Headlines

‘చంపేస్తే స్కూల్‌కి సెలవులు వస్తాయనీ’.. రూమ్‌మేట్‌ను చంపేందుకు యత్నం


కడప, సెప్టెంబర్‌ 10: వారం రోజుల క్రితం అర్ధరాత్రి సమయంలో విద్యార్థులంతా నిద్రిస్తున్న వేళ ఇద్దరు విద్యార్ధులు దారుణానికి పాల్పడ్డారు. పథకం ప్రకారం బాధిత విద్యార్థి ముఖంపై దిండు పెట్టి ఇద్దరూ గట్టిగా అదిమిపట్టారు. ఊపిరాడకుండా చేయడంతో పాటు గొంతు నులిమి చంపేందుకు ప్రయత్నించారు. అకస్మాత్తుగా జరిగిన దాడితో ఉలిక్కిపడిన బాధిత విద్యార్థి ప్రాణాలను కాపాడుకునేందుకు తీవ్రంగా పెనుగులాడాడు. చివరకు నిందిత విద్యార్థుల పట్టు నుంచి తప్పించుకుని కేకలు వేస్తూ గది బయటకు పరుగులు తీశాడు. దీంతో అతడు ప్రాణాలతో బయటపడ్డాడు.

వారం రోజుల పాటు గోప్యంగా ఉంచినట్లు ఆరోపణలు

ఈ ఘటనను పాఠశాల ఉపాధ్యాయులు, యాజమాన్యం బయటకు రాకుండా గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకపోవడంతో పాటు పోలీసులకు కూడా ఫిర్యాదు చేయకుండా ఘటనను వారం రోజుల పాటు దాచినట్లు తెలుస్తోంది. అయితే విషయం స్థానికంగా బయటకు రావడంతో విద్యాశాఖ అధికారుల దృష్టికి చేరింది. సమాచారం అందుకున్న మండల విద్యాశాఖ అధికారి (ఎంఈవో) రెడ్డిబాషా బుధవారం పాఠశాలకు చేరుకుని ఘటనపై విచారణ చేపట్టారు. ఎంఈవో పాఠశాల సిబ్బందితో పాటు హత్యాయత్నానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు విద్యార్థులు, బాధిత విద్యార్థిని విడివిడిగా విచారించారు. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులను కూడా పిలిపించి మాట్లాడారు. విచారణ అనంతరం ఎంఈవో వెల్లడించిన వివరాలు మరింత ఆందోళన కలిగించాయి.

ఇవి కూడా చదవండి



రెండేళ్ల క్రితం జరిగిన ఘటనతో ప్రేరణ?

సుమారు రెండేళ్ల క్రితం ఇదే పాఠశాలలో ఓ విద్యార్థి అనుకోని పరిస్థితుల్లో మరణించాడని, ఆ సమయంలో పాఠశాలకు కొన్ని రోజుల పాటు సెలవులు ప్రకటించారని ఎంఈవో తెలిపారు. ఆ సంఘటనను గుర్తుపెట్టుకున్న ఇద్దరు బాలురు.. ఎవరినైనా చంపేస్తే ఇప్పుడు కూడా పాఠశాలకు వరుసగా సెలవులు వస్తాయని భావించినట్లు విచారణలో అంగీకరించారని చెప్పారు. ఈ ఆలోచనతోనే రూమ్‌మేట్‌ను హత్య చేసేందుకు ప్రయత్నించినట్లు వివరించారు. బాలుర వయస్సు, ఘటనకు దారితీసిన పరిస్థితులు, పాఠశాల యాజమాన్యం వ్యవహరించిన తీరుపై అధికారులు మరింతగా విచారణ చేపడుతున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా వసతి గృహాల్లో విద్యార్థుల భద్రత, పర్యవేక్షణను మరింత పటిష్ఠం చేయాల్సిన అవసరం ఉందని ఈ ఘటన స్పష్టం చేస్తోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *