దేశవ్యాప్తంగా మూడు రోజులపాటు బ్యాంక్ ఉద్యోగులు తలపెట్టిన సమ్మె తాత్కాలికంగా వాయిదా పడింది. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA)తో యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) జరిపిన చర్చలు కొలిక్కరావడంతో సమ్మెను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా బ్యాంకు ఉద్యోగుల సమ్మె విరమింప చేసేందుకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ మధ్య ఉద్యోగుల డిమాండ్లకు సంబంధించి కీలక ఒప్పందాలు జరిగాయి. బ్యాంకు ఉద్యోగుల ప్రధాన డిమాండ్ అయిన అన్ని శనివారాలను సెలవులుగా ప్రకటించడం అనే అంశంపై చర్చించడానికి ఐబీఏ యూఎఫ్‌బీయూ ప్రతినిధులతో ఒక ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు కానుంది.
అన్ని వర్గాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ కమిటీ అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొంటుంది.ఇక పీఎల్ఐ పథకంపై సవరణలకు సంబంధించి స్కేల్ 4 మరియు అంతకంటే పై స్థాయి అధికారులకు సంబంధించిన పీఎల్ఐ స్కీమ్‌పై యూనియన్లు లేవనెత్తిన అభ్యర్థనలను పరిశీలించనున్నారు. ప్రభుత్వానికి తగిన సవరణలను ప్రతిపాదించేందుకు ఐబీఏతో చర్చలు జరపడానికి తద్వారా మార్గం సుగమమైంది.
పెండింగ్ సమస్యల పరిష్కారం పై కూడా చర్చలు జరగనున్నాయి.. 2024 మార్చి 8 నాటి మినిట్స్‌లో పేర్కొన్న మిగిలిన పెండింగ్ సమస్యలను కూడా త్వరగా పరిష్కరించుకోవడానికి ఐబీఏ, యూఎఫ్‌బీయూ మధ్య తదుపరి చర్చలు జరగనున్నాయి.ఐబీఏతో జరిగిన ఒప్పందాలు , సానుకూల పరిణామాల నేపథ్యంలో గతంలో ప్రకటించిన అన్ని ఆందోళన కార్యక్రమాలను, సమ్మెలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు యూఎఫ్‌బీయూ నేతలు సంయుక్త ప్రకటన విడుదల చేశారు..దీంతో ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ యధావిధిగా పనిచేయనున్నాయి.

Bank Strike Postponed
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.