Headlines

AndhraPradesh: ఇకపై ఆ బస్సుల్లో కూడా మహిళలకు ఫ్రీ జర్నీ.. ఉచిత బస్సు పథకంపై ఏపీ ప్రభుత్వం బిగ్ డెసిషన్..


ఏపీ సీఎం చంద్రబాబు మహిళలకు శుభవార్త అందించారు. ఇప్పటివరకు ఆర్టీసీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్, సిటీ బస్సుల్లో అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణాన్ని త్వరలో ఏసీ బస్సుల్లో కూడా అమలు చేయనున్నట్లు ప్రకటించింది. మహిళలు చల్లటి ఏసీ బస్సులలో హాయిగా, గౌరవప్రదంగా ప్రయాణించాలనేదే తన ఆకాంక్ష అన్నారు. మహిళా సాధికారత కేవలం మాటల్లో కాకుండా చేతల్లో చూపించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో త్వరలో భారీ సంఖ్యలో కొత్త ఏసీ బస్సులను ప్రవేశపెడుతున్నామని, వీటిల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్ళుగా చూస్తూ.. ఇచ్చిన ప్రతి “సూపర్ సిక్స్” హామీని నెరవేర్చేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.

ప్రతీ నెలా ఒకటో తేదీనే..

“కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తుంది. సంక్షేమం అంటే పేదవాడి చేతికి నేరుగా లబ్ధి చేకూర్చడమే. ఈ విషయంలో కూటమి ప్రభుత్వం సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఇప్పటివరకు పెన్షన్ల రూపంలోనే పేదలకు ఏకంగా రూ.73 వేల కోట్లు అందించిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుంది. ప్రతీ నెలా ఒకటో తేదీనే నేరుగా ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ ఇచ్చే గొప్ప వ్యవస్థను తీసుకొచ్చాం. అంతేకాకుండా ఆడబిడ్డల వంటింటి కష్టాలను తీర్చేందుకు ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను అందించే దీపం పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తూ మహిళల ఆర్థిక భారాన్ని తగ్గించాం. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వ సహకారంతో రాష్ట్రానికి నిధులు రాబడుతూ సంక్షేమం,అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నాం. మెగా డీఎస్సీని అడ్డుకోవడానికి గత పాలకులు ఏకంగా 350 కేసులు వేసి అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. యువత భవిష్యత్తుతో చెలగాటమాడిన వారి కుట్రలను ఛేదించి, కోర్టులో న్యాయపోరాటం చేసి మెగా డీఎస్సీని విజయవంతంగా చేపట్టాం. ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని, ప్రజా సంక్షేమాన్ని ఎవరూ ఆపలేరు” అని చంద్రబాబు తెలిపారు.

మహిళలకు ఏసీ బస్సుల్లో ఫ్రీ జర్నీ..

త్వరలో మహిళలకు ఏసీ బస్సుల్లో కూడా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ప్రారంభించనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. మహిళలు ఎక్కడికి పోవాలన్నా వీటిని ఉపయోగించుకోవచ్చు. దర్శనాలకు, ఉద్యోగాలకు, వ్యాపారాలకు, లేదా ఇంట్లో సమస్యలు వచ్చినప్పుడు పుట్టింటికి ఆర్టీసీ ఏసీ బస్సుల్లో ఉచితంగా తిరిగే రోజు త్వరలోనే రానుందని తెలిపారు. కాగా ఏపీలో ప్రస్తుతం పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్,  సిటీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయణాన్ని అందిస్తున్నారు. దివ్యాంగులకు కూడా ఇదే బస్సుల్లో ఉచిత బస్సు సౌకర్యం అందుబాటులో ఉంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *