Andhra Pradesh: సినిమా స్టైల్‌లో దోపిడీ.. ఒక్క క్లూ లేకున్నా పోలీసులు కేసు ఎలా సాల్వ్ చేశారో తెలుసా..?

Andhra Pradesh: సినిమా స్టైల్‌లో దోపిడీ.. ఒక్క క్లూ లేకున్నా పోలీసులు కేసు ఎలా సాల్వ్ చేశారో తెలుసా..?


సినీ ఫక్కీలో జీఎస్టీ అధికారులమంటూ వచ్చి, పట్టపగలే బంగారం షాపును దోచుకున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను శ్రీకాకుళం పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. కాశీబుగ్గ నిత్యానందనగర్‌లోని శ్రీ వెంకటేశ్వర జ్యువెలరీలో ఏప్రిల్ 7న జరిగిన ఈ సంచలన దోపిడీకి సంబంధించి ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 243 గ్రాముల బంగారు ఆభరణాలు, నాలుగు కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఏప్రిల్ 7న మధ్యాహ్నం 12 గంటల సమయంలో దుకాణ యజమాని రామకృష్ణారావు షాపులో ఒంటరిగా ఉన్న సమయంలో ఏడుగురు నిందితులు మూడు మోటార్ సైకిళ్లపై అక్కడకు చేరుకున్నారు. తాము జీఎస్టీ అధికారులమని, తనిఖీ చేయాలని చెప్పి షాపులోకి ప్రవేశించారు. లోపలికి వెళ్లగానే తమ అసలు స్వరూపాన్ని బయటపెట్టారు.

సీసీ కెమెరాల కంటికి చిక్కకుండా ఉండేందుకు వాటిపై బ్లాక్ స్ప్రే పిచికారీ చేశారు. చేతులకు గ్లౌజులు, ముఖాలకు మాస్కులు ధరించారు. యజమాని రామకృష్ణారావు చేతులకు బేడీలు వేసి, పిస్టల్‌తో బెదిరించారు. షాపులో ఉన్న సుమారు 800 గ్రాముల బంగారాన్ని దోచుకుని పరారయ్యారు. ఈ కేసులో పలాసకు చెందిన పోట్నూరు తిరుమల పాత్రో అసలు సూత్రధారిగా తేలింది. గతంలో ఒడిశాలో బంగారం షాపు నిర్వహించిన ఈయన, ప్రస్తుతం పలాసలో జీడిపప్పు వ్యాపారం చేస్తున్నాడు. ఈయనే షాపుపై రెండుసార్లు రెక్కీ నిర్వహించి, దొంగలకు రూట్ మ్యాప్, పూర్తి వివరాలు అందించాడు. దొంగిలించిన బంగారాన్ని కొనుగోలు చేసి ఇతర ప్రాంతాల్లో విక్రయించడం ఈయన పని.

అరెస్ట్ అయిన నిందితులు వీరే

పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో ఒడిశాలోని గంజాం జిల్లాకు చెందిన రామచంద్ర సాహు (A-1), కునా బరిక్ (A-2)తో పాటు ఖుర్దా జిల్లాకు చెందిన బనోజ్ బిహారి పట్నాయక్ (A-3), తపన్ మహారాణా (A-4) మరియు శ్రీకాకుళం జిల్లాకు చెందిన తిరుమల పాత్రో (A-5) ఉన్నారు. ఈ ముఠాపై ఒడిశాలో ఇప్పటికే 32 కేసులు నమోదై ఉన్నాయి. నిందితులు చాలా తెలివిగా వ్యవహరించారు. టోల్ గేట్లు, జాతీయ రహదారులు తాకకుండా గ్రామాల్లోని మారుమూల దారుల ద్వారా ప్రయాణించారు. అయితే పోలీసులు టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా కేసును ఛేదించారు. ఒక బ్యాంకు వద్ద ఉన్న సీసీ కెమెరా ద్వారా నిందితుల వాహనాలను గుర్తించారు. దోపిడీ చేసిన బంగారాన్ని అమ్మి నిందితులు రెండు కొత్త కార్లను కొనుగోలు చేశారు. వాహనాల ఫైనాన్స్ వివరాలు, ఆధార్, మొబైల్ నంబర్ల ద్వారా పోలీసులు వీరి నెట్‌వర్క్‌ను వెలికితీశారు.
మొత్తం నాలుగు పోలీసు బృందాలు ఒడిశా, ఆంధ్ర సరిహద్దుల్లో గాలించి వీరిని అదుపులోకి తీసుకున్నాయి.

బంగారం రికవరీ

దోచుకున్న 800 గ్రాముల బంగారంలో ఇప్పటివరకు 243 గ్రాముల ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే నిందితులు దోపిడీకి వాడిన రెండు కార్లు, దొంగ సొత్తుతో కొన్న రెండు కొత్త కార్లను కలిపి మొత్తం 4 కార్లను సీజ్ చేశారు. ఈ కేసులో పరారీలో ఉన్న ఉత్తరప్రదేశ్ గ్యాంగ్ సభ్యుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. పట్టపగలు జరిగిన ఈ భారీ దోపిడీ కేసును చాకచక్యంగా ఛేదించిన సిబ్బందిని జిల్లా ఉన్నతాధికారులు అభినందించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *