
గ్యాస్ సిలిండర్ బుక్ చేయగానే రెండు, మూడు రోజుల్లో మీ ఇంటికి డోర్ డెలివరీ అవుతుంది. అయితే సిలిండర్ డెలివరీ చేయగానే డెలివరీ బాయ్స్ అదనంగా డబ్బులు డిమాండ్ చేస్తూ ఉంటారు. గ్యాస్ కొరత క్రమంలో ఎక్కువ డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. గ్యాస్ బుక్ చేసినప్పుడు రేటు ఒకలా ఉంటే.. ఇప్పుడు ధర పెరిగడంతో ఎక్కువ చెల్లించాలని కోరుతూ ఉంటారు. అలాగే ఇంటికి తెచ్చి ఇచ్చినందుకు అదనంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తుంటారు. ఇవ్వకపోతే కస్టమర్లతో గొడవ, వాగ్వాదానికి దిగడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇలాంటి సమయంలో మీరు ఫిర్యాదు చేయవచ్చు. అదెలా అంటే..?
ఒక్క రూపాయి కూడా ఇవ్వకండి
డెలివరీ చేసినందుకు కస్టమర్లు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. నిబంధనల ప్రకారం గ్యాస్ ఏజెన్సీలు ఉచితంగా డోర్ డెలివరీ చేయాలి. గ్యాస్ ధర ఎంత అయితే ఉందో అంతవరకే తీసుకోవాలి. డెలివరీ బాయ్ అదనంగా డిమాండ్ చేస్తే మీరు ఫిర్యాదు చేయవచ్చు. డెలివరీ బాయ్‌కు కూడా మీరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ డెలివరీ బాయ్ డబ్బులు అడిగితే ఫిర్యాదు చేసేందుకు గ్యాస్ ఏజెన్సీలు హెల్ప్ లైన్ నెంబర్లను ప్రవేశపెట్టాయి. దీంతో డెలివరీ బాయ్స్ ఎక్కువ అడిగితే ఫిర్యాదు చేయాలని గ్యాస్ ఏజెన్సీలు కోరుతున్నాయి.
టోల్ ఫ్రీ నెంబర్లు ఇవే..
18002333555 నెంబర్‌కు కాల్ చేసి కస్టమర్లు ఫిర్యాదు చేయవచ్చు. ఇక ఇండేయన్ గ్యాస్ కస్టమర్లు ప్రత్యకంగా 7718955555, భారత్ గ్యాస్ వినియోగదారులు 1800224344, HP గ్యాస్ వినియోగదారులు 9222201122 నెంబర్లను కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. ఇక ఫోన్ చేసినా మీ సమస్య పరిష్కారం కాకపోతే కేంద్ర పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వశాఖ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ఫిర్యాదు చేయాలి. MoPNG e-Seva సోషల్ మీడియా అకౌంట్‌కు మీ సమస్యను ఫేస్ బుక్ లేదా ఎక్స్ ద్వారా ట్యాగ్ చేయడం ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఇక అప్పటికీ మీకు స్పందన రాకపోతే నేషనల్ కన్స్యూమర్ హెల్ప్‌లైన్ వెబ్ సైట్ సంప్రదించాలి. ఆ వెబ్ సైట్లోకి వెళ్లి రిజిస్టర్ గ్రీవెన్స్‌పై క్లిక్ చేయాలి. సైనప్‌పై క్లిక్ చేసి మీ నెంబర్, పేరు, మెయిల్ ఐడీ ఇచ్చి రిజిస్టర్ చేసుకోవాలి. ఆ తర్వాత మొబైల్ ఓటీపీ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత గ్రీవెన్స్ ఫారంలో మీ గ్యాస్ కనెక్షన్ నెంబర్, గ్యాస్ ఏజెన్సీ, మీ సమస్యను రాయాలి గ్యాస్ బిల్లు ఉంటే బిల్లు అప్ లోడ్ చేయాలి. ఆ తర్వాత సమ్మిట్ చేస్తే మీకు గ్రీవెన్స్ నెంబర్ వస్తుంది.