతారు.  కానీ ఓ ప్రశ్న మాత్రం జో ను ఇంకా వెంటాడుతూనే ఉంది!  బ్యాంక్ లో పనిచేస్తున్న ఏప్రిల్ జీవితంలో మరో వ్యక్తి గురించి ఎన్నో ప్రశ్నలు మిగిలిపోయాయి.  తనను ఫోన్ బూత్‌లో వదిలేసింది ఎవరు? జన్మనిచ్చిన తల్లి ఎందుకు చేసింది?  ఈ ప్రశ్నలకు సమాధానాల కోసం ఏప్రిల్ ఎదురు చూసింది. 2016లో తనకు జన్మనిచ్చిన తల్లిని కలిసే ప్రయత్నం చేసింది. ఆమె చిరునామా సంపాదించి ఇంటికి వెళ్లి కలిసి కొంతసేపు మాట్లాడింది.  కానీ ఆ తర్వాత  ఆమె నుంచి ఎలాంటి స్పందన రాలేదట.

తనను  ఫోన్ బూత్ లో  ఎందుకు వదిలేసావు?  కన్న తల్లి సమాధానాలు తెలుసుకోవాలన్న కోరిక తనలో ఇప్పటికీ ఉందని ఏప్రిల్ చెబుతోంది. “నా ప్రశ్నలకు కన్న తల్లి సమాధానాలు వినాలని ఉంది” అంటోంది ఏప్రిల్. అయితే ప్రస్తుతం ఆమె కఠిన వాస్తవాన్ని అంగీకరిస్తోంది. తన తల్లి నుంచి ఆ సమాధానాలు ఇక ఎప్పటికీ రాకపోవచ్చని భావిస్తోంది.

‘నీకు అమ్మ లేకపోయినా.. నువ్వు ఇంత మంచి అమ్మవి ఎలా అయ్యావు?’ ఓ రోజు కుమార్తె అడిగిన ప్రశ్న ఏప్రిల్‌ను భావోద్వేగానికి గురిచేసింది. “అది సహజంగానే వస్తుంది కదా” అని చెప్పింది. అప్పుడు ఆ చిన్నారి మరో ప్రశ్న వేసింది. “మరి నీ అమ్మ నీకు అమ్మగా ఎందుకు ఉండలేకపోయింది?” ఆ ప్రశ్నకు మాత్రం ఏప్రిల్ దగ్గర సమాధానం లేదు.

22 ఏళ్ల క్రితం ప్రాణాలు కాపాడిన వ్యక్తికి తోడుగా!

జోతో ఏప్రిల్ బంధం ఇప్పుడు మరింత బలపడింది. ఇటీవల 82 ఏళ్ల వయసులో జోకు మోకాలి శస్త్రచికిత్స జరిగింది. చాలా కాలంగా మోకాళ్ల సమస్యతో బాధపడుతున్నా..ఆపరేషన్‌ను వాయిదా వేసుకుంటూ వచ్చాడట. ఆపరేషన్‌ తర్వాత విశ్రాంతి అవసరమైనా ఏప్రిల్ ఇంటికి రావడం మానుకోలేదట. ఓ రోజు జో నడవడానికి ఇబ్బంది పడుతూనే ఏప్రిల్ ఇంటికి వచ్చాడు.  అతను ఖాళీ చేతులతో రాలేదు. ఆమె కోసం సరుకులు, బహుమతులు, పెర్ఫ్యూమ్ కూడా తీసుకొచ్చాడు. అది చూసి ఏప్రిల్ ఆశ్చర్యపోయింది. “అర్ధరాత్రి ఏ సమయంలో ఫోన్ చేసినా.. వెంటనే నా దగ్గరకు వచ్చే వ్యక్తి జో” అని ఏప్రిల్‌ చెబుతోంది.

22 ఏళ్ల క్రితం ఓ ఫోన్ బూత్‌లో కనిపించిన పసికందున కాపాడిన జో రూపంలో ఏప్రిల్‌కు జీవితాంతం నిలిచే ఓ బంధం దొరికింది. ఇప్పుడు ఆమె తన ‘గార్డియన్ ఏంజెల్’గా భావించే జో ముందుగానే రిటైర్ అవ్వాలని కోరుకుంటోంది.ఇందుకోసం రిటైర్‌మెంట్‌కు నిధులు సమకూర్చేందుకు ఏప్రిల్ ప్రస్తుతం ఫండ్‌ రైజింగ్ చేస్తోంది. ఒకప్పుడు ఓ ఫోన్ బూత్‌లో ఒంటరిగా దొరికిన పసికందు.. ఇప్పుడు తనను కాపాడిన వ్యక్తిని ‘సొంత కుటుంబం’ గా భావించి ఆర్థికంగా  సహాయం చేయడానికి ముందుకు రావడం స్ఫూర్తిగా నిలుస్తోంది అనడంలో సందేహం లేదు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *