Headlines

Hyderabad: ఓయో హోటల్‌‌కు వచ్చిన జంట.. ఎంతకీ తెరుచుకోని డోర్.. తీరా చూస్తే..!


హైదరాబాద్ నగరంలో ఓయో హోటల్‌లో యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. మాదాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సిద్దిఖీ నగర్‌‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. విశాఖపట్నానికి చెందిన షారోన్ నిఖితా టోప్నో తన ప్రియుడు శ్రీనివాస రవి తేజతో కలిసి ఓయో యాప్ ద్వారా హోటల్‌లోని 303వ గదిని బుక్ చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. రోడ్ నంబర్-5లోని హోటల్‌లో ఇద్దరూ చెక్‌ఇన్ చేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు.

అర్ధరాత్రి సమయంలో యువతి అపస్మారకస్థితిలో పడి ఉండటంతో శ్రీనివాస రవి తేజ, హోటల్ సిబ్బంది కలిసి కొండాపూర్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న మాదాపూర్ పోలీసులు హోటల్‌కు చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

యువతి ముఖం, తలపై గాయాలు, వాపులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఆమె మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు యువతి మృతి చెందిన విషయం తెలిసిన వెంటనే ఆమెతో హోటల్‌కు వచ్చిన ప్రియుడు ఆసుపత్రి నుంచి వెళ్లిపోయినట్లు పోలీసులు తెలిపారు. దీంతో అతడి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.

హోటల్‌లోని 303వ గదిని పరిశీలించిన పోలీసులకు గోడలు, బెడ్‌షీట్‌పై రక్తపు మరకలు కనిపించినట్లు సమాచారం. గదిలో ఖాళీ బీర్, విస్కీ బాటిళ్లు కూడా గుర్తించారు. క్లూస్ టీమ్‌ను రంగంలోకి దించిన పోలీసులు ఫోరెన్సిక్ ఆధారాలను సేకరిస్తున్నారు. హోటల్‌లోని సీసీటీవీ ఫుటేజీతో పాటు ఇతర ఆధారాలను పరిశీలిస్తున్నారు.

పరారీలో ఉన్న శ్రీనివాస రవి తేజ ఫోన్ చివరి లొకేషన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత అతడి ఫోన్ స్విచ్ఛాఫ్ అయినట్లు సమాచారం. దీంతో అతడి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు గాలింపు కొనసాగిస్తున్నాయి.

యువతికి గాయాలు ఎలా అయ్యాయి? హోటల్ గదిలో అసలు ఏం జరిగింది? ఆమె మృతికి కారణం ఏమిటన్న అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం యువతి మృతిని పోలీసులు అనుమానాస్పదంగా పరిగణిస్తూ అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. పోస్టుమార్టం, ఫోరెన్సిక్ నివేదికలు వచ్చిన తర్వాతే మరణానికి అసలు కారణంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *