Headlines

ఎయిర్ హోస్టెస్ కావాలనుకున్న యువతి ట్రక్ డ్రైవింగ్‌కి.. ఓ అమ్మాయి షాకింగ్ జర్నీ


హిమాచల్ ప్రదేశ్‌లోని మండి జిల్లా సర్కాఘాట్‌కు చెందిన ఖుడ్లా గ్రామంలో నేహా ఠాకూర్ నివసిస్తున్నారు. రాష్ట్రంలో తొలి మహిళా ట్రక్ డ్రైవర్‌గా ఆమెకు గుర్తింపు లభించింది. ప్రస్తుతం దేశంలోని వివిధ ప్రాంతాలకు భారీ వాణిజ్య వాహనంతో ప్రయాణిస్తూ, తన అనుభవాలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు.

ఎయిర్ హోస్టెస్ శిక్షణ నుంచి ట్రక్ డ్రైవింగ్ వైపు..

నేహా తండ్రి మనోజ్ ఠాకూర్ రెండు దశాబ్దాలకు పైగా రవాణా వ్యాపారంలో ఉన్నారు. చిన్నతనంలోనే తండ్రితో కలిసి ట్రక్కుల్లో ప్రయాణించే నేహాకు వాటిపై ప్రత్యేక ఆసక్తి ఏర్పడింది. తన ఇన్‌స్టాగ్రామ్ వ్లాగ్‌లో నేహా గతాన్ని గుర్తుచేసుకుంటూ.. తన తండ్రి చిన్నప్పుడు తనను ట్రక్కులోనే పాఠశాలకు తీసుకెళ్లేవారని చెప్పింది. అలా చిన్న వయసులోనే భారీ వాహనాలపై ఆమెకు ఆసక్తి పెరిగింది. గ్రాడ్యుయేషన్ అనంతరం నేహా చండీగఢ్‌కు వెళ్లి ఎయిర్ హోస్టెస్ శిక్షణ తీసుకుంది. అయితే కోవిడ్-19 మహమ్మారి కారణంగా విమానయాన రంగం తీవ్రంగా ప్రభావితమవడంతో ఆమె కెరీర్ ప్రణాళికలు మారిపోయాయి. సొంతూరికి తిరిగి వచ్చిన నేహా.. తనకు చిన్నప్పటి నుంచి ఉన్న ట్రక్కులపై ఆసక్తిని వృత్తిగా మార్చుకోవాలని నిర్ణయించుకుంది. భారీ వాహనాన్ని నడపడం కోసం గేర్లు, క్లచ్, బ్రేకులు వంటి అంశాల్లో ప్రత్యేక శిక్షణ తీసుకుంది. డ్రైవింగ్ స్కూల్‌లో శిక్షణ పూర్తి చేసి 2023లో, తన 21 ఏళ్ల వయసులో హెవీ మోటార్ వెహికల్ (HMV) డ్రైవింగ్ లైసెన్స్ పొందింది.

మహిళ ట్రక్ డ్రైవర్‌గా మారాలనే నేహా నిర్ణయానికి ఆమె తండ్రి మనోజ్ ఠాకూర్ అండగా నిలిచారు. సమాజం నుంచి విమర్శలు, సందేహాలు ఎదురైనా కుటుంబానికి చెందిన ట్రక్కుతో ఆమెకు డ్రైవింగ్‌లో తండ్రి శిక్షణ ఇచ్చారు. నేహా మాట్లాడుతూ.. సంప్రదాయంగా మహిళలకు అనుకూలం కాదని భావించే రంగాల్లోకి వెళ్లాలనుకునే అమ్మాయిలు ఇతరులు ఏమనుకుంటారోనని తమను తాము ఆపుకోవద్దని సూచించింది. తన ప్రయాణంలోనూ ఎన్నో సవాళ్లు ఎదురైనా తనపై తాను నమ్మకం ఉంచుకుని ముందుకు సాగానని తెలిపింది. ప్రారంభంలో నేహా స్థానిక ప్రాంతాల్లోనే ట్రక్ నడిపేది. క్రమంగా సుదూర ప్రయాణాలు చేయడం ప్రారంభించింది. ప్రస్తుతం 12 టన్నుల టాటా ట్రక్కును నడుపుతూ వివిధ రాష్ట్రాల మధ్య నిర్మాణ సామగ్రి, వ్యవసాయ ఉత్పత్తులను రవాణా చేస్తున్నట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. కొండ ప్రాంతాల్లో భారీ వాహనం నడపడం అంత సులభం కాదు. ఇరుకైన రహదారులు, పొగమంచు, వర్షాలు, ఎత్తుపల్లాలు వంటి పరిస్థితుల్లో ఎంతో అప్రమత్తంగా ఉండాలి. సుదీర్ఘ ప్రయాణాల కారణంగా భోజన సమయాల్లో మార్పులు, వాతావరణ పరిస్థితుల్లో తేడాలు, రాత్రిళ్లు ఇంటికి దూరంగా ఉండటం వంటి సవాళ్లను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి



తన ట్రక్ ప్రయాణాలను నేహా సోషల్ మీడియాలో వీడియోలు, వ్లాగ్‌ల రూపంలో పంచుకుంటోంది. రోజువారీ జీవితం, సుదూర ప్రయాణాలు, భారీ వాహనాన్ని నడపడంలో ఎదురయ్యే అనుభవాలను వీడియోల ద్వారా చూపిస్తోంది. ఆమె వీడియోలకు క్రమంగా ఆదరణ పెరగడంతో సోషల్ మీడియాలో పెద్ద సంఖ్యలో ఫాలోవర్లు ఏర్పడ్డారు. 2026లో ప్రచురితమైన నివేదికల ప్రకారం.. నేహాకు యూట్యూబ్‌లో 4.5 లక్షలకు పైగా, ఇన్‌స్టాగ్రామ్‌లో 8 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నట్లు సమాచారం. తన కెరీర్‌ను పూర్తిగా మార్చుకుని, సంప్రదాయానికి భిన్నమైన రంగంలో అడుగుపెట్టిన నేహా ఠాకూర్ ప్రయాణం.. ఆసక్తి ఉన్న రంగంలో ధైర్యంగా ముందుకు సాగితే కొత్త అవకాశాలను సృష్టించుకోవచ్చనే సందేశాన్ని ఇస్తోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *