Headlines

Guntur: చేరదీస్తానంటూ మైనర్ బాలికను నమ్మించింది.. తీరా తీసుకువెళ్లి..


Guntur: చేరదీస్తానంటూ మైనర్ బాలికను నమ్మించింది.. తీరా తీసుకువెళ్లి..

గుంటూరు నగరంలోని పాత గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికను మాయమాటలతో వలలోకి దించి వ్యభిచారంలోకి దించిన ఘటన వెలుగులోకి వచ్చింది. బాలికను వేధిస్తున్న మహిళతో పాటు మరో మహిళ, ముగ్గురు యువకుల ప్రమేయం ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.

నగరంలోని ఓ ప్రభుత్వ కాలేజీలో ఇంటర్ చదువుతున్న బాలిక తల్లిదండ్రులు కొంతకాలంగా విడివిడిగా ఉంటున్నారు. తండ్రి గుంటూరులో ఉండగా.. తల్లి ప్రకాశం జిల్లాలో ఉంటున్నారు. దీంతో బాలిక బాలాజీనగర్‌లో నివసించే తన బాబాయి ఇంటికి తరచూ వచ్చి వెళ్తుండేది. ఈ క్రమంలో బాలికకు పావని అనే మహిళ పరిచయమైంది. బాలికకు అవసరమైన డబ్బులు ఇస్తానని, మంచి జీవితం చూపిస్తానని నమ్మించింది. ఆమె మాటలను నమ్మిన బాలిక క్రమంగా పావని చెప్పినట్లు వినడం ప్రారంభించింది. ఆ తర్వాత బాలికను వ్యభిచారంలోకి దించినట్లు ఆరోపణలు ఉన్నాయి. గుంటూరు నగరంతో పాటు ఇతర ప్రాంతాలకు కూడా బాలికను తీసుకెళ్లి లైంగిక దోపిడీకి గురిచేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

మాట వినలేదని వేధింపులు

కొంతకాలంగా బాలిక పావని చెప్పినట్లు వినకపోవడంతో ఆమె వేధింపులకు గురిచేసినట్లు తెలుస్తోంది. వేధింపులు తాళలేక బాలిక ఈ విషయాన్ని తన తండ్రికి చెప్పింది. దీంతో ఆందోళనకు గురైన తండ్రి వెంటనే బాలికను తీసుకుని పాత గుంటూరు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి పావనిని అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తులో భాగంగా మరిన్ని వివరాలు సేకరించగా.. బాలికను వ్యభిచారంలోకి దించేందుకు మరో మహిళతో పాటు ముగ్గురు యువకులు కూడా సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. వారిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ముఠా కార్యకలాపాలపై ఆరా

ఈ వ్యవహారం వెనుక పెద్ద ముఠా ఉందా? ఎంతకాలంగా ఈ తరహా కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు? మరెంత మంది బాలికలు లేదా మహిళలు బాధితులుగా ఉన్నారు? మహిళల అక్రమ రవాణాకు కూడా ఈ ముఠాకు సంబంధాలున్నాయా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

బాలికను రక్షించి హోంకు తరలించిన పోలీసులు.. ఆమె నుంచి స్టేట్‌మెంట్ తీసుకునే ప్రక్రియ కొనసాగిస్తున్నారు. బాలిక వాంగ్మూలం, దర్యాప్తులో వెలుగుచూసే ఆధారాల ఆధారంగా నిందితులపై తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు పోలీసులు తెలిపారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *