Gautam Gambhir: భారత క్రికెట్ జట్టు (Team India) ప్రస్తుత హెడ్ కోచ్ (Head Coach), భారతీయ జనతా పార్టీ (BJP) మాజీ పార్లమెంటు సభ్యుడు గౌతమ్ గంభీర్ తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah)ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశానికి సంబంధించిన కొన్ని ప్రత్యేక ఫొటోలను గంభీర్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. గౌరవనీయులైన హోంమంత్రి శ్రీ అమిత్ షా గారితో సమావేశం జరిగింది. ఆయన కేటాయించిన అమూల్యమైన సమయానికి, మార్గదర్శకత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఆయన ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానంటూ గంభీర్ ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.
అమిత్ షాకు గణేష్ విగ్రహం బహుమతి
ఈ భేటీ సందర్భంగా గౌతమ్ గంభీర్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు భగవాన్ గణేశుడి ప్రతిమను ప్రత్యేక బహుమతిగా అందించారు. వినాయకుడి విగ్రహాన్ని హోంమంత్రికి అందజేస్తున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బీజేపీతో పాత అనుబంధం ఉండటంతో పాటు, క్రీడా రంగంలో తనదైన శైలిలో రాణిస్తున్న గంభీర్‌తో అమిత్ షా దేశంలోని వివిధ అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. రాజకీయాలకు కొంతకాలంగా దూరంగా ఉంటూ కేవలం క్రికెట్ కోచింగ్‌పైనే పూర్తి దృష్టి పెట్టిన గంభీర్, అప్పుడప్పుడు ఇలా ప్రముఖ రాజకీయ నాయకులను కలవడం క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారుతోంది.
A warm meeting with Hon’ble Home Minister Shri @AmitShah ji. Grateful for his time and guidance. Wishing him continued good health and well-being. https://t.co/gdMOXZ7rUp
— Gautam Gambhir (@GautamGambhir) September 21, 2026
టీమిండియా హెడ్ కోచ్‌గా గంభీర్ ప్రయాణం
గౌతమ్ గంభీర్ 2024 జూలైలో భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ బాధ్యతలను అధికారికంగా స్వీకరించారు. బీసీసీఐ 2024 జూలై 9న ఆయనను టీమిండియా సీనియర్ పురుషుల జట్టుకు ప్రధాన శిక్షకుడిగా నియమించింది. ఆయన పర్యవేక్షణలో భారత జట్టు 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు 2026 ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకుంది. 2026 టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి భారత్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఇటీవల అఫ్ఘానిస్తాన్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను భారత్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేయడంలోనూ గంభీర్ పర్యవేక్షణలో జట్టు అద్భుత ప్రదర్శన చేసింది.
భవిష్యత్ ప్రణాళికలు
మరోవైపు, గౌతమ్ గంభీర్ కోచింగ్ శైలిపై అప్పుడప్పుడు కొన్ని విమర్శలు కూడా వస్తుంటాయి. ఆయన హయాంలో భారత్ సొంతగడ్డపై న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా చేతుల్లో టెస్ట్ సిరీస్‌లను కోల్పోయింది. అలాగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలోనూ జట్టు ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేకపోవడం చర్చకు దారితీసింది. అయినప్పటికీ, పరిమిత ఓవర్ల క్రికెట్‌లో గంభీర్ పర్యవేక్షణలో భారత జట్టు వరుసగా రెండు ప్రధాన ఐసీసీ టైటిళ్లను సాధించింది. ప్రస్తుతం గంభీర్ భారత జట్టు హెడ్ కోచ్‌గా తన బాధ్యతలను కొనసాగిస్తున్నారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..