Headlines

Asia Cup 2026: హ్యాట్రిక్ విజయాలతో సెమీఫైనల్‌కు భారత్.. నాకౌట్లలో టీమిండియా రికార్డులు ఎలా ఉన్నాయంటే?


Asia Cup 2026: హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలో భారత మహిళల క్రికెట్ జట్టు ఆసియా కప్ 2026 టోర్నీలో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. గ్రూప్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ వరుస విజయాలు సాధించి 6 పాయింట్లతో టేబుల్ అగ్రస్థానంలో నిలిచి సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. ఆగస్టు 30న థాయ్‌లాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లోనే భారత్ 94 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి శుభారంభం చేసింది. షెఫాలీ వర్మ 36 బంతుల్లో 64 పరుగులు చేసి చెలరేగగా, థాయ్‌లాండ్ కేవలం 65 పరుగులకే కుప్పకూలింది. ఆ తర్వాత హాంగ్‌కాంగ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో స్మృతి మంధాన 64 బంతుల్లోనే 124 పరుగులు చేసి విధ్వంసం సృష్టించడంతో భారత్ 137 పరుగుల తేడాతో గెలిచింది. సెప్టెంబర్ 5న జరిగిన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో పోరులో శ్రీ చరణి, ప్రేమా రావత్ తలో 3 వికెట్లు పడగొట్టి పాక్‌ను టీ20ల్లో వారి అత్యల్ప స్కోరు 55 పరుగులకే ఆలౌట్ చేశారు. 8.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి 7 వికెట్ల తేడాతో భారత్ ఘనవిజయం సాధించింది.

ఈ టోర్నీలో భారత ఓపెనర్ స్మృతి మంధాన అద్భుతమైన ఫార్మ్‌లో కొనసాగుతోంది. 3 మ్యాచ్‌ల్లో 50.66 సగటు, 178.82 స్ట్రైక్ రేట్‌తో 152 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచింది. బౌలింగ్ విభాగంలో దీప్తి శర్మ కేవలం 1.90 ఎకానమీ రేట్‌తో 8 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో జట్టు ప్రదర్శిస్తున్న ఈ సమష్టి కృషి వల్ల ప్లస్ 5.471 నెట్ రన్ రేట్‌తో భారత్ అధికారికంగా నాకౌట్ దశకు చేరుకుంది.

టీ20 అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్, ఫైనల్స్ కలిపి భారత మహిళల జట్టు ఇప్పటివరకు 19 నాకౌట్ మ్యాచ్‌లు ఆడింది. అందులో 8 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, 10 మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసింది. ఒక మ్యాచ్ ఫలితం తేలకుండా రద్దయింది. ఓవరాల్ నాకౌట్లలో భారత జట్టు గెలుపు శాతం 42.10గా నమోదైంది. పొట్టి ఫార్మాట్ నాకౌట్ ఒత్తిడిలో భారత జట్టు విజయం సాధించడానికి తీవ్రంగా శ్రమించాల్సి వస్తోందని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

సాధారణ టీ20 నాకౌట్ రికార్డులు కాస్త ఆందోళన కలిగించినప్పటికీ, ఆసియా కప్ టోర్నమెంట్లలో మాత్రం భారత మహిళల జట్టుకు తిరుగులేని రికార్డు ఉంది. ఆసియా కప్‌లో ఇప్పటివరకు ఆడిన 7 నాకౌట్ మ్యాచ్‌ల్లో భారత్ 5 విజయాలు సాధించి, కేవలం 2 మ్యాచ్‌ల్లో మాత్రమే ఓడిపోయింది. 2012, 2016 ఫైనళ్లలో పాకిస్థాన్‌ను ఓడించి కప్ కొట్టిన భారత్, 2022లో శ్రీలంక, థాయ్‌లాండ్‌లను నాకౌట్లలో చిత్తు చేసింది. 2024 ఆసియా కప్ సెమీఫైనల్‌లో బంగ్లాదేశ్‌పై 10 వికెట్లతో నెగ్గినప్పటికీ, ఫైనల్‌లో శ్రీలంక చేతిలో ఓటమి పాలైంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *